Wednesday, 17 December 2014

OUR RAMESWARAM-KASI-RAMESWARA YATRA PART 2


రామేశ్వరం-కాశీ- రామేశ్వరం యాత్ర-2

గతంలో వివరించిన మా రామేశ్వర యాత్ర తరువాత భాగమైన   కాశీయాత్ర చేయాలన్న సంకల్పముతో మా గురువుల యొక్క, మా తల్లిగారి యొక్క ఆశీర్వచనములు తీసుకొని, మాదంపతులు రెండవభాగంగా కాశీ పుణ్యక్షేత్రమునకు తేదీ 08.12.14 న బెంగుళూరులో ఉదయం గం.10 లకు బయలుదేరేము. ముందుగా మొగల్ సరాయ్ నగరము తేదీ 10.12.14 ఉదయం 8 గంటలకి చేరుకొన్నాము.

మొదటిరోజు ( 10.12.14)
 TRIVENI SANGAM               BADE HANUMAN TEMPLE            HANUMAN                MADHAVESWARI TEMPLE
 
అక్కడ రైల్వే విశ్రాంతిగదులలో స్నానాదులు ముగించుకొని, తరువాత అల్పాహారము చేసి, అచ్చటకు 125 కి.మీ దూరములో ఉన్న ప్రయాగ క్షేత్రమునకు రానుపోను ప్రయాణానికి రూ. 3,000 లకు ఒక కారు మాట్లాడుకొని 9 గంటలకు బయలుదేరి 12 గంటలకు ప్రయాగ చేరేము. ప్రయాగ క్షేత్రములో చేయదలచుకొన్న స్నాన సంకల్పము, వేణీదాన పూజ, వేణుమాధవ లింగ  (రామేశ్వరమునుండి పూజచేసి తెచ్చిన సైకతలింగము) నిమజ్జన పూజ మొదలైన కార్యక్రమము మాచే చేయించుటకు, అక్కడ ఉన్న కంచిమఠము వారిని సంప్రదించి ఏర్పాటు చేసుకొన్నాము. వారు ఈ కార్యక్రమములు మాచే జరిపించుటకు భోజన వ్యవస్థతో కలిపి సుమారు రూ. 1500 లు చార్జి చేసేరు. పూజను ముగించుకొని గంగ, యమున, సరస్వతి
నదుల త్రివేణి సంగమ క్షేత్రములో వేణీదానము,వేణుమాధవ లింగ నిమజ్జన,  త్రివేణీ సంగమ పుణ్యస్నానము చేసుకొన్నాము. ఈ మొత్తము కార్యక్రమమునకు సుమారు 3 గంటల కాలము పట్టినది.

కంచిమఠములో భోజనము ముగించుకొన్న తరువాత ప్రయాగక్షేత్రములో నున్న మాధవేశ్వరీ అమ్మవారి (ప్రయగే మాధవేశ్వరీ.... శక్తిపీఠము) ఆలయము, వేణుమాధవుని ఆలయము, సోమేశ్వరస్వామి అలయము, బడే హనుమాన్ దేవాలయము దర్శించుకొని సాయంత్రము సుమారు 4.30 గంటలకు బయలుదేరి తిరిగి మొగల్ సరాయ్ లో మేము తీసుకొన్న రైల్వేబసకు చేరుకొన్నాము.

రెండవ రోజు (11.12.14)
VARANASI STATION                             KASHI SNAN GHATS                               GANGA HARATI

మరునాడు ఉదయము స్నానాదులు ముగించుకొని 7 గంటలకు బయలుదేరి అక్కడకు 15 కి.మీ దూరములో ఉన్న కాశీ క్షేత్రము చేరుకొన్నాము. అక్కడ కంచిమఠములో బస ఏర్పాటు చేసుకొన్నాము. నాన్ ఏ.సి. డబుల్ రూము రోజుకు 500  అద్దె. వారే బోటులో అన్నిఘాట్ లు చూపించుటకు మరియు స్నానముచేయించుటకు 600 చార్జీ తీసుకొంటారు. మేము వారు ఏర్పాటుచేసిన బోటులో అన్నిఘాట్ లు చూసుకొని అక్కడ ఉన్న ఆలయముల దర్శనము చేసుకొన్నాము. అవి

    1.               కాలభైరవ ఆలయము (ముందుగా కాలభైరవుని దర్శించికొని       
ఆయన అనుమతితో విశ్వనాథుని దర్శనము చేసుకోవాలని ప్రతీతి)

2.               దండాయుధపాణి (సుబ్రహ్మణ్యేశ్వరుడు) ఆలయము

3.               బిందుమాధవ ఆలయము ( పంచ మాథవ ఆలయములు కాశీలో బిందుమాధవుడు, ప్రయాగలొ వేణుమాధవుడు, రామేశ్వరములో సేతుమాధవుడు, పిఠాపురంలో కుంతి మాధవ, తిరువనంతపురములో సుందరమాధవుడు ఉన్నాయి)

4.               విశ్వనాథుని ఆలయము, జ్ఞాన వాపి ( విశ్వనాథుడుగా వెలసిన లింగము మొగలుల దాడులలో ఆలయ అర్చకులు ఇక్కడ ఉన్నబావిలో నిక్షిప్తం చేసేరు. ఈ బావిలో నీరు తీర్థంగా పుచ్చుకొంటే విశ్వనాథుడు జ్ఞానమును అనుగ్రహిస్తాడని ప్రతీతి. విశ్వనాథుడు మొదటగా ఇక్కడే వెలిసేడు అనడానికి నిదర్శనంగా విశ్వనాథుడు వెలసిన వైపుకి తిరిగి కూర్చొనిఉన్న పెద్దనందిని ఇప్పటికీ చూడవచ్చు)

5.               అక్షయ వట వృక్షము (విష్ణువక్షస్థలము) - (విష్ణువుయొక్క శిరస్సు ప్రయాగలోనూ, వక్షస్థలము కాశీలోనూ, పాదములు గయలోనూ ఉన్నట్లు స్థలపురాణాలు చెప్తాయి) 

6.               హనుమాన్ ఆలయము.

7.               అన్నపూర్ణాదేవి ఆలయము

8.               దుండి గణపతి ఆలయము

9.               విశాలాక్షి (వారణాస్యాం విశాలాక్షి.......శక్తిపీఠము) ఆలయము

దర్శించుకొని, అక్కడ ఉన్న అలహబద్ బ్యాంక్ కౌంటరులో సాయంకాలము 7 గంటలకు విశ్వనాథుని ఆలయములో జరిగే సప్తఋషి హారతికి టిక్కెట్లు కొనుక్కొని ( మనిషికి 125 రూ.) 12 గంటలకు మణికర్ణికా ఘాట్ కి వచ్చేము. అక్కడ ఒక పురోహితుని ద్వారా స్నానసంకల్పము చేసుకొని మాదంపతులు తీర్థస్నానము చేసేము.

అన్నీ ముగించుకొని మా బసకు చేరేసరికి సుమారు 2 గంటలు అయింది. మఠములో బోజనాదులు ముగించుకొని కొలదిసేపు విశ్రమించేము.
4.30 గంటలకు బయలుదేరి ఇంటినుండి తీసుకొని వెళ్ళిన అభిషేక సామగ్రిని, నివేదనను తీసుకొని విశ్వనాథుని ఆలయము చేరు కొన్నాము. ఆలయము చేరుకొన్న తరువాత  ప్రదక్షణ విధిగా ఉప దేవతల ఆలయములు అయిన శంఖచక్రగధా ధరుడైన శ్రీమహావిష్ణువుతో కూడి శ్రీ మహలక్ష్మి అమ్మవారి ఆలయము, పార్వతీదేవి ఆలయము, అన్నపూర్ణా దేవి ఆలయము సందర్శించుకొని విశ్వనాథుని ఆలయములో మేము మాతో తీసుకువెళ్ళిన అభిషేకవస్తువులు, నైవేద్యము విశ్వనాథునకు అర్పించి ఆయన అశీస్సులు పొందేము.

తరువాత గర్భాలయమునకు వెలుపల ఉన్న భువనేశ్వర లింగము, తారకేశ్వర లింగములను(రుద్రాభిషేకము చేసుకునేవారికి ఈ లింగములవద్ద చేయిస్తారు. ఇవి విశ్వనాథుని గర్భాలయములో ఉన్న లింగములను పోలి ఉంటాయి) దర్శించుకొని, అచ్చట ఉన్న మంటపములో పారాయణ చేసుకొన్నము. సుమారు 7 గంటల సమీపములో సప్తఋషి హారతికి టిక్కెట్లు తీసుకొన్నవారిని విశ్వనాథుని గర్భాలయము ముందు కూర్చోపెట్టేరు. ఈ కార్యక్రమము సుమారు గంటన్నరసేపు అవుతుంది   ( ఇది చూసి తరించవలసిన ఘట్టము) మహా మంగళహారతి అయిన పిదప అర్చకులకు మన ఇచ్చానుసారము దక్షిణలు సమర్పించుకొని తీర్థప్రసాదములు పొందవచ్చు. మేము స్వామివారి తీర్థప్రసాదములను స్వీకరించి మాబసకు 9 గంటల సమయమునకు చేరుకొన్నాము.

మూడవ రోజు (12.12.14)
మరునాడు ఉదయము 7 గంటలకు బయలుదేరి, ఆ రోజు శుక్రవారము అయినందువలన విశాలాక్షిమందిరములో కుంకుమఅర్చన చేసుకొని    
(అర్చక సంభావన 500రూ.) ముత్తైదువులకు మంగళద్రవ్యాలను (మేము మాతో తీసుకొనివెళ్ళేము) పంచి, అక్కడనుండి బయలుదేరి వారాహి దేవి అలయము, సాక్షి గణపతి ఆలయము దర్శించుకొని అన్నపూర్ణాదేవి ఆలయము చేరుకొన్నాము. అచ్చట మాకు అమ్మవారి
అనుగ్రహమువలన అమ్మవారి మూలవిగ్రహము యొక్క పాదాలను తాకి దర్శనముచేసుకొనే భాగ్యాన్ని పొందేము. తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణములో ఉన్న ఉప ఆలయములు – సూర్యనారాయణమూర్తి, వినాయకుడు, కాళీమాత మరియు భవానీగౌరి, సుభద్ర బలరాములతో కూడి ఉన్న జగన్నాథుడు, అన్నపూర్ణ, మహాలక్ష్మి, సరస్వతి దేవి విగ్రహములతో కూడిన మంటపము, గంగావతరణ దృశ్యము, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరు లతో ఉన్న పార్వతీ పరమేశ్వరులు, సత్యనారాయణస్వామి, అంజనేయుడు, గౌరీ శంకరులతో కూడి ఉన్న కుబేరుడు, మొదలగు ఉప ఆలయములను దర్శించుకొన్నాము.

కాశీనగరములో ఉన్న ముఖ్యదేవాలయాలని దర్శింపగోరి ఒక సైకిలురిక్షాను 500 రూ.లక్ మాట్లాడుకొని ఈ దిగువ దేవాలయాలను దర్శించుకొన్నాము.

1.మహామృత్యుంజయ ఆలయము ( అపమృత్యుదోషాలను పోగోట్టే దివ్యక్షేత్రము)

2. కృత్తివాసేశ్వరుని ఆలయము ( కాశీ విశ్వనాథుని దర్శించిన పూర్ణ ఫలము ఈ ఆలయదర్శనము వలన కలుగునని స్థలపురాణము చెప్తుంది)

3. సంకట మోచన హనుమద్దేవాలయము ( చాలా విశేషమైన దేవాలయము)

4. కౌడీ మాత ( గవ్వలమ్మ-కాశీగ్రామదేవత-విశ్వనాథుని సోదరి) అలయము.

5. తులసీ మానస మందిరము.

6. లోలార్క కుండము - సూర్యనారాయణమూర్తి అనుగ్రగమునకై ఈ కుండములో స్నానంచేసి, అక్కడ ఉన్న లోలార్కేశ్వరుని దర్శించుకొంటారు.

పై దేవాలయాలను దర్శించుకొని మాబసకు చేరుకొన్నాము. భోజనానంతరం ప్రాంతీయ బట్టల షాపింగ్ చేసుకొన్నాము.

5.30 గంటలకు దశాశ్వమేథ ఘాట్ వద్ద జరిగే గంగాహారతి వీక్షించుటకై ఒక బోటు చేయించుకొని బయలుదేరేము. 6 నుండి 8 గంటల దాకా జరిగే  ఈ హారతి చూసి తరించవలసిన మహత్తర దృశ్యము. ఈ సుందర ఘట్టాన్ని తిలకించి, మాబసకు చేరుకొన్నాము. ఫలహారములు ముగించుకొని ఆ రోజు రాత్రి 11.30 గంటల రైలులో మా బెంగుళూర్  కు తిరుగు ప్రయాణానికి రైల్వేస్టేషనుకు బయలుదేరేము.
ఆది దంపతులైన ఆ పార్వతీపరమేశ్వరులు మాకు ప్రసాదించిన ఈ దివ్య అవకాశానికి ఆ దేవదేవులకు సహస్ర కృతజ్ఞతా ప్రణామములు అర్పించుకొని 14.12.14 రాత్రి 11.30 గంటలకు మా బెంగుళూర్ చేరుకొన్నాము.

Friday, 12 September 2014

OUR GUJARAT PILIGRIMAGE


మా సౌరాష్ట్ర దేశ (గుజరాత్)యాత్ర 
 
ఉమామహేశ్వరుల అనుజ్ఞ తీసుకొని, మా గురువుల యొక్క మా తల్లిగారి యొక్క ఆశీస్సులు పొంది, సప్త మోక్షపురిలలో ఒకటైన, శ్రీకృష్ణుని నివాసమైన ద్వారవతి (ద్వారక) మరియు జ్యోతిర్లింగ స్వరూపుడైన ఆ సదాశివుని స్వయంభూః క్షేత్రములైన నాగేశ్వరము, సోమనాథ క్షేత్రములను దర్శించాలన్న సంకల్పంతో మా దంపతులము, సెప్ట్ంబర్ 1 వ తేదీ ఉదయం 11 గంటలకు బయలు దేరే వివేక్ ఎక్స్ ప్రెస్ లో బెంగళూర్ లో బయలుదేరి 3 వ తేదీ తెల్లవారుఝామున 3 గంటలకు ద్వారకా నగరము చేరేము. శ్రీ కృష్ణుని మందిరమునకు దగ్గరలొ ఉన్న “ సిటీ పేలెస్” అనే హోటల్ లో ముందుగా ఏర్పాటు చేసుకొన్న బసలో దిగేము. కొంతసేపు విశ్రమించిన తరువాత మా నిత్య దైనందిన, దైవిక కార్యక్రమములు ముగించుకొని ఉదయం 8 గంటలకు బయలుదేరి, 16 కి.మీ. దూరములో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రమైన నాగేశ్వరము చేరుకొన్నాము. ముందుగా అచట అరుణ కిరణాలలో నాగేశ్వర క్షేత్రమునకు స్వాగతము పలుకుతూ సుమారు 36 అడుగుల ఎత్తుతో ఉన్న ధ్యానస్వరూపుడైన సదాశివుడు సాక్షారిస్తాడు.

విగ్రహానికి ఎడమవైపుగా ఉన్నప్రధాన ద్వారముగుండా లోపలికి ప్రవేశిస్తే కుడివైపుగా ఉన్న ఒక పెద్ద హాలులో నేలకు కొద్దిగా దిగువగా జ్యోతిర్లింగస్వరూపుడుగా అవతరించిన సదాశివుడు దర్శనమిస్తాడు. జ్యోతిర్లింగ దర్శనానంతరము అచటనుండి 21 కి.మీ. దూరములో ఉన్న “గోపీ తాలాబ్” అనే ప్రదేశము చేరుకొన్నాము. కురుక్షేత్ర యుద్దానంతరం ద్వాపరయుగాంతమును గ్రహించిన శ్రీకృష్ణుడు, అర్జునునితో 16108 గోపికలను తీసుకొని వారి రక్షణార్థమై ఈ తటాకము చేరుకొమ్మని ఆదేశించెను. కాని అర్జునుడు వారిని కాపాడలేని అశక్తుడయ్యెను. అంత ఆ గోపకాంతలందరూ ప్రార్థించగా శ్రీకృష్ణభగవానుడు వారికి ముక్తిని ప్రసాదించెను. ఈ తటాకము దర్శించుకొని, అచ్చట ఉన్న మందిరములో రాధాకృష్ణులు, ఊయలలో ఉన్న చిన్నికృష్ణుడు, శ్రీకృష్ణ కుచేల కలయిక దృశ్యము, పరశురాముడు, సాందీప మహర్షి, లక్ష్మీనారాయణులు మొదలగు దేవతా విగ్రహములు దర్శించుకొన్నాము.

అచట నుండి సుమారు 18 కి.మీ. దూరములోనున్న “ఓఖా” రేవు తీరమునకు చేరుకొన్నాము. ఇచ్చట తీరము నుండి 5 కి.మీ. దూరములో సముద్రములో ఉన్న “ప్రాచీన ద్వారక” ( Beyt Dwaraka) ను మోటారు బోటు సహాయంతో చేరుకోవాలి. శ్రీకృష్ణుడు మథురా నగరము వదలివచ్చిన తరువాత ఇక్కడ భవనము నిర్మించుకొని తన 8 మంది పట్టపురాణులతో నివసించి రాజ్యమునేలెనని చెప్తారు. కుచేలుడు శ్రీకృష్ణుని దర్శనార్థమై ఇచ్చటకు రాగా  శ్రీకృష్ణుడు తన రాణులతో ఎదురేగి సత్కరించి, కుచేలుడు తెచ్చిన అటుకులు ఆరగించి కుచే్లునికి సర్వసంపదలు ప్రసాదించెను. అందుకే ఈ ప్రదేశమునకు హిందీ భాషలో “భేంట్ (అనగా వరము) ద్వారక” అని పిలుస్తారు. ఇచ్చట శ్రీకృష్ణుడు ఆదిశేషునిపై దర్శనమిస్తాడు. ఇదేకాక ఇచ్చట పురుషోత్తముడు, యశోదా మాత మొదలగు దేవతా మూర్తులను దర్శించుకోవచ్చు.

ఈ ప్రదేశము దర్శించుకొనుటకు మాకు 3 గంటల టైమ్ పట్టినది. అచట నుండి సుమారు 35 కి.మీ. దూరములో ఉన్న “రుక్మిణీ దేవి మందిరము” ను దర్శించు కొన్నాము. దుర్వాస మహర్షి శాపము వలన రుక్మిణీ దేవి కృష్ణునికి దూరముగా ఇచ్చట వెలిసెను. మందిరము చాలా ప్రాచీనమైనది. శిల్పకళ మెచ్చుకోదగ్గది. కాని తగినంత జాగ్రత్త తీసుకోనందు వలన సముద్రపు గాలి ప్రభావము వలన మందిరము చుట్టూ ఉన్నశిల్పసంపద చాలా మట్టుకు కొరికివేయబడినది. కాని ఇది చూడవలసిన మందిరములలో ముఖ్యమైనది.

మా ఉదయం దర్శనములన్ని ముగించే సరికి మధ్యాహ్నం 2 గంటలయ్యింది. భోజనం చేసుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్నాము. సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి ద్వారకానగరములో నున్న మరికొన్ని దైవ మందిరములను దర్శించుకొన్నాము. అవి సిద్ధినాథ్ మందిరము, గాయత్రీ మందిరము, గీతా మందిరము, బడకేశ్వర ఆలయము. సముద్ర తీరమున ఉన్న ఈ బడకేశ్వర ఆలయము చాలా ప్రశాంతముగా మన్సునకు ఆహ్లాదపరచే లాగ నిర్మింపబడినది. ఇచ్చటనే ఉన్న సముద్రము పై సూర్యుడు అస్తమించే స్థలము( sun set point) చూడవలసిన ప్రదేశము. గాయత్రీ మందిరం దగ్గర, మరియు బడకేశ్వర ఆలయం వద్ద సముద్రంలో లభించే వెలువైన రాళ్ళు, మరియు ముత్యాలు చాలా చౌకగా దొరుకుతాయి.

తరువాత సుమారు సాయంత్రం 5 గంటలకు ద్వారక లోనున్న శ్రీకృష్ణుని మునిమనుమడైన వజ్రభానుడు (శ్రీకృష్ణుడు-ప్రధ్యుమ్నుడు-అనిరుద్ధుడు-వజ్రభానుడు) నిర్మించిన కృష్ణ మందిరము చేరుకొన్నాము. ఇచ్చట చూడవలసిన ఉప దేవాలయాలు శ్రీకృష్ణుడు ప్రతిష్టించిన శివలింగం – కుశేశ్వర మహాదేవుడు,  గాయత్రీ మాత, ప్రధ్యుమ్నుడు, రాధాకృష్ణులు, దత్తాత్రేయుడు, సత్యభామ, జాంబవతి, రాధాదేవి, గాయత్రి, శ్రీకృష్ణ,రుక్మిణుల ఉత్సవమూర్తులు, లక్మీదేవి, సరస్వతీ దేవి, బలరాముడు మందిరములన్ని దర్శించుకొన్నాము.

ఇదే ప్రాంగణములో శంకరాచార్యులు వారు స్థాపించిన పశ్చిమ ఆమ్నాయ పీఠమును, అందు పూజలందుకొను చంద్రమౌళీశ్వర స్పటిక లింగమును కూడా దర్శించుకున్నాము.

ఈ ఆలయము యొక్క ఉత్తర ద్వారము (స్వర్గ ద్వారము) గుండా వెళ్ళి 56 మెట్లు (మానవ శరీరములో నున్న వికారములను తెలిపే సంఖ్య) దిగి గోమతీ నది సాగరములో సంగమించే పుణ్యప్రదేశమును దర్శించుకున్నాము. సంగమ స్నానము, దీపము వదలుట మొదలగునవి ఇక్కడ చేయవచ్చును.

రాత్రి 7.30 గంటలకు శ్రీకృష్ణునికి మహామంగళ హారతి జరుగుతుంది. ఇది చూడవలసిన ఘట్టము. ఈ మంగళహారతి దర్శించుకొని, ఇంతటి దివ్య అవకాశాన్ని, అనుభూతిని ప్రసాదించిన ఆ భగవానునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములు సమర్పించుకొని మా బసచేరుకొని, బోజనముచేసి విశ్రాంతి తీసుకొన్నాము.

మర్నాడు అనగా 4.9.14 న ద్వారకలో అల్పాహారం తీసుకొని, ఉదయం 8 గంటలకు మేము మాట్లాడుకొన్న కారులో జ్యోతిర్లింగ దర్శనార్థమై సోమనాథ్ బయలు దేరేము. 260 కి.మీ దూరము ఉన్న ఈ మార్గములో ఈ దిగువ ప్రదేశములు దర్శించుకొన్నాము.

మూలద్వారక: శ్రీకృష్ణుడు మథురానగరములో రాక్షసులయొక్క యుద్దాల తాకిడి నుండి ప్రజలను రక్షించుటకై ఆ నగరము వదలిపెట్టి ద్వారకలో నూతన రాజ్యము స్థాపించదలచెను. ముందుగా, ఈ ప్రదేశమునకు వచ్చి ఇచ్చట శివలింగ ప్రతిష్ట చేసి శివుని పూజించెనని చెప్తారు. ఇచ్చట ప్రతిష్టచేసిన శివలింగమును నీలకంఠ మహాదేవ్ అంటారు. ఇచ్చట నెలకొని ఉన్న శ్రీకృష్ణుని, రణ్ చోడ్ రాయ్  పిలుస్తారు. ఇది ఒక పురాతనమైన దేవాలయము.

హర్ సిద్ది మాత దేవాలయము: దక్షయజ్ఞ ద్వంసము తరువాత ఆత్మాహుతి చేసుకొన్నసతీదేవి పార్థివ శరీరాన్ని శివుడు తన భుజముపై వేసుకొని ముల్లోకాలు విరాగియై తిరుగుతుండగా, దేవతల ప్రార్థన ప్రకారము లోకోద్ధారణకై,  విష్ణుమూర్తి తన సుదర్శన చక్రముతో సతీదేవి పార్థివ దేహాన్ని ఖండించగా, కుడికాలి చిటికినవ్రేలు పడినప్రదేశముగా, ఈ శక్తిపీఠములో అమ్మవారు “హర్ సిద్ది మాత” గా ఆరాదింప బడతారు.

పోర్ బందరు – గాందీ గారు జన్మస్థలమైన ఈ ప్రదేశములో ఆయన జ్ఞాపకార్థమై, ఆయన నివసించిన నివాసము, అందులో ఆయన జన్మించిన చోటు, చదువుకొనే గది మొదలగు ఎన్నో గాంధీ గారి  జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకొనే లాగ పదిలపర్చేరు. ఇదే కాక ఆయన వాడిన వస్తువులు, రచించిన పుస్తకాలు,  మొదలైనవి కూడా ఒక మ్యూజియములో బద్రపరిచేరు. ఈ ప్రదేశము జీవితంలో ఒక సారైనా చూచితీరవలసిందే.

సుధామ మందిరము: ఇదే ఊరులో శ్రీకృష్ణుని బాల్యస్నేహితుడైన సుధాముడు (కుచేలుడు) జన్మించిన భవనము ఉన్నది. శ్రీకృష్ణ అనుగ్రహానికి పాత్రుడైన ఆ పుణ్యపురుషుని ఆలయాన్ని సందర్శించు కొన్నాము.

ద్వారక నుండి సోమనాథ్ వెళ్ళే మార్గము అంతా సముద్రతీరము అవడంవల్ల ప్రకృతి అందాలను చూస్తూ 260 కి.మీ దూరాన్ని అనాయాసముగా, ఆహ్లాదకరంగా ప్రయాణించవచ్చు. రైలులో అయితే రాత్రి ప్రయాణం. కాబట్టి ప్రయాణం తెలియకుండా వెళ్ళవచ్చును. బస్ సదుపాయం లేదు. 

మేము సుమారు మధ్యాహ్నము 2 గంటలకు సోమనాథ్ చేరుకొన్నాము. “లీలావతి అథిది భవన్” లో బస చేసేము. ఈ అథిది గృహము సోమనాథ్ దేవాలయ ట్రస్టు వారు “రిలయన్స్” వారందించే ఆర్థిక సహాయంతో నడపుతున్నారు. ఈ అథిది గృహము చాలా పరిశుభ్రముగాను, సదుపాయముగాను ఉన్నది. గదుల అద్దెలు కూడ సదుపాయాలు బట్టి రోజుకు రూ. 600 – 900 మద్యలో ఉన్నాయి.

బోజనము చేసి కొంచెము సేపు విశ్రాంతి తీసుకొన్న తరువాత, సాయంత్రం  5 గంటలకు సోమనాథుని దర్శించుకొనుటకై బయలుదేరేము. మేము చూసిన దేవాలయాలలో అతి శుభ్రముగానూ, క్రమబద్దంగానూ ఉన్న దేవాలయము ఇదే అనిపించింది. డబ్బులడిగి వేదించే సిబ్బంది గాని, పురోహితులు గాని లేరు. ఎంత జనం వచ్చినా పద్దతిగా చక్కటి దర్శనాన్ని కల్పించే ఆ వ్యవస్థ ఎంతగానో నచ్చింది.

శ్రీచక్ర ఆకారములో మలచిన పైకప్పు ఉన్న పెద్ద హాలులో బాలాత్రిపురసుందరి దేవి, రాజరాజేశ్వరి దేవి గర్భాలయమునకు ఇరువైపులా నెలకొనగా, బ్రహ్మ విష్ణువులు జ్యోతిర్లింగమునకు ఇరుప్రక్కలా వెలయగా, పార్వతీదేవి జ్యోతిర్లింగము యొక్క వెనుకభాగము నలంకరిపగా, ఎన్నో జన్మలలో చేసుకొన్న పుణ్య ఫలంగా మాకు దర్శనమిచ్చిన జ్యోతిర్లింగ స్వరూపుడైన ఆ మహాదేవుని తన్మయత్వంతో చూసుకొని పరవశిస్తూ ఎంతసేపు గడిపేమో తెలియదు.

సాయంత్రం 7 గంటలకి సోమనాథ జ్యోతిర్లింగమును అలంకరించి, మహామంగళహారతి జరుపుతారు. కనులార ఈ దర్శన్నాన్ని చూసుకొని, కొంచెముసేపు ఆలయ ప్రాంగణములో ఉన్న, ఆంజనేయుడు, వినాయకుడు, ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిరూప విగ్రహాలను దర్శించుకొని తిరిగి మా బస చేరుకొని, బోజనము చేసి విశ్రమించేము.

మరునాడు ఉదయము అనగా 5.9.14 న ఉదయం సుమారు 9 గంటల ప్రాంతములో బస నుండి బయలుదేరి సోమనాథ్ లో ఉన్న ఇతర ముఖ్యమైన దేవాలయాలను దర్శించుకొన్నాము. వాటిలో ముఖమైనవి.

త్రివేణీ సంగమము: సరస్వతి,కపిల,హిరణ్య అనే మూడు నదులు కలిసి సముద్రంలో సంగమించే పుణ్యతీర్థము.

గోలోక్ ధామ్ తీర్థము: గీతామందిరం, లక్ష్మీనారాయణ మందిరము, బలరామ గుహ, శ్రీకృష్ణుడు అవతార సమాప్తికి ముందు తన పాదుకలు విడచిన ప్రదేశము, కాశీ విశ్వనాథ మందిరము, భీమనాథ మందిరము, గోలోక్ ఘాట్ లను దర్శించుకొన్నాము.

శారదా మఠము ఇచ్చట ఉన్న కామనాథ్ మహాదేవ్ మందిరము,  శంకరాచార్యుల వారి విగ్రహము, ఆయన గద్దె, ఆయన ధ్యనం చేసుకొనే గుహ, నరసింహ మందిరము, సరస్వతీ మందిరము, శ్రీ యంత్రము, ద్వాదశ జ్యోతిర్లింగముల ప్రతిరూపాలు మున్నగునవి దర్శించుకొన్నాము.

లక్ష్మీనారాయణ దేవాలయము: దక్షిణ భారత నిర్మాణ  శైలి ననుసరించి, జీయర్ స్వామిగారు నిర్మించిన దేవాలయము. ఇచ్చట లక్ష్మీనారాయణులు కొలువైయున్నారు. ఆరోజు ఏకాదశి కావడం మా అదృష్టంగా భావించి, ఆదిలక్ష్మితో కూడిన జగన్నాథుని దర్శించుకొన్నాము.

బాల్కాతీర్థము (ప్రభాస తీర్థము): శ్రీకృష్ణుని నిర్యాణ స్థలము. తన అవతార సమాప్తి సమీపిస్తున్నదని తెలుసికొన్న శ్రీ కృష్ణుడు, ఇచ్చట ఒక అశ్వత్థ (రావి) చెట్టు కింద విశ్రమిస్తున్న సమయములో “జర” అనే వేటగానిగా జన్మనెత్తిన “వాలి” జంతువని భ్రమించి, తన వాడి బాణముతో విశ్రమిస్తున్న శ్రీకృష్ణుని గాయపర్చెను. అంతట శ్రీకృష్ణుని నిర్యాణము సంభవించెను. ఇచ్చట వేటగాని విగ్రహము, శ్రీకృష్ణుని విగ్రహము, రావిచెట్టు ఇప్పటికీ దర్శనీయముగా ఉన్నాయి.

ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరని జ్యోతిర్లింగ స్వరూపాన్ని ఇంకొకసారి దర్శించుకొని, మద్యాహ్న మహామంగళ హారతి చూసుకొని,  మేము మా బస చేరుకొన్నాము.

ఆరోజు అనగా 5.9.14 రాత్రి 7.30 గంటలకు మా తిరుగు ప్రయాణము ప్రారంబించి, మా యాత్రా అనుభవాలని నెమరువేసుకొంటూ, 8.9.14 తెల్లవారుఝామున      3 గంటలకు బెంగుళూర్ చేరుకొన్నాము.


ఉమామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు

Thursday, 3 July 2014

CHAPPAN BHOG OFFERED TO LORD JAGANNATH

 
పూరి జగన్నాథునికి రథయాత్ర మహోత్సవ సందర్భంగా సమర్పించే
56 రకాల పిండివంటకాలు
(56 varities of delicious dishes offered to Lord Jagannath during Ratha Yatra Festival)
 
పూరి జగన్నాథునికి సమర్పించే ఈ 56 రకాల పిండివంటకాలకి ప్రత్యేకత ఉంది. ఈ వంటకాలన్నీ మట్టిపాత్రలలోనే చేస్తారు, మరియు మట్టిపాత్రలలోనే వీటిని ఉంచుతాతు. దీని వలన ఈ వంటకాలు వేగంగా పాడవ్వవు మరియు చాలాసేపు వేడిగా ఊంటాయు.
శ్రీ కృష్ణుడు గోవర్థన గిరిని ఎత్తి, ఇంద్రుని ఆగ్రహానికి గురియైన గోపకులందరిని కుంభవృష్టిగా కురుస్తున్న వర్షమునుండి కాపడినందుకు గాను కృతజ్ఞతతో శ్రీకృష్ణునికి గోపాలురందరు రకరకములైన మధుర పదార్థములను చేసి కానుకలుగా సమర్పిచేరు. అప్పటినుండి ఈ 56 రకములైన మధురపదార్థములను శ్రీకృష్ణునకు  మహా నైవేద్యముగా సమర్పించడం ఒక ఆచారముగా అయింది. శ్రీకృష్ణునకు సమర్పించే ఈ మహా నైవేద్యమునకు "చప్పన్ భోగ్” అని పిలుస్తారు. వీటి వివరాలు

1 ) Ukhuda ( Sugar coated puffed rice)
2 ) Nadia kora(Coconut ladu)
3 ) Khua (condensed milk)
4 ) Dahi (Yoghurt)
5 ) Pachila kadali (Ripe Banana)
6 ) Kanika (Flavoured Rice)
7 ) Tata  Khechudi (Dry Khechudi)
8 ) Mendha Mundia (A kind of cake)
9 ) Bada Kanti (Fried Cake)
10) Matha Puli (A kind of Pan cake)
11) Hamsa Keli (Sweet cake)
12) Jhili  ( Thin pan cake like Dosa)
13) Enduri ( Idli)
14) Adapachedi (Ginger Paste)
15) Saga Bhaja (Fried spinach)
16) Kadali Bhaja (Fried Plantain)
17) Maric Ladu (Chilli Ladu)
18) San Pitha ( Small size Cake)
19) Bara/Vada (Donalds)
20) Arisha (Sweet fried cake made by rice flour)
21) Bundia ( Sweet granules made of Chick pea flour)
22) Pakhal oriya(Water rice)
23) Khiri (Milk Rice)
24) Kadamba( A kind of sweet)
25) Pat Manohar (Name of a sweet)
26) Takuaa(Sweets shaped like tongue)
27) Bhaga Pitha (A kind of cake )
28) Gotai(A kind of salty cake)
29) Dalma(Dal with vegetables)
30) Bada Kakara(Large Fried sweet cake)
31) Luni Khuruma (Salty Biscuits)
32) Amalu ( Malpua, Sweet Puri)
33) Suar Pitha (Poda Pitha, Baked Cake)
34) Biri Buha(Black gram cake )
35) Jhadai Nadaa(a cluster of small ball shaped cakes)
36) Khasta Puri(Strong fried cakes)
37) Kadali Bara(Fried Plantain)
38) Sana Arisha (Small fried cakes)
39) Sakar(Chatni)
40) Podo Pitha(Panned Cake)
41) Kanji(Sour Rice)
42) Dahi Pakhal(Curd rice )
43) Bada Arisha(Large size Fried cake)
44) Tipuri(Three stage fillings)
45) Sakara(Sugar candy)
46) Suji Khir(Milk with samolina)
47) Muga Sijha(Boiled green gram)
48) Manohar(a kind of sweet)
49) Magaja Ladu(A kind of sweet like simply wonderful)
50) Pana(Sweet Drink)
51) Anna(Rice)
53) Ghia Anna(Ghee rice)
54) Sweet Dal
55) Besar(Curry)
56) Sag(Spinach)