రామేశ్వరం-కాశీ-
రామేశ్వరం యాత్ర-2
గతంలో వివరించిన మా రామేశ్వర యాత్ర తరువాత
భాగమైన కాశీయాత్ర చేయాలన్న సంకల్పముతో మా
గురువుల యొక్క, మా తల్లిగారి యొక్క ఆశీర్వచనములు తీసుకొని, మాదంపతులు రెండవభాగంగా
కాశీ పుణ్యక్షేత్రమునకు తేదీ 08.12.14 న బెంగుళూరులో ఉదయం గం.10 లకు బయలుదేరేము. ముందుగా
మొగల్ సరాయ్ నగరము తేదీ 10.12.14 ఉదయం 8 గంటలకి చేరుకొన్నాము.
మొదటిరోజు ( 10.12.14)
TRIVENI SANGAM BADE HANUMAN TEMPLE HANUMAN MADHAVESWARI TEMPLE |
నదుల త్రివేణి సంగమ క్షేత్రములో వేణీదానము,వేణుమాధవ లింగ నిమజ్జన, త్రివేణీ సంగమ పుణ్యస్నానము చేసుకొన్నాము. ఈ మొత్తము కార్యక్రమమునకు సుమారు 3 గంటల కాలము పట్టినది.
కంచిమఠములో భోజనము ముగించుకొన్న తరువాత
ప్రయాగక్షేత్రములో నున్న మాధవేశ్వరీ అమ్మవారి (ప్రయగే మాధవేశ్వరీ.... శక్తిపీఠము)
ఆలయము, వేణుమాధవుని ఆలయము, సోమేశ్వరస్వామి అలయము, బడే హనుమాన్ దేవాలయము
దర్శించుకొని సాయంత్రము సుమారు 4.30 గంటలకు బయలుదేరి తిరిగి మొగల్ సరాయ్ లో మేము తీసుకొన్న
రైల్వేబసకు చేరుకొన్నాము.
రెండవ రోజు (11.12.14)
VARANASI STATION KASHI SNAN GHATS GANGA HARATI |
మరునాడు ఉదయము స్నానాదులు ముగించుకొని 7 గంటలకు బయలుదేరి అక్కడకు 15 కి.మీ దూరములో ఉన్న కాశీ
క్షేత్రము చేరుకొన్నాము. అక్కడ కంచిమఠములో బస ఏర్పాటు చేసుకొన్నాము. నాన్ ఏ.సి.
డబుల్ రూము రోజుకు 500 అద్దె. వారే బోటులో
అన్నిఘాట్ లు చూపించుటకు మరియు స్నానముచేయించుటకు 600 చార్జీ తీసుకొంటారు.
మేము వారు ఏర్పాటుచేసిన బోటులో అన్నిఘాట్ లు చూసుకొని అక్కడ ఉన్న ఆలయముల దర్శనము
చేసుకొన్నాము. అవి
1. కాలభైరవ ఆలయము (ముందుగా కాలభైరవుని దర్శించికొని
ఆయన అనుమతితో విశ్వనాథుని దర్శనము చేసుకోవాలని ప్రతీతి)
2.
దండాయుధపాణి (సుబ్రహ్మణ్యేశ్వరుడు) ఆలయము
3.
బిందుమాధవ ఆలయము ( పంచ మాథవ ఆలయములు కాశీలో బిందుమాధవుడు, ప్రయాగలొ వేణుమాధవుడు,
రామేశ్వరములో సేతుమాధవుడు, పిఠాపురంలో కుంతి మాధవ, తిరువనంతపురములో సుందరమాధవుడు
ఉన్నాయి)
4.
విశ్వనాథుని ఆలయము, జ్ఞాన వాపి (
విశ్వనాథుడుగా వెలసిన లింగము మొగలుల దాడులలో ఆలయ అర్చకులు ఇక్కడ ఉన్నబావిలో
నిక్షిప్తం చేసేరు. ఈ బావిలో నీరు తీర్థంగా పుచ్చుకొంటే విశ్వనాథుడు జ్ఞానమును
అనుగ్రహిస్తాడని ప్రతీతి. విశ్వనాథుడు మొదటగా ఇక్కడే వెలిసేడు అనడానికి నిదర్శనంగా
విశ్వనాథుడు వెలసిన వైపుకి తిరిగి కూర్చొనిఉన్న పెద్దనందిని ఇప్పటికీ చూడవచ్చు)
5.
అక్షయ వట వృక్షము (విష్ణువక్షస్థలము) - (విష్ణువుయొక్క
శిరస్సు ప్రయాగలోనూ, వక్షస్థలము కాశీలోనూ, పాదములు గయలోనూ ఉన్నట్లు స్థలపురాణాలు
చెప్తాయి)
6.
హనుమాన్ ఆలయము.
7.
అన్నపూర్ణాదేవి ఆలయము
8.
దుండి గణపతి ఆలయము
9.
విశాలాక్షి (వారణాస్యాం విశాలాక్షి.......శక్తిపీఠము) ఆలయము
దర్శించుకొని, అక్కడ ఉన్న అలహబద్ బ్యాంక్
కౌంటరులో సాయంకాలము 7 గంటలకు విశ్వనాథుని ఆలయములో జరిగే సప్తఋషి హారతికి
టిక్కెట్లు కొనుక్కొని ( మనిషికి 125 రూ.) 12 గంటలకు మణికర్ణికా ఘాట్
కి వచ్చేము. అక్కడ ఒక పురోహితుని ద్వారా స్నానసంకల్పము చేసుకొని మాదంపతులు
తీర్థస్నానము చేసేము.
అన్నీ ముగించుకొని మా బసకు చేరేసరికి సుమారు 2 గంటలు అయింది. మఠములో
బోజనాదులు ముగించుకొని కొలదిసేపు విశ్రమించేము.
4.30 గంటలకు బయలుదేరి ఇంటినుండి తీసుకొని వెళ్ళిన అభిషేక సామగ్రిని, నివేదనను తీసుకొని
విశ్వనాథుని ఆలయము చేరు కొన్నాము. ఆలయము చేరుకొన్న తరువాత ప్రదక్షణ విధిగా ఉప దేవతల ఆలయములు అయిన శంఖచక్రగధా
ధరుడైన శ్రీమహావిష్ణువుతో కూడి శ్రీ మహలక్ష్మి అమ్మవారి ఆలయము, పార్వతీదేవి ఆలయము,
అన్నపూర్ణా దేవి ఆలయము సందర్శించుకొని విశ్వనాథుని ఆలయములో మేము మాతో
తీసుకువెళ్ళిన అభిషేకవస్తువులు, నైవేద్యము విశ్వనాథునకు అర్పించి ఆయన అశీస్సులు
పొందేము.
తరువాత గర్భాలయమునకు వెలుపల ఉన్న భువనేశ్వర
లింగము, తారకేశ్వర లింగములను(రుద్రాభిషేకము చేసుకునేవారికి ఈ లింగములవద్ద
చేయిస్తారు. ఇవి విశ్వనాథుని గర్భాలయములో ఉన్న లింగములను పోలి ఉంటాయి) దర్శించుకొని,
అచ్చట ఉన్న మంటపములో పారాయణ చేసుకొన్నము. సుమారు 7 గంటల సమీపములో సప్తఋషి
హారతికి టిక్కెట్లు తీసుకొన్నవారిని విశ్వనాథుని గర్భాలయము ముందు కూర్చోపెట్టేరు.
ఈ కార్యక్రమము సుమారు గంటన్నరసేపు అవుతుంది
( ఇది చూసి తరించవలసిన ఘట్టము) మహా మంగళహారతి అయిన పిదప అర్చకులకు మన
ఇచ్చానుసారము దక్షిణలు సమర్పించుకొని తీర్థప్రసాదములు పొందవచ్చు. మేము స్వామివారి
తీర్థప్రసాదములను స్వీకరించి మాబసకు 9 గంటల సమయమునకు
చేరుకొన్నాము.
మూడవ రోజు (12.12.14)
మరునాడు ఉదయము 7 గంటలకు బయలుదేరి, ఆ రోజు
శుక్రవారము అయినందువలన విశాలాక్షిమందిరములో కుంకుమఅర్చన చేసుకొని (అర్చక సంభావన 500రూ.) ముత్తైదువులకు మంగళద్రవ్యాలను (మేము మాతో తీసుకొనివెళ్ళేము) పంచి, అక్కడనుండి బయలుదేరి వారాహి దేవి అలయము, సాక్షి గణపతి ఆలయము దర్శించుకొని అన్నపూర్ణాదేవి ఆలయము చేరుకొన్నాము. అచ్చట మాకు అమ్మవారి
అనుగ్రహమువలన అమ్మవారి మూలవిగ్రహము యొక్క
పాదాలను తాకి దర్శనముచేసుకొనే భాగ్యాన్ని పొందేము. తరువాత అమ్మవారి ఆలయ ప్రాంగణములో
ఉన్న ఉప ఆలయములు – సూర్యనారాయణమూర్తి, వినాయకుడు, కాళీమాత మరియు భవానీగౌరి, సుభద్ర
బలరాములతో కూడి ఉన్న జగన్నాథుడు, అన్నపూర్ణ, మహాలక్ష్మి, సరస్వతి దేవి విగ్రహములతో
కూడిన మంటపము, గంగావతరణ దృశ్యము, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరు
లతో ఉన్న పార్వతీ పరమేశ్వరులు, సత్యనారాయణస్వామి, అంజనేయుడు, గౌరీ శంకరులతో కూడి
ఉన్న కుబేరుడు, మొదలగు ఉప ఆలయములను దర్శించుకొన్నాము.
కాశీనగరములో ఉన్న ముఖ్యదేవాలయాలని దర్శింపగోరి
ఒక సైకిలురిక్షాను 500 రూ.లక్ మాట్లాడుకొని ఈ దిగువ దేవాలయాలను దర్శించుకొన్నాము.
1.మహామృత్యుంజయ ఆలయము ( అపమృత్యుదోషాలను
పోగోట్టే దివ్యక్షేత్రము)
2. కృత్తివాసేశ్వరుని ఆలయము
( కాశీ విశ్వనాథుని దర్శించిన పూర్ణ ఫలము ఈ ఆలయదర్శనము వలన కలుగునని స్థలపురాణము
చెప్తుంది)
3. సంకట మోచన హనుమద్దేవాలయము ( చాలా విశేషమైన
దేవాలయము)
4. కౌడీ మాత (
గవ్వలమ్మ-కాశీగ్రామదేవత-విశ్వనాథుని సోదరి) అలయము.
5. తులసీ మానస మందిరము.
6. లోలార్క కుండము -
సూర్యనారాయణమూర్తి అనుగ్రగమునకై ఈ కుండములో స్నానంచేసి, అక్కడ ఉన్న
లోలార్కేశ్వరుని దర్శించుకొంటారు.
పై దేవాలయాలను దర్శించుకొని మాబసకు
చేరుకొన్నాము. భోజనానంతరం ప్రాంతీయ బట్టల షాపింగ్ చేసుకొన్నాము.
5.30 గంటలకు దశాశ్వమేథ ఘాట్
వద్ద జరిగే గంగాహారతి వీక్షించుటకై ఒక బోటు చేయించుకొని బయలుదేరేము. 6 నుండి 8 గంటల దాకా జరిగే ఈ హారతి చూసి తరించవలసిన మహత్తర దృశ్యము. ఈ
సుందర ఘట్టాన్ని తిలకించి, మాబసకు చేరుకొన్నాము. ఫలహారములు ముగించుకొని ఆ రోజు
రాత్రి 11.30 గంటల రైలులో మా బెంగుళూర్
కు తిరుగు ప్రయాణానికి రైల్వేస్టేషనుకు బయలుదేరేము.
ఆది దంపతులైన ఆ పార్వతీపరమేశ్వరులు మాకు ప్రసాదించిన
ఈ దివ్య అవకాశానికి ఆ దేవదేవులకు సహస్ర కృతజ్ఞతా ప్రణామములు అర్పించుకొని 14.12.14 రాత్రి 11.30 గంటలకు మా బెంగుళూర్ చేరుకొన్నాము.
No comments:
Post a Comment