Saturday, 28 June 2014

MATHURA-YAMUNA PUSHKARA YATRA JUNE'14

మథురా నగరిలో ...........

యమునా తీరమున...........

మాదంపతులు ఆ ఉమామహేశ్వరుల అనుగ్రహానికై ప్రార్థించి 12 సంవత్సరములకు ఒకసారి వచ్చే “యమునానది” పుష్కరాలకు వెళ్ళి, సప్త మోక్షపురిలలో ఒకటైన “మథురా” నగరంలో ప్రవహించే సప్తగంగలలో ఒకటైన పవిత్ర “యమునా నదిలో” పుష్కర స్నానము చేయడానికై సంకల్పించుకొన్నాము.
ఈ మా సంకల్పాన్ని సాకారము చేసుకునేందుకుగాను ముందుగా యాత్రకి కావలిసిన వస్తువులు సేకరించడం, ప్రయాణపు ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు, మథురా నగరిలో ప్రాంతీయ దేవాలయ సందర్శనముకు కావలసిన ఏర్పాట్లు చేసుకొన్నాము.
అనుకొన్న ప్రకారము తే 21.06.14 నాడు సాయంత్రము గం 7.20 ని. లకు బయలుదేరే “కర్ణాటక ఎక్స్ ప్రెస్” లో మేము ఉండే బెంగుళూర్ నగరము నుండి మథురా నగరమునకు బయలుదేరేము. తేది 23.06.14 ఉదయం గం 7.45 ని. లకు మోక్షమునొసగే శ్రీకృష్ణుని దివ్యధామమైన మథురా నగరము చేరుకొన్నాము. శ్రీకృష్ణ పరమాత్ముడు, యమునాదేవి తో కూడి తమ చల్లని చూపులతో మాకు ఆహ్వానము పలికేరు(రెండు రోజుల క్రితంవరకు ఉష్ణోగ్రత 43*C  ఉండేది మేము చేరే ముందురోజు పెద్ద వర్షము పడి ఉష్ణోగ్రత 38*C తగ్గి వాతావరణము అనుకూలముగా ఉంది)
మథురా నగరం రైల్వే స్టేషను నుండి సుమారు 15 కి.మీ. దూరములో శ్రీకృష్ణుడు రాసలీలలు జరిపిన ప్రాంతమైన “బృందానము”అనే ప్రాంతములో ISKON దేవాలయం వద్ద మేము ముందుగా ఏర్పాటు చేసుకొన్న “భక్తిధామ్” అనే వసతిలో దిగి స్నానాదులు ముగించుకొని కేశి ఘాట్ ( శ్రీ కృష్ణుడు కేశి అనే రాక్షసిని వధించిన తరువాత ఇచ్చట ప్రవహించే యమునానదిలో స్నానము చేసి పవిత్రుడయిన ప్రదేశము) వద్ద ప్రవహించే “యమునా నది” కి పుష్కరస్నాన నిమిత్తమై బయలుదేరేము. సంకల్ప, అర్ఘ్య, పూజాదులతో మా పుష్కర స్నానము సంతృప్తిగ ముగించేము.
తరువాత శ్రీ కృష్ణ భగవానుని దర్శనార్థమై ISKON దేవాలయమునకు వెళ్ళి, శ్రీకృష్ణ, బలరామ, రాధాదేవి ల దర్శనము చేసుకొని, ప్రత్యేక మద్యాహ్న మంగళ హారతి తిలకించేము. తరువాత ఆ రోజు ఏకాదశి కారణంగా దేవాలయము వారు ఏర్పాటుచేసిన “క్యాంటిన్” లో ప్రత్యేక భోజనము చేసి మా వసతికి చేరుకొన్నాము.
కొంతసేపు విశ్రాంతి తరువాత గం. 3.30 ని. లకు బయలు దేరి బృందావనములో గల ఈ దిగువ వివరించిన మరికొన్ని పవిత్ర దేవాలయములను సందర్శించుకొన్నాము.
1.  గోవిందదేవ్ మందిరము – ప్రాచీన నిర్మితమైన ఈ మందిరము మొగల్ రాజుల దాడికి గురియైనది. అ కాలములో స్థానిక అర్చకులు ఈ మందిరములో ఉన్న విగ్రహములను  భద్రపరిచే నిమిత్తమై జయపూర్ కు తరలించిరి. ఈ మందిరము యొక్క శిల్ప సంపద చూడవలసిందే.
2.  మీరా భజన మందిరము – ఈ మందిరములో శ్రీకృష్ణుని ప్రియ భక్తురాలైన మీరాదేవి భజనలు చేసేదని ప్రతీతి. ఈ మందిరము ఇప్పుడు అభాగినులకు నిలయముగా మారింది. ఇప్పటికీ ఈ మందిరములో ప్రతీ సాయంకాలము మీరాదేవి ఆలపించిన శ్రీకృష్ణుని భజనలు పాడుతారు.
3.  బృందావన్ బిహారి మందిరము – ఈ ప్రాంతములో గల బృందావనము ( తులసి వనము ) లో యోగులు తపస్సు చేయగా శ్రీకృష్ణుడు భూమిని చీల్చుకు వచ్చి ఒక విగ్రహరూపములో దర్శనమివ్వగా, ఆ విగ్రహమును ఈ మందిరములో ప్రతిష్టించిరి. ఈ మందిరములో శ్రీకృష్ణ బలరాములు తమ తల్లిదండ్రులైన దేవకి, వసుదేవులతో వెలసి ఉన్నారు.
4.  ఈ యోగుల సమాదులు, విగ్రహ రూపములో దర్శనమిచ్చిన ప్రదేశము, తులసి వనము ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ప్రదేశములో ఇప్పటికీ రాత్రి పూట వేణుగానము, గజ్జెల సవ్వడి వినిపిస్తాయని స్థానికులు విశ్వసిస్తారు.
5.  ఈ ప్రాంగణములోనే, దేవకి, వసుదేవులతో కూడి ఉన్న బాలకృష్ణుడు ఉన్న మందిరము ఉన్నది. దేవకి దేవి ప్రార్థనపై శ్రీకృష్ణుడు తన బాల్యక్రీడలన్ని ఇచ్చట దర్శింపజేసెనని ప్రతీతి.
 
తరువాత ఇచ్చటి నుండి 13 కి.మీ. దూరములో నున్న “మథురా నగరము” లో గల పవిత్రమైన శ్రీకృష్ణుని జన్మస్థానమును దర్శించి అచటినుండి యమునానదీ తీరమున ఉన్న “ద్వారకాధీశ్” ఆలయము చేరితిమి. అచ్చట రాధాకృష్ణులకు సాయంకాల మంగళ హారతి తిలకించి పులకితులమైనాము.
తరువాత అచ్చటికి కొద్ది దూరములో శ్రీకృష్ణుడు కంసుని చంపిన తరువాత యమునానదిలో స్నానముచేసి విశ్రమించిన  “విశ్రామ్ ఘాట్”  వద్దకు చేరితిమి. మేము నదిఒడ్డున గల యమునాదేవి ఆలయములో దేవిని దర్శించుకొని మాతో తీసుకువెళ్ళిన 365 వత్తులను వెలిగించి యమునానదిలో వదలి, నది ఒడ్డున నిలబడి యమునా హారతి చూసి, యమునా అష్టకమును పఠించేము.


సాయంత్రం గం. 7 లకు జరిగే యమునా ఆరతి చూడవలసిన అంశం. 
ఆ తరువాత వసతికి తిరిగి వస్తున్న దారిలో “బృందావనము” లొ ఉన్న “బంకే బిహారి” ఆలయములో గం.9 లకు జరిగే మహా మంగళ హారతిని దర్శించి వసతికి చేరుకొన్నాము.
 
రెండవరోజు ఉదయాన్నే స్నానపానాదులు ముగించుకొని, యముననది ఆవలతీరములో ఉన్న గోవర్థన పర్వతము, బర్సానా (రాధాదేవి జన్మించిన ఊరు), మరియు నంద గాంవ్ (నందుని రాజప్రాసాదము) చూడడానికై గం.7 లకు బయలు దేరేము.
ఈ మూడు ప్రదేశములలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సదా శ్రీకృష్ణుని దర్శనార్థమై ఉన్నారు. గోవర్ధన గిరి రూపములో విష్ణుమూర్తి, రాధాదేవికై నిర్మించిన భవనమును మోస్తూ బ్రహ్మదేవుడు, నంద గాంవ్ లో నందుని భవవములో శివుడు ఉన్నారు. అందుకే ఈ మూడు క్షేత్రములు అత్యంత ప్రసిద్దమైన ప్రదేశములు.
 
సుమారు 32 కి.మీ దూరం ప్రయాణిచిన తరువాత గోవర్థన పర్వతము చేరేము. ఇచ్చట “గిరిరాజ్ మందిరం” అనే మందిరములో శ్రీకృష్ణ భగవానుని గోవర్థనధారిగా దర్శించుకోవచ్చు. తరువాత గోవర్థనగిరి యొక్క పరిక్రమ చేయడానికి వీలుగా చుట్టూ అనువైన రోడ్డు మార్గము ఉంది. ఇది 21 కి.మీ. దూరము. ఎవరి శక్త్యానుసారం, సమయానుసారం వారు నడచి గాని వాహనాల్లో గాని ఈ పరిక్రమ పూర్తి చేసుకోవచ్చు.
మేము ఒక ప్రాంతీయ గైడ్ ను రూ 200 లకు మాట్లాడుకొని, అతని సాయంతో గిరి మూలము వద్ద పరిక్రమ ఆరంభించి, మార్గమద్యములోనున్న రాధాకుండ్, శ్యామ్ కుండ్, మానసిగంగ లను దర్శించుకొని తిరిగి గిరి మూలము వద్దకు చేరుకొన్నాము. ఈ పరిక్రమ మాకు వాహనములో ఒక గంట సమయం పట్టింది.
అక్కడనుండి సుమారు 20 కి.మీ దూరంలో నున్న “బర్సానా” అనే గ్రామము చేరుకొన్నాము. ఇది వృషభానుడు, కిరీటాదేవి అను దంపతులకు రాధాదేవి జన్మించిన గ్రామము. అమె కోసము ఆమె తండ్రి నిర్మించిన సుందరమైన మహల్ ను ఇక్కడ దర్శించుకోవచ్చును. ఈ మందిరమునకు దగ్గరలోనే రాధాకృష్ణులు రాసలీలలు జరిపిన ప్రదేశము చూడవచ్చు. ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహములు అతి సుందరముగా అలంకరిచబడి నిత్యపూజలు జరుగుతూ ఉంటాయి.
తరువాత అక్కడినుండి సుమారు 8 కి.మీ. దూరంలో ఉన్న “నంద గాంవ్” అనేప్రదేశము చేరుకున్నాము. నందుడు గోకులములో ఉన్న తన  రాజ భవనము పై తరచు జరిగే రాక్షసుల దాడి నుండి చిన్నికృష్ణుని కాపాడుటకై గోకులము వదలి ఇచ్చటకు వచ్చి నూతన నగరమును నిర్మించెను. ఇచ్చట “నందీశ్వర కొండ” పై నందభవనమును నిర్మించెను. ఈ భవనము తప్పక దర్శించవలసిన ప్రదేశము. దీనిని చేరుటకు సుమారు 40 మెట్లు ఎక్కి వెళ్ళవలసి వస్తుంది. ఇచ్చట నందుని పరివారమును (నంద మహారాజు, యశోదాదేవి, కృష్ణ, బలరాములు, రాధారాణి, రేవతి, రోహిణి విగ్రహములు మరియు కృష్ణుని స్నేహితులైన సుధామ, మధుమంగళ విగ్రహములు) ఒకేచోట ప్రతిష్టించడం జరిగింది. మరియు ఇక్కడనుండి ఈ క్రింది ప్రదేశములను చూడవచ్చు.
1.              కోకిలా వన్ -శని మహాదేవుని సంస్థానము. ఒకసారి దేవతలు అందరూ శ్రీకృష్ణుని దర్శనార్థమై నంద మహల్ కు వచ్చినపుడు, శనైశ్చరునికి మాత్రము దర్శనానికి అనుమతి లభించని కారణంగా శనైశ్చరుడు సమీపంలో ఒక ప్రదేశములో కూర్చొని శ్రీకృష్ణుని దర్శనమిమ్మని ధ్యానించెను. అప్పుడు ఈ ప్రదేశములో శ్రీకృష్ణుడు కోయిల రూపంలో ఉన్న శనైశ్చరునికి దర్శనమిచ్చెను.
2.              ఆశేశ్వర్ మహాదేవ్ మందిరము – శివుడు బాలకృష్ణుని దర్శనార్థమై ఇచ్చటికి వచ్చినపుడు, యశోదా దేవి శివుని రూపము చూసి దర్శనమునకు అనుమతించలేదు. అపుడు శివుడు నగర పొలిమేరలో కృష్ణుని దర్శనము అయ్యేంతవరకు వెళ్ళనని ఉండిపోయెను. బాలకృష్ణుడు అకారణంగా రోదించడం మొదలుపెట్టెను. అప్పుడు రోదిస్తుస్తున్న బాలకృష్ణుణ్ణి యశోద శివుని దగ్గరకు తీసుకొని వెళ్ళగా శివుని ఒడిలో బాలకృష్ణుడు ఏడుపు అపెను. ఈ విధంగా శివుడు బాలకృష్ణుని రోదనము ఆపుటకై యశోదకు అశ్వాశనము ఇచ్చినందున ఇచ్చటి శివుడు “ఆశేశ్వర మహదేవ్”  గా ప్రసిద్దికెక్కేడు.
3.              కృష్ణ కుండము – కృష్ణుడు గోవులను మేతకై తీసుకెళ్ళి తిరిగివస్తున్నప్పుడు, ఆ గోవుల దాహాన్ని తీర్చడానికి ఈ కుండమును నిర్మించెను.
4.              యశోదా కుండము – యశోదా దేవి తన గృహావసరాలకు నిర్మించిన కుండము. ఇచ్చట యశోదాదేవి వాడిన కుండలు ఇప్పటికీ చూడవచ్చంటారు.
5.              కంసుని వధకై కృష్ణుడు బయలుదేరినపుడు పినతండ్రి అయిన అక్రూరుడు కృష్ణుని అనుకూలము కొరకై నిర్మించిన మార్గము.
6.              సంకేత్ మహల్ – రాధాదేవి ఈ మహల్ నుండి కృష్ణుని కలవడానికై సంకేతాలు పంపేదని ప్రతీతి.
7.              నందుని గోశాల – నందుడు గోరక్షణకై నిర్మించిన గోశాల.   
 
ఇచ్చట నుండి తిన్నగా సుమారు 60 కి.మీ ప్రయాణించి మథురా నగరంలో శ్రీకృష్ణుని బాల్య లీలలు జరిగిన “గోకుల్” కు చేరుకొన్నాము. ఇక్కడ
1.              నందుని పూర్వ రాజప్రాసాదము.
2.            వసుదేవుడు శ్రీకృష్ణుని యమునానది దాటించి గోకులము చేర్చిన మార్గము.
3.              యశోద గర్భములో యోగమాయ జన్మించిన ప్రదేశము.
4.              శ్రీకృష్ణుడు మన్నుతిన్న ప్రదేశము, మరియు మన్నుతిన్న నోరు తెరచి యశోదాదేవికి పదునాలుగు భువన భాండములు చూపించిన ప్రదేశము.
ఇంకా ఈ ప్రదేశము శ్రీకృష్ణుడు బాల్యక్రీడలు సలిపిన చోటు, పూతన, శకటాసురుడు మున్నగు రాక్షసులను సంహరించిన చోటు.
పైన వివరించిన ప్రదేశములన్ని చూడడము గం. 4 లకు ముగిసినది. మా తిరుగు ప్రయాణము ఆ రోజు రాత్రి గం. 11 లకు కాబట్టి, ప్రయాణ సన్నాహాలు చేసుకోవడానికి గాను మేము మా వసతికి చేరుకొన్నాము.
శ్రీకృష్ణుని అందాలను చూచి తరించాలంటే మథురానగరి దర్శించవలసిందే. జయదేవుని అష్టపదులలో వర్ణించిన యమునానది చూడాలంటే మథురానగరి దర్శించవలసిందే. మేము చూసినవి బహు కొద్ది ప్రదేశాలు మాత్రమే. చూడడానికి ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఈ దివ్యమైన అనుభవాలను మననం చేసుకుంటూ తేది 24.06.14 రాత్రి గం. 11 ల “కర్ణాటక ఎక్స్ ప్రెస్” లో మథురానగరం నుండి బయలుదేరి, 26.06.14 నాడు మధ్యాహ్నం గం 2.00 ని. లకు మేము ఉండే బెంగుళూర్ నగరము చేరుకొన్నాము.
 
      ముఖ్య సూచనలు:
1.   బృందావనములో కోతులు ఎక్కువ. అవి యాత్రికుల నుండి కెమెరాలు,కళ్ళజోళ్ళు ఎత్తుకెళ్తాయి. జాగ్రత్తగా ఉండాలి.
2.  అన్ని దేవాలయములలో ఉన్న పురోహితులు భక్తులయొక్క భక్తిని అదునుగా చేసుకొని దోచేస్తుంటారు. వీరి బారి పడకుండ జాగ్రత్త వహించవలెను.
3.  సాధ్యమైనంత వరకు అక్కడ చూడవలసిన ప్రదేశములయొక్క పూర్తి వివరములు తెలుసుకొని వెళ్తే మంచిది. దీని వలన అక్కడ ఉండే పండాల చేతిలో పడకుండా తప్పించుకోవచ్చు.
4.  సాధ్యమైనంత చిల్లర నోట్లు కూడా తీసుకొని వెళ్ళడం చాలా ముఖ్యమైన గమనిక.
5.  మొత్తం మథుర, బృందావన్, గోకులం, గోవర్థన్, బర్సానా, నందగాంవ్ లలో మేము దర్శించిన ప్రదేశములు సుమారు 300 కి.మీ. దూరము ఉంటుంది.
 

No comments:

Post a Comment