Monday, 12 May 2014

UPANAYANAM


ఉపనయనము

 

 

మానవుడు తన జీవితకాలంలో సామాజిక, ఆధ్యాత్మిక ప్రగతి కోసం బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు దశలను పాఠించాలి.

బ్రహ్మచర్యంలో ఉపనయనం, వేదారంభ సంస్కారం, సమావర్తన సంస్కారం అను మూడు సంస్కారాలు ఉన్నాయి.

ఉపనయమనం విద్యార్థస్యశ్రుతిత్ స్సగ్గ్ స్కారః అప

అనగా వేదాధ్యాయనం కొరకు శ్రుతి మంత్రములచేత చేయబడు సంస్కారమే ఉపనయనము.

ఉపనయనం ... “ఉప” “నయనం” అంటే  “దివ్య చక్షువు” అనే అర్థాన్ని మనము తెలుసుకోవాలి. ఉపనయనం జరిగినప్పటి నుండి వ్యక్తికి గురువుద్వారా వేదాధ్యయనము చేయుటకు అధికారం లభిస్తుంది. తద్వారా ఆవ్యక్తి యొక్క “జ్ఞాన నేత్రము” తెరుచు కొని జ్ఞాన సముపార్జన చేసుకోగల అవకాశం కల్పింపబడుతుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ఉపనయనం తప్పనిసరి. ఉపనయనం జరిగినప్పటి నుండి వ్యక్తి బ్రహ్మచారిగా పరిగణింపబడతాడు.
వేదారంభ సంస్కారం – బ్రహ్మచారి, గాయత్రీ మంత్రం మొదలు నాలుగు వేదాలూ పఠించడానికి గురుకులంలో చేరి, అందుకు సంబంధించిన పద్ధతులు తెలుసుకోవడాన్ని వేదారంభ సంస్కారం అంటారు.

సమావర్తన సంస్కారం - విద్యాభ్యాసం ముగించి, గురుకులాన్ని విడిచివెళ్లే విద్యార్థికి సమావర్తన సంస్కారం జరుగుతుంది. దీంతోపాటు వివాహానికి సిద్ధపరిచే మంగళస్నానం కూడా చేయబడుతుంది. సంస్కారం పొందిన వానిని స్నాతకుడు అంటారు. అయితే ఈ రోజుల్లో ఈ స్నాతక సంస్కారాన్ని వివాహ సమయంలో ఒక తంతుగా నిర్వహించడం పద్దతిగా వస్తున్నాది.

ఒక వ్యక్తి ఉపనయనం చేయకముందు బాలుడు కనుక  తెలియక చేసే తప్పులకు పాపం, తనకు అంటదు. ఉపనయనం తరవాత మంచి చెడు తెలుసుకొనే యుక్త వయస్కుడు కనుక తరువాత చేసే పాపకర్మలు తనకే చెందుతాయి. అందువలన ఉపనయనం చేయక ముందు ఒక జన్మ ఉపనయనం తరావత ఒక జన్మగా పరిగణించి ఉపనయన సంస్కారము జరిగిన బ్రాహ్మణుడుని ద్విజుడు అంటారు. ద్విజుడు అంటే రెండు జన్మలు కలవాడు అని అర్ధం.

“జన్మనా జ్జాయతే శూద్రః, సంస్కారాత్ ద్విజయుచ్చతే”

– మనిషి పుట్టుకతో శూద్రుడే, అయినా సుసంస్కారముచేత ద్విజుడుగా వ్యవహరింపబడుతాడు.

 ఉపనయన సంస్కారమునకు వేదములలో వయసు ప్రమాణం నిర్ధేశించ బడినది.

ఆపస్తంభ సూత్రం ప్రకారము

 గర్భాష్ట మేషు బ్రాహ్మణ ముష్ణయీత, గర్భఏకాదశేషు రాజన్యం, గర్భద్వాదశేషువైశ్యం

అనగా బ్రాహ్మణులకు గర్భంతో కలిపి ఎనిమిదవ సంవత్సరం, రాజులకు గర్భంతో కలిపి పదకొండవ సంవత్సరం, వైశ్యులకు గర్భంతో కలిపి పన్నెండవ సంవత్సరం ఉపనయనమునకు విశేషం అని చెప్పారు.

అయితే కారణాంతరాలవలన ఈరోజుల్లో ఈ వయసు నిర్ధిష్ఠతను పాఠించడం అరుదైంది. అయితే ఈ విదంగా వయసు నిర్ధిష్ఠతను పాఠించకుండా ఉపనయనముచేసేటప్పుడు వాటి ఫలితాంశములు తెలుసుకోవడం ఎంతైనా అవసరము

ఆపస్తంభ సూత్రం ప్రకారము

సప్తమే బ్రహ్మవర్చసకామం, అష్టమమాయుష్కాయం, నవమే తేజస్కామం, దశమే అన్నాద్య కామం, ఏకాదశ ఇంద్రియ కామం, ద్వాదశే పశుకామం అని చెప్పబడినది.

అనగా ఏడవ సంవత్సరంలో బ్రహ్మవర్ఛస్సు, ఎనిమిదవ సంవత్సరంలో ఆయుః వృద్ధి, తొమ్మిదవ సంవత్సరంలో తేజస్సు, దశమ వర్షంలో అన్నాది కాంక్ష, పదకొండవ సంవత్సరంలో ఇంద్రియ కాంక్ష, పన్నెండవ సంవత్సరంలో పశు కాంక్ష కలగుతాయని శాస్త్రములో చెప్పబడినది.

ఇదేవిధంగా ఉపనయనం చేయుటకు గరిష్ట వయోపరిమితి కూడా వేదములలో నిర్ధేశించబడినది.

“అ షోడశాత్ బ్రాహ్మణస్య సావిత్రీనాతి వర్తతే”

అంటే 16 సంవత్సరం దాటిన తరువాత ఉపనయనం వలన సావిత్రీ అనుగ్రహింపదు. అందువలన 16 సంవత్సరంలోపు ఉపనయనం చేయమని శాస్త్రం.

ఈ వయో పరిమితి యొక్క అంతరార్థము ఏమనగా

కామవికారములు మనస్సులోనికి ప్రవేశంచటకు ముందే బాలుడు గాయత్రీ మంత్రమును అనుష్ఠించి ఆ మంత్ర ప్రభావముచేత వేదవేదాంగములను చక్కగా అధ్యయనం చేయాలన్నదే ఉపనయన లక్ష్యము. కామవికారములకు వశమైన మనస్సు లక్ష్యం నుండి దూరమై సంపాదించిన మంత్ర శక్తి క్షీణించిపోయు వేదాధ్యయనం కుంటుబడుతుంది. చిన్న వయస్సులోనే గాయత్రీ మంత్రోపదేశం పొందిన బాలుడు కామోద్భవం జరిగే వయస్సు వచ్చేనాటికి గాయత్రీ మంత్ర పునశ్చరణ చేత ప్రావీణ్యతను పొందగలుగుతాడు. విద్యలో కొంత స్థాయిని చేరతాడు. గాయత్రి నిండిన మనస్సులో కామానికి చోటుండదు. పదహారేళ్ల వయస్సులో ఉపనయనమయిన వారికి ఇది సాధ్యపడదు. అందువల్లనే ఉపనయనం జరగవలసిన వయస్సు నిర్ణయించబడింది.

అలాగే ఉపనయనమునకు శ్రేష్టమయిన కాలము గురించి శాస్త్రములో ఈ విధంగా సూచించబడినది.

“వసంతే బ్రాహ్మణ ముపనయితే, గ్రీష్మే రాజన్యం, శరదివైశ్యం, మాఘాధి శుక్రాంతం పంచమాసావా సాధారణా సకలద్విజనాం”

అనగా వసంత ఋతువు బ్రాహ్మణులకు, గ్రీష్మ ఋతువు క్షత్రియులకు, శరదృతువు వైశ్యులకు ఉపనయమునకు విశేషమైన కాలముగా చెప్పబడినది.  అలాగే మాఘమాసంతో మొదలైన ఐదుమాసములు అనగా మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ,జ్యేష్ట మాసములు కూడా ఉపనయనమునకు అనుకూలమైనవే. ఈ మాసములన్ని ఉత్తరాయణ కాలంలో ఉండడంవలన, ఉత్తరాయణ కాలం ఉపనయనమునకు శ్రేష్ఠంగా ఎంచబడింది. ఎట్టి పరిస్థితులలోను దక్షిణాయన కాలంలో జరగరాదు.

తరవాత ఉపనయనము చేయుటకు అధికారము గలవారు శాస్త్రములో పేర్కొనబడినారు.

“పీతైవోపనయేత్పుత్రం తదభావే పితః పితా; తదభావే పితుర్భ్రాతా, తదభావేతు సోదర; తదభావే సగోత్ర  సపిండా; తదభావేన సపిండ సగోత్రజ;”

ఉపనయనము చేయుటకు తండ్రి, పితామహుడు (తాత), తండ్రి సోదరుడు ( పినతండ్రి లేదా పెద తండ్రి), సోదరుడు, సగోత్రులు  మొదలగు వారు అర్హులు.

చివరగా, పుత్రులు అత్మోన్నతి విషయంలో తల్లిదండ్రులు బాధ్యతవహించాలి.  దానికోసమై పైన చెప్పబడిన విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని పిల్లలకు సకాలంలో ఉపనయనం జరుపడం, ఉపనయనం అయిన పిల్లలు నిత్యమూ సంధ్యావందనం చేసేట్లుచూడడంవంటి బాధ్యతలు శ్రద్దతో నిర్వర్తించాలి.

Saturday, 3 May 2014

KARPURA TAAMBULAM


కర్పూర తాంబూలము

మనము మన నిత్య పూజలలో దేవునికి సమర్పించుకొనే కర్పూర తాంబూలము లోని పదార్థాలు మీకు తెలుసా? అవి

తమలపాకులు

యాలకులు

లవంగాలు

పచ్చ కర్పూరము

కస్తూరి

నాగకేసరాలు

జాజికాయ

పోకచెక్కలు

కొబ్బరి ముక్కలు

మిరియాలు

శొంఠి

సున్నము

కాచు

కవ్విరి
మున్నగు వస్తువులతో కూడిన తాంబూలాన్ని కర్పూర తాంబూలము అని అంటారు

Friday, 2 May 2014

PANCHA PRAYAGAS


పంచ ప్రయాగలు

పంచ ప్రయాగలలో స్నానము వలన సర్వతీర్థాలలో స్నానము చేసినంత పలితం లభిస్తుంది. ఈ జన్మలోనే కాకుండ వెనుక జన్మలలో చేసిన పాపాలు కూడా నశిస్తాయి. మనము నిత్యజీవితములో ఎన్నో శాస్త్రవిరుద్దమైన పనులు చేస్తూ ఉంటాము. వీటిల్లో కొన్ని తెలిసి కొన్ని తెలియక చేస్తూ ఉంటాము. ఈ పాపాల ప్రాయశ్చిత్తము మనము ఈజన్మలో చేసుకొనకపోతే అవి ముందుజన్మలలో మనని భాధిస్తాయు. ఆందువలన ఈ తీర్థస్నానాలను శాస్త్రము సూచించింది. వీటిని ఆచరించడం వలన మనము తెలిసి, తెలియని పాపాలను ప్రక్షాళనము చేసుకొనే అవకాశమును వినియోగించుకొంటాము.

 

1. విష్ణు ప్రయాగ –

అలకనంద నది ధవళగంగ నది యొక్క సంగమ ప్రదేశము
                                   (సరస్వతి నది అలనందతో కలసి దవళగంగ గా ప్రసిద్ధికెక్కినది)

2. నంద ప్రయాగ
     అలకనంద నది నందాకిని నది యొక్క సంగమ ప్రదేశము
3.కర్ణ ప్రయాగ
     అలకనంద నది పిండరగంగ నది యొక్క సంగమ ప్రదేశము
4. రుద్ర ప్రయాగ
     అలకనంద నది మందాకిని నది యొక్క సంగమ ప్రదేశము
5. దేవ ప్రయాగ
     అలకనంద నది భాగీరథి నది యొక్క సంగమ ప్రదేశము

ఋషీకేశ్ – బద్రీనాథ్ మార్గములో
                 పైన చెప్పిన ప్రదేశములు తిలకించ వచ్చు