రామేశ్వరం-కాశీ- రామేశ్వరం
యాత్ర-1
కాశీయాత్ర చేయాలన్న దృఢ సంకల్పముతో మా గురువుల
యొక్క, మా తల్లిగారి యొక్క ఆశీర్వచనములు తీసుకొని, మాదంపతులు
మాచెల్లెలు,బావగార్లతో కలసి, కాశీయాత్రలో ప్రథమభాగంగా రామేశ్వరక్షేత్రమునకు తేదీ 12.10.14
న బెంగుళూరులో రాత్రి
గం.9 లకు బయలుదేరేము. మదురై నగరము మీదుగా ప్రయాణము చేయదలచి, ముందుగా మదురై నగరము తేదీ
13.10.14 ఉదయం 6 గంటలకి చేరుకొన్నాము. అక్కడ రైల్వే విశ్రాంతిగదులలో స్నానాదులు ముగించుకొని,
తరువాత అల్పాహారము చేసి, అచ్చట ఉన్న మీనాక్షి సుందరేశ్వరుల దేవాలయమును దర్శించుటకు
బయలుదేరేము.
తిరుగు దారిలో మదురైకి 5 కి.మీ దూరములోనున్న
“త్రిపురకుండ్రమ్” అనే మరియొక సుబ్రహ్మణ్యక్షేత్రమును దర్శించుకొని, దారిలో బోజనము
ముగించుకొని మా బసకు చేరుకొన్నాము.
రెండవరోజు అనగా తేది 14.10.14
ఉదయం 8 గంటలకు ఒక టాక్సీ
మాట్లాడుకొని మదురైకి 125 కి.మీ దూరములో ఉన్న “పళని” అనే సుబ్రహ్మణ్యక్షేత్రము
దర్శించుకొన్నాము. ఆలయము కొండపైని ఉంది. మెట్లుపైనుండి వెళ్ళడానికి 1000 మెట్లు
ఎక్కవలసిఉంటుండి. అయితే కొండపైకి వెళ్ళడానికి “కేబుల్ కారు” మరియు “ వించ్ లేదా మినిట్రైను” సదుపాయము ఉన్నది.
ఇది సుబ్రహ్మణ్య క్షేత్రములలో చాలా మహిమగల
క్షేత్రము. ఇచ్చటి మూలవిగ్రహము “భోగర్” అనే ఋషి చేత వనమూలికలతో తయారు చేయబడినది.
అందుకే ఇచ్చట మూల విగ్రహానికి జరిగే పంచామృతాబిషేకము యొక్క ప్రసాదము చాలా
పవిత్రమైనది, ఇది పుచ్చుకోవడం మరువరాదు. మేము మొదటగా ప్రధాన ద్వారానికి ఎడమవైపుగల
వినాయకుని దర్శించుకొని లోనికి ప్రవేశించి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకొని, అదే
ఆలయ ప్రాంగణములో ఉన్న “భోగర్” ఋషి యొక్క ఆలయము దర్శించుకొన్నాము. దర్శనము తరువాత
తిరుగు ప్రయాణములో భోజనము ముగించుకొని మాబసకు చేరుకొన్నాము.
మూడవ రోజు అనగా తేది15.10.14 న తెల్లవారుఝాము గం 4.40
లకు రామేశ్వరము
వెళ్ళేరైలులో రామేశ్వరమునకు బయలుదేరేము. మార్గములో రెండు వైపులా గుంపులు గుంపులుగా
నెమళ్ళు చూడవచ్చు. “మండపము” అనే స్టేషను భూభాగానికి చివర స్టేషను. తరువాత
సముద్రముపై కట్టిన రైలు బ్రిడ్జి పైనుండి
రామేశ్వరము దీవి చేరుకొన్నాము. సముద్రముపైనున్న ఈ రైలుబ్రిడ్జి పొడవు
సుమారు 13 కి.మీ ఉంటుంది. రైలులో ఇది దాటడానికి సుమారు ని 20 లు పట్టింది. రైలు ఈ బ్రిడ్జిపైనుండి వెళ్తూఉంటే ఆ అనుభూతిని
అనుభవించాలే గాని మాటలలో చెప్పడానికి వీలుకాదు.
కోవెల ఎదురుగా ఉన్న వీదిలో కంచి శంకరమఠంలో
గదులు తీసుకొని బస చేసేము. బసలో స్నానముచేసిన తరువాత మఠములో ఉన్న పురోహితుని
సహాయముతో స్నానసంకల్పము చేసుకొని మాదంపతులిరువురు కలిసి సముద్ర స్నానము చేసి
సముద్రములోనున్న ఇసుకను రెండు దోసెళ్ళు తీసుకొని పురోహితుని వద్దకు వచ్చేము. ఆయన మాచేత
ఆ ఇసుకతో సేతుమాధవ, బిందుమాధవ, వేణిమాధవ అను మూడులింగములు చేయించి మాచేత పూజలు
జరిపించెను. సేతు మాధవ, బిందుమాధవ లింగములు పురోహితుడు తీసుకొని, వేణి మాధవ
లింగమును “ప్రయాగ” వద్ద గంగలో కలుపుటకై మాకు ఇచ్చెను. ఈ కార్యక్రమముకై మేము
పురోహితునకు రూ.1000 లు సంభావన ఇచ్చేము. తరువాత ఆయన వేరొక పురోహితుని తోడుగా
ఇచ్చి రామలింగేశ్వర ఆలయము లోపల ఉన్న 22 తీర్థములలో స్నానములు
చేయించెను. ఈ తీర్థముల పేర్లు ఆయా తీర్థముల వద్ద వ్రాసి ఉన్నాయు, మరియు ఈక్రింద చూపిన బోర్డులో
వ్రాసి అగ్నితీర్థము వద్ద ఉంచబడినది. వీటి పేర్లు
1.
మహాలక్షీ
2.
సావిత్రి
3.
గాయత్రి
4.
సరస్వతి
5.
సేతు మాధవ
6.
గన్ధ మాధన
7.
కవచ
8.
గవయ
9.
నల
10.
నీల
11.
శంఖు
12.
చక్ర
13.
బ్రహ్మహత్యా విమోచన
14.
సూర్య
15.
చంద్ర
16.
గంగ
17.
యమున
18.
గయ
19.
శివ
20.
సత్యామృత
21.
సర్వ
22.
కోటి
ఈ స్నానముకై ఒక్కొక్కరికి రూ. 125 లు ప్రకారం పురోహితునకు
సంభావన ఇచ్చేము. స్నానములు ముగించుకొని బసకు చేరుకొని దుస్తులు మార్చుకొని, దగ్గరలో
ఉన్న హోటల్ లో అల్పాహారము తీసుకొని విశ్రమించేము.
సాయంకాలం గం 4 లకు కోవెల తెరచే వేళకి
బయలుదేరి రామలింగేశ్వరస్వామి దర్శనార్థమై ఆలయమునకు చేరుకొన్నము. కోవెల ప్రధాన
ద్వారము వద్ద ఉన్న భద్రతా సిబ్బంది చేసే తనిఖీ ముగించుకొని ఆలయము లోనికి
ప్రవేశించేము.
అక్కడ కుడిప్రక్కగా హనుమంతులవారిని, వారు కైలాసమునుండి తెచ్చి ప్రతిష్టించిన
ఆత్మలింగమును దర్శించుకొన్నాము. తరువాత అక్కడ ఉన్న గణపతిని, నందీశ్వరుని, సుబ్రహ్మణ్యస్వామిని,
నవగ్రహమంటపమును దర్శించుకొని వారి అనుమతితో అలయ బహిః ప్రాకారము, మధ్య ప్రాకారము
దాటి అంతః ప్రాకారముకు చేరుకొన్నాము. అచ్చట ప్రత్యేక దర్శనము కొరకై మనిషికి రూ. 50 లు ఇచ్చి టికెట్టు
కొనుక్కొన్నాము. అంతః ప్రాకారములో గల విగ్రహములు, ఉప ఆలయములను దర్శించుకొనుటకై,
ఎత్తుగా ఉన్న ప్రధాన ఆలయ మంటపము
యొక్క ఎడమ
వైపునుండి బయలుదేరి కుడి వైపుగా ప్రదక్షిణగా వెళ్ళి ఈ దిగువ దర్శనాలను
చేసుకొన్నాము.
1.
రామలింగేశ్వరుడు, పర్వతవర్థిని అమ్మవార్ల ఉత్సవమూర్తులు
2.
దక్షిణామూర్తి
3.
నాగ రాజు
4.
శ్రీరామ పట్టాభిషేక విగ్రహములు
1.
లింగోద్భవ శివుడు
2.
బ్రహ్మదేవుడు
3.
శంఖ, చక్ర ధారిణిగా
దుర్గాదేవి.
4.
చండీశ్వరుని ఆలయము
5.
కాశీవిశ్వనాథ ఆలయము – హనుమంతులవారు కైలాసమునుండి తెచ్చిన రెండవ శివలింగమును ఇక్కడ
ప్రతిష్టించడమైనది.
6.
వల్లీ దేవసేన సమేత
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము
పైన తెలిపిన ఉప ఆలయాలు, విగ్రహములు దర్శించుకొన్న తరువాత రామలింగేశ్వరుని
(రామనాథస్వామి) యొక్క దివ్యదర్శనము చేసుకొన్నాము.
తరువాత అంతః ప్రాకారములో ఉన్న ఉప అలయములు తూర్పునుండి
ప్రదక్షణగా దర్శించుకొన్నాము. ఇవి
1.
ఉష,ప్రత్యూష సమేతుడైన సూర్యుడు
2.
కోటిలింగేశ్వరుడు
3.
72 నాయనార్ల కంచు విగ్రహములు
4.
72 నాయనార్ల రాతి విగ్రహములు
5.
సరస్వతీ దేవి ఆలయము
6.
వినాయకుని ఆలయము
7.
శంకర నారాయణుడు
8.
ఆది నారాయణుడు
1.
గౌరీదేవిసమేతుడైన చంద్రశేఖరుని ఆలయము
2.
వల్లీ దేవసేన సమేత
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము
3.
గజలక్ష్మి
4.
ఏకాదశరుద్రులు
5.
కాశీ విశాలాక్షి ఆలయము
6.
కోటితీర్థము ( ఈ తీర్థములో జలము సేకరించి ఇంటికి
తేసుకొని
వెళ్ళాలి. ఈ తీర్థము కోటితీర్థములతో
సమానము)
7.
శివకామి సహిత చిదంబరేశ్వరుడు
8.
అంబలవానర్ , శివకామసుందరి ఆలయము
9.
జ్యోతిర్లింగము
10.
కృత్తిక, రోహిణీ సమేతుడైన చంద్రుడు
తరువాత స్వామి యొక్క అంతరాలయమునకు ఎడమ ప్రక్కగా ఉన్న
ద్వారము గుండా వెళ్ళి “పర్వతవర్థిని” గా వెలసిని అమ్మవారి ఆలయమునకు చేరుకొన్నాము. మొదటగా ప్రథమ ఆవరణలో కుడిప్రక్కగా అష్టలక్ష్మి
విగ్రహములు,ద్వజస్థంభము దర్శించుకొన్నాము. తరువాత రెండవ ఆవరణలోకి ప్రవేశించి అక్కడ
సంతాన, సౌభాగ్య గణపతి విగ్రహాలు, సప్తమాతృకలు, శ్రీదేవి, భూదేవి సమేతుడైన గోవిందరాజస్వామి విగ్రహము, స్వామి-అమ్మవార్ల శయన
గృహము దర్శించుకొని గర్భాలయములోనున్న అమ్మవారి దివ్య స్వరూపమును కన్నులార దర్శించు
కొన్నాము.
దర్శనానంతరం గర్భాలయమునకు
వెలపల ఆవరణలో నున్న పార్వతీదేవి, మీనాక్షి సుందరేశ్వరుల విగ్రహములు,
సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహము దర్శించుకొన్నాము. తరువాత కోవెలకు దగ్గరలో ఉన్న
హోటల్ లో భోజనాలు ముగించుకొని బస చేరుకొన్నాము.
నాల్గవ రోజు అనగా తేది 16.10.14
న తెల్లవారుఝాము
గం. 3.30 లకే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని గం. 4.00 లకు స్పటికలింగదర్శనార్థమై
కోవెల చేరుకొని క్యూలో నిలబడ్డాము. గం. 4.30 లకు టిక్కట్లు ఇవ్వడం
ఆరంబించేరు. మనిషికి రూ 50 లు టిక్కెట్టు కొ్నుక్కొన్నాము. గం 5 లకు మొదలయ్యే స్పటికలింగ
దర్శనము చాలా అపురూప మైనది, లింగము వెనుకవైపు దీపము ఉంచి ఆ స్పటిక లింగమును పాలతో
అభిషేకము చేసేరు. ప్రాతఃకాల ప్రదోషసమయములో ఇంతటి దివ్యదర్శనము కలిగినందుకు
పరవశిస్తూ ఒక అరగంటసేపు అక్కడ గడిపేము. ఆ దివ్య దర్శనానంతరము బసచేరుకొన్నాము.
తరువాత
అల్పాహారములు ముగించుకొని, ఒక టాక్సీ మాట్లాడుకొని, రామేశ్వరములో చూడవలసిన
ముఖ్యమైన ప్రదేశములు చూచుటకు బయలు దేరేము.
1.
గందమాదన పర్వతముపై నున్న రాముని పాద చిహ్నములు
2.
దనుష్ కోటి (ఇక్కడ హిందూమహసముద్రము, బంగళాఖాతము చూడవచ్చు) ఈ
ప్రదేశములో శ్రీరాములవారు రావణసంహారము తరువాత
విభీషణునికి పట్టాభిషేకము చేసినట్టు చెప్తారు. ఇక్కడ కోదండరామస్వామి ఆలయము
అందులో విభీషణుని పట్టాభిషేక ఘట్టాన్ని వివరిస్తూ చిత్రాలు ఉన్నాయి.
3.
అబ్దుల్ కలాం గారి ఇల్లు, వారి సోదరుని యొక్క శంఖములు,
జాతిరత్నాలు, సాలగ్రామములు మరియు ఇతర ఆకర్షక వస్తువులు అమ్మే దుకాణం.
4.
రామ తీర్థము, సీతా తీర్థము, లక్ష్మణ తీర్థము
5.
పంచముఖీ ఆంజనేయ విగ్రహము.
పైన చెప్పిన ప్రదేశములు చూసి దారిలో భోజనము
ముగించుకొని బసచేరు కొన్నాము.
సాయంకాలముగా కోవెలకు వెళ్ళి మరొక్కసారి ఆ
రామలింగేశ్వరస్వామి దివ్య స్వరూపమును తనివితీరా ప్రదోషవేళలో దర్శించుకొని,
బహిః ప్రాకారములో దక్షిణం వైపు ప్రదక్షిణగా
వెళ్ళి ఈ దిగువ ఆలయములు దర్శించుకొన్నాము.
1.
కోదండరామ స్వామి
2.
కవేశ్వరస్వామి
3.
రామలింగేశ్వర ప్రతిష్టా వృత్తాంతమును విగ్రహాల రూపంలో
వివరిస్తూ మండపము, మరియు మండపము బయట చిత్రపటములనూ చూసేము.
4.
గజశాల
1.
హనుమంతుడు
2.
పరమేశ్వరుడు
3.
నాగప్రతిష్టల నడుమ శివలింగము
4.
హనుమంతుడు
5.
మకరద్వజ శివుడు
6.
రుద్రాక్షమండపములో కొలువైఉన్న నటరాజస్వాముల వారిని, వారిని
సేవిస్తూ ఇరుప్రక్కలా ఉన్న వ్యాఘ్రపాదులవారు, పతంజలి వారిని దర్శించుకొన్నాము. అదే
ఆలయములోపల శ్రీదేవి, భూదవి సమేత శేషశయన విష్ణువు, వినాయకుడు, పుట్టలతో కూడిన
నాగప్రతిష్టలు, పార్వతీదేవి, కుమారస్వామి విగ్రహములను చూసేము.
తరువాత మధ్య ప్రాకారములో ఉన్న ఈ దిగువ ఆలయము
దర్శించుకొన్నాము.
1.
వినాయకుడు
2.
వినాయకుడు,శివుడు,కార్తికేయుడు
3.
అమ్మవారు,శివలింగాలు
4.
శివలింగాలు
5.
ప్రసన్నలక్ష్మీగణపతి (దశిభుజగణపతి)
6.
శివలింగాలు
గయ, యమున, గంగ, శివ, సూర్య, చంద్ర, సత్యామృత తీర్థాల
నడుమ వెలసిన కాలభైరవుని దర్శించుకొన్నాము.
తరువాత గం 7.30 లకు జరిగే పల్లకీ
ఊరేగింపు, గం 8.00 లకు జరిగే పవళింపు సేవ చూసుకొని బసకు చేరుకొన్నాము.
ఐదవ రోజు అనగా తేది 17.10.14
నాడు ఉదయం గం. 6 లకు ప్రాతఃకాల రామలింగేశ్వరస్వామి
మరియు పర్వతవర్ధినీ అమ్మవార్ల దర్శనము చేసుకొని బసకు చేరుకొన్నాము. మా బెంగుళూరు తిరుగుప్రయాణమునకు రైలు మధురై నుండి అగుటచే, మధురై
చేరుటకు ఒక టాక్సీ మాట్లాడుకొని బయలుదేరేము.
మార్గమద్యములో రామేశ్వరమునకు 56 కి.మీ దూరములో ఉన్న
"తిరుపుళాని” అనే గ్రామములో ఉన్న సుమారు 400 సంవత్సరాల నాటి విష్ణ్వాలయము చేరుకొన్నాము.
ఈ ఆలయము పేరు “పెరుమాళ్ కోయిల్”. ఇది 44 వ వైష్ణవ దివ్యదేశముగా
ప్రసిద్దిపొందింది. ఇచ్చట వెలసిన శ్రీదేవి భూదేవి సమేత ఆదిజగన్నాథస్వామి, పద్మావతి
అమ్మవారు, ధర్భాశయన రాముడు, సంతాన గోపాలకృష్ణుడు, పట్టాభిరాముడు మొదలగు
దేవతామూర్తులను దర్శించుకొని మద్యాహ్నము గం. 2 లకు మధురై చేరుకొన్నాము.
దర్శించుకొన్న అన్నిక్షేత్రాలలో ఉన్న అంతమంది
దేవతల ఆశీస్సులతో ఆ రాత్రి గం. 12 లకు బెంగుళూరు వెళ్ళవలసిన రైలులో మేము బయలుదేరి, తేది. 18.10.14 న మా స్వగృహమునకు
చేరుకొన్నాము.
ఉమామహేశ్వరానుగ్రహసిద్ధిరస్తు.
No comments:
Post a Comment