Saturday, 3 January 2015

OUR RAMESWARAM-KASI-RAMESWARAM YATRA PART-3

 
 
రామేశ్వరం-కాశీ- రామేశ్వరం యాత్ర-3
 
 


గతంలో వివరించిన మా రామేశ్వరము-కాశీ-రామేశ్వరము యాత్ర లో చివరి భాగమైన రామేశ్వర క్షేత్ర దర్శనార్థమై  మా గురువుల యొక్క, మా తల్లిగారి యొక్క ఆశీర్వచనములు తీసుకొని, ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ఆ ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులను స్మరించుకొని మాదంపతులు రామేశ్వరక్షేత్రమునకు తేదీ 19.12.14 న బెంగుళూరులో ఉదయం 6.30 గంటలకు బయలుదేరేము. చెన్నై నగరము మీదుగా ప్రయాణము చేసి రామేశ్వరము తేదీ 20.12.14 ఉదయం 5 గంటలకి చేరుకొన్నాము.

రామేశ్వరము స్టేషనులో అతి ప్రాచీనమైన దక్షిణామూర్తి సుందర విగ్రహమును (స్టేషను ప్లాట్ ఫారం నిర్మిస్తున్నప్పుడు భూమి తవ్వుతున్నప్పుడు ఈ విగ్రహము దొరికిందిట) దర్శించుకొని మా నమస్సులు సమర్పించుకొని

 

రామలింగేశ్వరుని ఆలయమునకు ఎదురుగా ఉన్న కరివేన తెలుగు బ్రాహ్మణ సత్రములో బస చేసేము. ఇక్కడ భోజన సదుపాయముతో వసతికి రోజుకు రూ.250/- చార్జి చేసేరు.

తరువాత స్నానాదులు ముగించుకొని మేము ప్రయాగ,కాశీ నుండి తెచ్చిన గంగను తీసుకొని రామలింగేశ్వరుని అభిషేకము చేయుటకై ఆలయమునకు బయలుదేరేము. అచ్చట VIP ప్రవేశమునకై రూ.500 చెల్లించి, గర్భాలయద్వారము ముందు కూర్చొని మేము తెచ్చిన గంగను అర్చకులవారికి స్వామిఅభిషేకమునకై ఇచ్చి, స్వామిని పరిపరి విధాలుగా ఈ అదృష్టాన్ని మాకు కలిగించినందుకు కృతజ్ఞతలు తెల్పుకొని, ప్రాంగణములోనున్న ఉపఅలయములను (ఉప ఆలయ వివరాలు మా యాత్ర పార్ట్ 1 లో వివరించినందువలన మళ్ళీ ఇచ్చట వివరించుటలేదు), అమ్మవారిని దర్శించుకొని మాబసకు చేరు కొన్నాము.
తరువాత ఒక కారు రూ. 2000 లకు మాట్లాడుకొని అచ్చటకు 75 కి.మీ దూరములో దేవిపట్టణములో ఉన్న నవపాషాణం ( శ్రీరామునిచే ప్రతిష్టించబడిన నవగ్రహముల విగ్రహములు) దర్శించుకొన్నాము.
 

ఇది సముద్రములో కొంచెం లోపలకి ఉంటుంది. భక్తుల దర్శనార్థమై సముద్రములోనికి సిమెంటుతో మార్గాన్ని నిర్మించేరు.

తరువాత అక్కడకు 33 కి.మీ. దూరంలో ఉన్న “ఉతిరగోసమంగై” అనే ప్రాచీన మరకత నటరాజస్వామి ఆలయమునకు వెళ్ళేము. ఇది త్రేతాయుగ కాలము నాటిదని స్థలపురాణం చెప్తుంది. ఇచ్ఛట పరమేశ్వరుడు పార్వతీ దేవికి ముక్తిమార్గాన్ని రహస్యంగా ఉపదేశించెనని స్థలపురాణం చెప్తుంది. ఈ క్షేత్రములో పరమ శివభక్తుడైన “మాణిక్యవాచకర్” కు పరమేశ్వరుడు ముక్తిని ప్రసాదించెను. ఇచ్చట ఉన్న నటరాజవిగ్రహము చందనపూతతో ఉంటుంది. ప్రతీ ఏటా మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రమునాడు చందనపూత తొలగించబడి ఉన్న నిజరూప దర్శనాన్ని పొందవచ్చు. ఇచ్చట మండోదరి మరియు పలువురు మహా ఋషులు పూజించిన శివలింగము, మంగళాంబిక అమ్మవారి దివ్య విగ్రహమును దర్శించుకొన్నాము.


ఆలయప్రాంగణములో అతిప్రాచీనమైన బదరీవృక్షము, నందీశ్వరుడు ఈ ఆలయముయొక్క వయసుని తెలిపే నిదర్శనముగా ఇప్పటికీ ఉన్నాయి.
ఆలయప్రాంగణములో అతిప్రాచీనమైన బదరీవృక్షము, నందీశ్వరుడు ఈ ఆలయముయొక్క వయసుని తెలిపే నిదర్శనముగా ఇప్పటికీ ఉన్నాయి.

ఈ ఆలయదర్శనము ముగించుకొని అచ్చటకు 11 కి.మీ. దూరములో ”తిరుప్పుళాని” అను గ్రామములో ఉన్న 44 వ వైష్ణవ దివ్యదేశమైన ఆది జగన్నాథస్వామి ఆలయము ఉన్నది. పెరుమాళ్ కోయిల్ అని ప్రాంతీయ జనులు పిలుస్తారు.
 

త్రేతాయుగములో దశరథుడు పుత్రార్థియై ఇచ్చట వెలిసిన ఆదిజగన్నాథుని కొలిచెనని స్థలపురాణము చెప్తుంది. తిరుమల వెంకటేశ్వరుని తలపిస్తూ శ్రీదేవి, భూదేవి తో కూడిన ఆదిజగన్నాథుని దర్శించేము. మరియు మంగాపురంలో నున్న అమ్మవారి రూపాన్ని తలపిస్తూ ఇక్కడ వెలిసిన పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకొన్నాము. ఇదే ఆలయ ప్రాంగణములో శ్రీరాముడు రావణసంహారము తరువాత ఇచ్చట కొలదిసేపు విశ్రమించెనని అంటారు. ఈ ఘట్టాన్ని తెలుపుతూ ఇక్కడ ధర్భశయన రాములవారి ఆలయము వెలసింది. ఇంకా ద్వాపర యుగంలో వెలసినన సంతాన గోపాల స్వామి ఆలయము కూడ దర్శించుకొన్నాము.

తరువాత అక్కడకు 3 కి.మీ దూరములోనున్న “సేతుబంధ జైవీర ఆంజనేయ” ఆలయములో సుందరమైన హనుమంతులవారిని దర్శించుకొన్నాము. ఇక్కడ సముద్రము అలలు లేకుండా నిర్మలంగా కనిపిస్తుంది.
                          
ఆలయ దర్శనాలన్నీ ముగించుకొని మాబసకు సుమారు 2 గంటలకు చేరుకొన్నాము. భోజనాదులు ముగించుకొని విశ్రమించేము. 4 గంటలకు బయలు దేరి ఆ రోజు మాస శివరాత్రి గావున ప్రదోషవేళలో రామలింగేశ్వరుని దర్శించుకొనుటకై ఆలయానికి వెళ్ళేము. ఉప ఆలయములలో ఉన్న దేవుళ్ళను దర్శించుకొని రామలింగేశ్వరుని ప్రదోష పూజ,హారతి దర్శించి ఆలయ ప్రాంగణములో దీపాలను వెలిగించుకొని కొంచెం సేపు శివ స్తోత్రపారాయణలు చేసుకొని తరువాత అమ్మవారి ఆలయములో  పారాయణము చేసుకొని అమ్మవారి సాయంకాల హారతి దర్శనాన్ని పొందేము. తరువాత ఆ రోజు జరిగే అమ్మవారి నగర ఊరేగింపు కార్యక్రమములో పాల్గొనే అదృష్టాన్ని అమ్మవారు మాకు కల్పించేరు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ ఊరేగింపు కార్యక్రమములో పాల్గొన్నాము.
 
ఈ కార్యక్రమమును తిలకించి మా బసకు 9 గంటలకు చేరుకొన్నాము.
మరునాడు 21.12.14 తేదీన అమావాస్య పితృ తర్పణ కార్యక్రమములు ముగించుకొని, షాపింగ్ చేసుకొని, ఆ రోజు సాయంకాలము 5 గంటలకు బయలుదేరే చెన్నై ఎక్స్ ప్రెస్ లో  చెన్నై మీదుగా బెంగుళూరు కు తిరుగు ప్రయాణానికి రైల్వేస్టేషనుకు బయలుదేరేము.
ఆది దంపతులైన ఆ పార్వతీపరమేశ్వరులు మాకు ప్రసాదించిన ఈ దివ్య అవకాశానికి ఆ దేవదేవులకు సహస్ర కృతజ్ఞతా ప్రణామములు అర్పించుకొని, కాశీ యాత్ర పూర్ణఫలాన్ని మాకు కలుగజేయమని వేడుకొంటూ, 22.12.14 మధ్యాహ్నము 1 గంటకు మా బెంగుళూర్ చేరుకొన్నాము.
 

 

OUR RAMESWARAM-KASI-RAMESWARAM YATRA - PART 1


రామేశ్వరం-కాశీ- రామేశ్వరం యాత్ర-1

 

కాశీయాత్ర చేయాలన్న దృఢ సంకల్పముతో మా గురువుల యొక్క, మా తల్లిగారి యొక్క ఆశీర్వచనములు తీసుకొని, మాదంపతులు మాచెల్లెలు,బావగార్లతో కలసి, కాశీయాత్రలో ప్రథమభాగంగా రామేశ్వరక్షేత్రమునకు తేదీ 12.10.14 న బెంగుళూరులో రాత్రి గం.9 లకు బయలుదేరేము. మదురై నగరము మీదుగా ప్రయాణము చేయదలచి, ముందుగా మదురై నగరము తేదీ 13.10.14 ఉదయం 6 గంటలకి చేరుకొన్నాము. అక్కడ రైల్వే విశ్రాంతిగదులలో స్నానాదులు ముగించుకొని, తరువాత అల్పాహారము చేసి, అచ్చట ఉన్న మీనాక్షి సుందరేశ్వరుల దేవాలయమును దర్శించుటకు బయలుదేరేము. 
 
మీనాక్షి అమ్మవారిని దర్శించుటకు తూర్పు గోపుర ద్వారమునుండి ప్రవేశింపవలెను. ఈ విధంగా ప్రవేశించినపుడు ముందుగా అష్టశక్తి మండపము చూడవచ్చు. రెండుప్రక్కలా ఉండే దుకాణములను దాటుకొనివెళ్తే, ఎడమచేతి వైపు స్వర్ణకమలముతో ఉన్న పుష్కరిణి చూడవచ్చు. ఇంకాముందుకి వెళ్తే అమ్మవారి ఆలయముయొక్క బహిఃప్రాకారము చేరుకొంటాము. అచ్చట ఉన్న వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యుని దర్శించుకొని, అమ్మవారి అంతరాలయములో ప్రవేశించేము. అమ్మవారి దివ్య దర్శనము చేసుకొని సుందరేశ్వరుని దర్శనముకొరకై బయటకు వస్తూ ఉండగా, బహిః ప్రాకారములో పెద్ద వినాయకుడు దర్శనమిస్తాడు, వినాయకుని దర్శించుకొన్నమీదట కొద్దిగా ముందుకి వెళ్తే పెద్ద నందిమంటపము చూస్తాము. ఈ మంటపములో కాలభైరవుడు, ఉగ్రభైరవుడు, వీరభద్రుడు, బద్రకాళి, చంద్రశేఖరుడు, అర్థనారీశ్వరుడు, కేశవుడు, ఆంజనేయుడు,  వినాయకుడు మొదలగు విగ్రహములు దర్శించుకొన్నాము. తరువాత అచట నెలకొనియున్న నందీశ్వరుని ప్రార్థించి సుందరేశ్వరుని అంతరాలయములో ప్రవేశించేము. తరువాత స్వామి అంతరాలయములో వెలసిన 72 నాయనార్లు, సప్తమాతృకలు, దక్షిణామూర్తి, లింగోద్భవ శివుడు,  సరస్వతీ దేవి, కల్యాణ సుందరేశ్వరుడు, సాదువుగా  దర్శనమిచ్చిన పరమేశ్వరుడు, దుర్గాదేవి, మహాలక్ష్మీదేవి, వల్లిదేవసమేత సుబ్ర హ్మణ్యేశ్వర్యుడు, చండీశ్వరుడు, క్షేత్రవృక్షమైన కదంబవృక్షము, మరియు శిఖర దర్శనమునకై ఏర్పాటుచేసిన పాయింట్స్ మొదలైనవి దర్శించుకొని పిదప సుందరే శ్వరుని దర్శించుకొన్నాము. దైవ దర్శనములు మొగించుకొన్న తరువాత రైల్వేస్టేషన్ కు దగ్గరలో ఉన్న “శబరీష్” అనే శాఖాహార హోటల్ కు వెళ్ళి భోజనము చేసి విశ్రాంతితీసుకొని గం.3 లకు బయలుదేరి మధురైకి 30 కి.మీ దూరములో కొండపైన ఉన్న “పళముదిర్ చోళై” అనే సుబ్రహ్మణ్యక్షేత్రమునూ కొండ దిగువన ఉన్న వైష్ణవ దివ్యదేశాలలో ఏభైనాల్గవదైన “అళగర్ కోవెల” అనే విష్ణు ఆలయమును దర్శించుకొన్నాము. 

తిరుగు దారిలో మదురైకి 5 కి.మీ దూరములోనున్న “త్రిపురకుండ్రమ్” అనే మరియొక సుబ్రహ్మణ్యక్షేత్రమును దర్శించుకొని, దారిలో బోజనము ముగించుకొని మా బసకు చేరుకొన్నాము.

రెండవరోజు అనగా తేది 14.10.14 ఉదయం 8 గంటలకు ఒక టాక్సీ మాట్లాడుకొని మదురైకి 125 కి.మీ దూరములో ఉన్న “పళని” అనే సుబ్రహ్మణ్యక్షేత్రము దర్శించుకొన్నాము. ఆలయము కొండపైని ఉంది. మెట్లుపైనుండి వెళ్ళడానికి 1000 మెట్లు ఎక్కవలసిఉంటుండి. అయితే కొండపైకి వెళ్ళడానికి “కేబుల్ కారు” మరియు   “ వించ్ లేదా మినిట్రైను” సదుపాయము ఉన్నది.

ఇది సుబ్రహ్మణ్య క్షేత్రములలో చాలా మహిమగల క్షేత్రము. ఇచ్చటి మూలవిగ్రహము “భోగర్” అనే ఋషి చేత వనమూలికలతో తయారు చేయబడినది. అందుకే ఇచ్చట మూల విగ్రహానికి జరిగే పంచామృతాబిషేకము యొక్క ప్రసాదము చాలా పవిత్రమైనది, ఇది పుచ్చుకోవడం మరువరాదు. మేము మొదటగా ప్రధాన ద్వారానికి ఎడమవైపుగల వినాయకుని దర్శించుకొని లోనికి ప్రవేశించి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకొని, అదే ఆలయ ప్రాంగణములో ఉన్న “భోగర్” ఋషి యొక్క ఆలయము దర్శించుకొన్నాము. దర్శనము తరువాత తిరుగు ప్రయాణములో భోజనము ముగించుకొని మాబసకు చేరుకొన్నాము.

మూడవ రోజు అనగా తేది15.10.14 న తెల్లవారుఝాము గం 4.40 లకు రామేశ్వరము వెళ్ళేరైలులో రామేశ్వరమునకు బయలుదేరేము. మార్గములో రెండు వైపులా గుంపులు గుంపులుగా నెమళ్ళు చూడవచ్చు. “మండపము” అనే స్టేషను భూభాగానికి చివర స్టేషను. తరువాత సముద్రముపై కట్టిన రైలు బ్రిడ్జి పైనుండి  రామేశ్వరము దీవి చేరుకొన్నాము. సముద్రముపైనున్న ఈ రైలుబ్రిడ్జి పొడవు సుమారు 13 కి.మీ ఉంటుంది. రైలులో ఇది దాటడానికి సుమారు ని 20 లు పట్టింది. రైలు ఈ బ్రిడ్జిపైనుండి వెళ్తూఉంటే ఆ అనుభూతిని అనుభవించాలే గాని మాటలలో చెప్పడానికి వీలుకాదు.

 
కోవెల ఎదురుగా ఉన్న వీదిలో కంచి శంకరమఠంలో గదులు తీసుకొని బస చేసేము. బసలో స్నానముచేసిన తరువాత మఠములో ఉన్న పురోహితుని సహాయముతో స్నానసంకల్పము చేసుకొని మాదంపతులిరువురు కలిసి సముద్ర స్నానము చేసి సముద్రములోనున్న ఇసుకను రెండు దోసెళ్ళు తీసుకొని పురోహితుని వద్దకు వచ్చేము. ఆయన మాచేత ఆ ఇసుకతో సేతుమాధవ, బిందుమాధవ, వేణిమాధవ అను మూడులింగములు చేయించి మాచేత పూజలు జరిపించెను. సేతు మాధవ, బిందుమాధవ లింగములు పురోహితుడు తీసుకొని, వేణి మాధవ లింగమును “ప్రయాగ” వద్ద గంగలో కలుపుటకై మాకు ఇచ్చెను. ఈ కార్యక్రమముకై మేము పురోహితునకు రూ.1000 లు సంభావన ఇచ్చేము. తరువాత ఆయన వేరొక పురోహితుని తోడుగా ఇచ్చి రామలింగేశ్వర ఆలయము లోపల ఉన్న 22 తీర్థములలో స్నానములు చేయించెను. ఈ తీర్థముల పేర్లు ఆయా తీర్థముల వద్ద వ్రాసి ఉన్నాయు, మరియు ఈక్రింద చూపిన బోర్డులో వ్రాసి అగ్నితీర్థము వద్ద ఉంచబడినది. వీటి పేర్లు

1.    మహాలక్షీ

2.   సావిత్రి

3.   గాయత్రి

4.   సరస్వతి

5.   సేతు మాధవ

6.   గన్ధ మాధన

7.   కవచ

8.   గవయ

9.   నల

10.                     నీల

11.                     శంఖు

12.                     చక్ర

13.                     బ్రహ్మహత్యా విమోచన

14.                     సూర్య

15.                     చంద్ర

16.                     గంగ

17.                     యమున

 

18.                     గయ

19.                     శివ

20.                     సత్యామృత

21.                     సర్వ

22.                     కోటి

ఈ స్నానముకై ఒక్కొక్కరికి రూ. 125 లు ప్రకారం పురోహితునకు సంభావన ఇచ్చేము. స్నానములు ముగించుకొని బసకు చేరుకొని దుస్తులు మార్చుకొని, దగ్గరలో ఉన్న హోటల్ లో అల్పాహారము తీసుకొని విశ్రమించేము.

సాయంకాలం గం 4 లకు కోవెల తెరచే వేళకి బయలుదేరి రామలింగేశ్వరస్వామి దర్శనార్థమై ఆలయమునకు చేరుకొన్నము. కోవెల ప్రధాన ద్వారము వద్ద ఉన్న భద్రతా సిబ్బంది చేసే తనిఖీ ముగించుకొని ఆలయము లోనికి ప్రవేశించేము.


 

అక్కడ కుడిప్రక్కగా హనుమంతులవారిని,  వారు కైలాసమునుండి తెచ్చి ప్రతిష్టించిన ఆత్మలింగమును దర్శించుకొన్నాము. తరువాత అక్కడ ఉన్న గణపతిని, నందీశ్వరుని, సుబ్రహ్మణ్యస్వామిని, నవగ్రహమంటపమును దర్శించుకొని వారి అనుమతితో అలయ బహిః ప్రాకారము, మధ్య ప్రాకారము దాటి అంతః ప్రాకారముకు చేరుకొన్నాము. అచ్చట ప్రత్యేక దర్శనము కొరకై మనిషికి రూ. 50 లు ఇచ్చి టికెట్టు కొనుక్కొన్నాము. అంతః ప్రాకారములో గల విగ్రహములు, ఉప ఆలయములను దర్శించుకొనుటకై, ఎత్తుగా ఉన్న ప్రధాన ఆలయ మంటపము

యొక్క ఎడమ వైపునుండి  బయలుదేరి కుడి వైపుగా  ప్రదక్షిణగా వెళ్ళి ఈ దిగువ దర్శనాలను చేసుకొన్నాము.

1.               రామలింగేశ్వరుడు, పర్వతవర్థిని అమ్మవార్ల ఉత్సవమూర్తులు

2.               దక్షిణామూర్తి

3.               నాగ రాజు

4.               శ్రీరామ పట్టాభిషేక విగ్రహములు

1.               లింగోద్భవ శివుడు

2.               బ్రహ్మదేవుడు

3.               శంఖ, చక్ర ధారిణిగా దుర్గాదేవి.

4.               చండీశ్వరుని ఆలయము

5.               కాశీవిశ్వనాథ ఆలయము – హనుమంతులవారు కైలాసమునుండి తెచ్చిన రెండవ శివలింగమును ఇక్కడ ప్రతిష్టించడమైనది.

6.               వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము

పైన తెలిపిన ఉప ఆలయాలు, విగ్రహములు దర్శించుకొన్న తరువాత రామలింగేశ్వరుని (రామనాథస్వామి) యొక్క దివ్యదర్శనము చేసుకొన్నాము.

తరువాత అంతః ప్రాకారములో ఉన్న ఉప అలయములు తూర్పునుండి ప్రదక్షణగా దర్శించుకొన్నాము. ఇవి

1.   ఉష,ప్రత్యూష సమేతుడైన సూర్యుడు

2.   కోటిలింగేశ్వరుడు

3.   72 నాయనార్ల కంచు విగ్రహములు

4.   72 నాయనార్ల రాతి విగ్రహములు

5.   సరస్వతీ దేవి ఆలయము

6.   వినాయకుని ఆలయము

7.   శంకర నారాయణుడు

8.   ఆది నారాయణుడు

1.   గౌరీదేవిసమేతుడైన చంద్రశేఖరుని ఆలయము

2.   వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము

3.   గజలక్ష్మి

4.   ఏకాదశరుద్రులు

5.   కాశీ విశాలాక్షి ఆలయము

6.   కోటితీర్థము ( ఈ తీర్థములో జలము సేకరించి ఇంటికి తేసుకొని  

      వెళ్ళాలి. ఈ తీర్థము కోటితీర్థములతో సమానము)

7.   శివకామి సహిత చిదంబరేశ్వరుడు

8.   అంబలవానర్ , శివకామసుందరి ఆలయము

9.   జ్యోతిర్లింగము

10.                     కృత్తిక, రోహిణీ సమేతుడైన చంద్రుడు
తరువాత స్వామి యొక్క అంతరాలయమునకు ఎడమ ప్రక్కగా ఉన్న ద్వారము గుండా వెళ్ళి “పర్వతవర్థిని” గా వెలసిని అమ్మవారి ఆలయమునకు చేరుకొన్నాము. మొదటగా  ప్రథమ ఆవరణలో కుడిప్రక్కగా అష్టలక్ష్మి విగ్రహములు,ద్వజస్థంభము దర్శించుకొన్నాము. తరువాత రెండవ ఆవరణలోకి ప్రవేశించి అక్కడ సంతాన, సౌభాగ్య గణపతి విగ్రహాలు, సప్తమాతృకలు, శ్రీదేవి, భూదేవి సమేతుడైన  గోవిందరాజస్వామి విగ్రహము, స్వామి-అమ్మవార్ల శయన గృహము దర్శించుకొని గర్భాలయములోనున్న అమ్మవారి దివ్య స్వరూపమును కన్నులార దర్శించు కొన్నాము.


దర్శనానంతరం గర్భాలయమునకు వెలపల ఆవరణలో నున్న పార్వతీదేవి, మీనాక్షి సుందరేశ్వరుల విగ్రహములు, సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహము దర్శించుకొన్నాము. తరువాత కోవెలకు దగ్గరలో ఉన్న హోటల్ లో భోజనాలు ముగించుకొని బస చేరుకొన్నాము.
నాల్గవ రోజు అనగా తేది 16.10.14 న తెల్లవారుఝాము గం. 3.30 లకే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని గం. 4.00 లకు స్పటికలింగదర్శనార్థమై కోవెల చేరుకొని క్యూలో నిలబడ్డాము. గం. 4.30 లకు టిక్కట్లు ఇవ్వడం ఆరంబించేరు. మనిషికి రూ 50 లు టిక్కెట్టు కొ్నుక్కొన్నాము. గం 5 లకు మొదలయ్యే స్పటికలింగ దర్శనము చాలా అపురూప మైనది, లింగము వెనుకవైపు దీపము ఉంచి ఆ స్పటిక లింగమును పాలతో అభిషేకము చేసేరు. ప్రాతఃకాల ప్రదోషసమయములో ఇంతటి దివ్యదర్శనము కలిగినందుకు పరవశిస్తూ ఒక అరగంటసేపు అక్కడ గడిపేము. ఆ దివ్య దర్శనానంతరము బసచేరుకొన్నాము.
తరువాత అల్పాహారములు ముగించుకొని, ఒక టాక్సీ మాట్లాడుకొని, రామేశ్వరములో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశములు చూచుటకు బయలు దేరేము.

1.               గందమాదన పర్వతముపై నున్న రాముని పాద చిహ్నములు

2.               దనుష్ కోటి (ఇక్కడ హిందూమహసముద్రము, బంగళాఖాతము చూడవచ్చు) ఈ ప్రదేశములో శ్రీరాములవారు రావణసంహారము తరువాత

విభీషణునికి పట్టాభిషేకము చేసినట్టు చెప్తారు. ఇక్కడ కోదండరామస్వామి ఆలయము అందులో విభీషణుని పట్టాభిషేక ఘట్టాన్ని వివరిస్తూ చిత్రాలు ఉన్నాయి.

3.               అబ్దుల్ కలాం గారి ఇల్లు, వారి సోదరుని యొక్క శంఖములు, జాతిరత్నాలు, సాలగ్రామములు మరియు ఇతర ఆకర్షక వస్తువులు అమ్మే దుకాణం.

4.               రామ తీర్థము, సీతా తీర్థము, లక్ష్మణ తీర్థము

5.               పంచముఖీ ఆంజనేయ విగ్రహము. 

పైన చెప్పిన ప్రదేశములు చూసి దారిలో భోజనము ముగించుకొని బసచేరు కొన్నాము. 

సాయంకాలముగా కోవెలకు వెళ్ళి మరొక్కసారి ఆ రామలింగేశ్వరస్వామి దివ్య స్వరూపమును తనివితీరా ప్రదోషవేళలో దర్శించుకొని,
బహిః ప్రాకారములో దక్షిణం వైపు ప్రదక్షిణగా వెళ్ళి ఈ దిగువ ఆలయములు దర్శించుకొన్నాము.
1.               కోదండరామ స్వామి
2.               కవేశ్వరస్వామి
3.               రామలింగేశ్వర ప్రతిష్టా వృత్తాంతమును విగ్రహాల రూపంలో వివరిస్తూ మండపము, మరియు మండపము బయట చిత్రపటములనూ చూసేము.
4.               గజశాల
 
1.               హనుమంతుడు
2.               పరమేశ్వరుడు
3.               నాగప్రతిష్టల నడుమ శివలింగము
4.               హనుమంతుడు
5.               మకరద్వజ శివుడు
6.               రుద్రాక్షమండపములో కొలువైఉన్న నటరాజస్వాముల వారిని, వారిని సేవిస్తూ ఇరుప్రక్కలా ఉన్న వ్యాఘ్రపాదులవారు, పతంజలి వారిని దర్శించుకొన్నాము. అదే ఆలయములోపల శ్రీదేవి, భూదవి సమేత శేషశయన విష్ణువు, వినాయకుడు, పుట్టలతో కూడిన నాగప్రతిష్టలు, పార్వతీదేవి, కుమారస్వామి విగ్రహములను చూసేము.
తరువాత మధ్య ప్రాకారములో ఉన్న ఈ దిగువ ఆలయము దర్శించుకొన్నాము.
1.               వినాయకుడు
2.               వినాయకుడు,శివుడు,కార్తికేయుడు
3.               అమ్మవారు,శివలింగాలు
4.               శివలింగాలు
5.               ప్రసన్నలక్ష్మీగణపతి (దశిభుజగణపతి)
6.               శివలింగాలు
గయ, యమున, గంగ, శివ, సూర్య, చంద్ర, సత్యామృత తీర్థాల నడుమ వెలసిన కాలభైరవుని దర్శించుకొన్నాము.
తరువాత గం 7.30 లకు జరిగే పల్లకీ ఊరేగింపు, గం 8.00 లకు జరిగే పవళింపు సేవ చూసుకొని బసకు చేరుకొన్నాము.
 
ఐదవ రోజు అనగా తేది 17.10.14  నాడు ఉదయం గం. 6 లకు ప్రాతఃకాల రామలింగేశ్వరస్వామి మరియు పర్వతవర్ధినీ అమ్మవార్ల దర్శనము చేసుకొని బసకు చేరుకొన్నాము. మా బెంగుళూరు  తిరుగుప్రయాణమునకు రైలు మధురై నుండి అగుటచే, మధురై చేరుటకు ఒక టాక్సీ మాట్లాడుకొని బయలుదేరేము.
మార్గమద్యములో రామేశ్వరమునకు 56 కి.మీ దూరములో ఉన్న "తిరుపుళాని” అనే గ్రామములో ఉన్న సుమారు 400  సంవత్సరాల నాటి విష్ణ్వాలయము చేరుకొన్నాము.  

ఈ ఆలయము పేరు “పెరుమాళ్ కోయిల్”. ఇది 44 వ వైష్ణవ దివ్యదేశముగా ప్రసిద్దిపొందింది. ఇచ్చట వెలసిన శ్రీదేవి భూదేవి సమేత ఆదిజగన్నాథస్వామి, పద్మావతి అమ్మవారు, ధర్భాశయన రాముడు, సంతాన గోపాలకృష్ణుడు, పట్టాభిరాముడు మొదలగు దేవతామూర్తులను దర్శించుకొని మద్యాహ్నము గం. 2 లకు మధురై చేరుకొన్నాము.

దర్శించుకొన్న అన్నిక్షేత్రాలలో ఉన్న అంతమంది దేవతల ఆశీస్సులతో ఆ రాత్రి గం. 12 లకు బెంగుళూరు వెళ్ళవలసిన రైలులో మేము బయలుదేరి, తేది. 18.10.14 న మా స్వగృహమునకు చేరుకొన్నాము. 

ఉమామహేశ్వరానుగ్రహసిద్ధిరస్తు.