రామేశ్వరం-కాశీ- రామేశ్వరం యాత్ర-3
గతంలో వివరించిన మా రామేశ్వరము-కాశీ-రామేశ్వరము
యాత్ర లో చివరి భాగమైన రామేశ్వర క్షేత్ర దర్శనార్థమై మా గురువుల యొక్క, మా తల్లిగారి యొక్క
ఆశీర్వచనములు తీసుకొని, ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ఆ ఆదిదంపతులైన పార్వతీ
పరమేశ్వరులను స్మరించుకొని మాదంపతులు రామేశ్వరక్షేత్రమునకు తేదీ 19.12.14
న బెంగుళూరులో
ఉదయం 6.30 గంటలకు బయలుదేరేము. చెన్నై నగరము మీదుగా ప్రయాణము చేసి రామేశ్వరము తేదీ 20.12.14 ఉదయం 5 గంటలకి చేరుకొన్నాము.
రామేశ్వరము స్టేషనులో అతి ప్రాచీనమైన దక్షిణామూర్తి
సుందర విగ్రహమును (స్టేషను ప్లాట్ ఫారం నిర్మిస్తున్నప్పుడు భూమి తవ్వుతున్నప్పుడు
ఈ విగ్రహము దొరికిందిట) దర్శించుకొని మా నమస్సులు సమర్పించుకొని
రామలింగేశ్వరుని ఆలయమునకు ఎదురుగా ఉన్న కరివేన
తెలుగు బ్రాహ్మణ సత్రములో బస చేసేము. ఇక్కడ భోజన సదుపాయముతో వసతికి రోజుకు రూ.250/- చార్జి చేసేరు.
తరువాత స్నానాదులు ముగించుకొని మేము
ప్రయాగ,కాశీ నుండి తెచ్చిన గంగను తీసుకొని రామలింగేశ్వరుని అభిషేకము చేయుటకై
ఆలయమునకు బయలుదేరేము. అచ్చట VIP ప్రవేశమునకై రూ.500 చెల్లించి,
గర్భాలయద్వారము ముందు కూర్చొని మేము తెచ్చిన గంగను అర్చకులవారికి
స్వామిఅభిషేకమునకై ఇచ్చి, స్వామిని పరిపరి విధాలుగా ఈ అదృష్టాన్ని మాకు
కలిగించినందుకు కృతజ్ఞతలు తెల్పుకొని, ప్రాంగణములోనున్న ఉపఅలయములను (ఉప ఆలయ
వివరాలు మా యాత్ర పార్ట్ 1 లో వివరించినందువలన మళ్ళీ ఇచ్చట వివరించుటలేదు), అమ్మవారిని
దర్శించుకొని మాబసకు చేరు కొన్నాము.
తరువాత ఒక కారు రూ. 2000 లకు మాట్లాడుకొని అచ్చటకు
75 కి.మీ దూరములో దేవిపట్టణములో ఉన్న నవపాషాణం ( శ్రీరామునిచే ప్రతిష్టించబడిన
నవగ్రహముల విగ్రహములు) దర్శించుకొన్నాము.
ఇది సముద్రములో కొంచెం లోపలకి ఉంటుంది. భక్తుల
దర్శనార్థమై సముద్రములోనికి సిమెంటుతో మార్గాన్ని నిర్మించేరు.
తరువాత అక్కడకు 33 కి.మీ. దూరంలో ఉన్న “ఉతిరగోసమంగై”
అనే ప్రాచీన మరకత నటరాజస్వామి ఆలయమునకు వెళ్ళేము. ఇది త్రేతాయుగ కాలము నాటిదని
స్థలపురాణం చెప్తుంది. ఇచ్ఛట పరమేశ్వరుడు పార్వతీ దేవికి ముక్తిమార్గాన్ని రహస్యంగా
ఉపదేశించెనని స్థలపురాణం చెప్తుంది. ఈ క్షేత్రములో పరమ శివభక్తుడైన
“మాణిక్యవాచకర్” కు పరమేశ్వరుడు ముక్తిని ప్రసాదించెను. ఇచ్చట ఉన్న నటరాజవిగ్రహము
చందనపూతతో ఉంటుంది. ప్రతీ ఏటా మార్గశిర మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రమునాడు చందనపూత
తొలగించబడి ఉన్న నిజరూప దర్శనాన్ని పొందవచ్చు. ఇచ్చట మండోదరి మరియు పలువురు మహా ఋషులు
పూజించిన శివలింగము, మంగళాంబిక అమ్మవారి దివ్య విగ్రహమును దర్శించుకొన్నాము.
ఆలయప్రాంగణములో అతిప్రాచీనమైన బదరీవృక్షము,
నందీశ్వరుడు ఈ ఆలయముయొక్క వయసుని తెలిపే నిదర్శనముగా ఇప్పటికీ ఉన్నాయి.
ఆలయప్రాంగణములో అతిప్రాచీనమైన బదరీవృక్షము,
నందీశ్వరుడు ఈ ఆలయముయొక్క వయసుని తెలిపే నిదర్శనముగా ఇప్పటికీ ఉన్నాయి.
ఈ ఆలయదర్శనము ముగించుకొని అచ్చటకు 11 కి.మీ. దూరములో ”తిరుప్పుళాని” అను గ్రామములో ఉన్న 44 వ వైష్ణవ దివ్యదేశమైన ఆది జగన్నాథస్వామి ఆలయము ఉన్నది. పెరుమాళ్ కోయిల్ అని
ప్రాంతీయ జనులు పిలుస్తారు.
త్రేతాయుగములో దశరథుడు పుత్రార్థియై ఇచ్చట
వెలిసిన ఆదిజగన్నాథుని కొలిచెనని స్థలపురాణము చెప్తుంది. తిరుమల వెంకటేశ్వరుని
తలపిస్తూ శ్రీదేవి, భూదేవి తో కూడిన ఆదిజగన్నాథుని దర్శించేము. మరియు మంగాపురంలో
నున్న అమ్మవారి రూపాన్ని తలపిస్తూ ఇక్కడ వెలిసిన పద్మావతి అమ్మవారిని కూడా
దర్శించుకొన్నాము. ఇదే ఆలయ ప్రాంగణములో శ్రీరాముడు రావణసంహారము తరువాత ఇచ్చట
కొలదిసేపు విశ్రమించెనని అంటారు. ఈ ఘట్టాన్ని తెలుపుతూ ఇక్కడ ధర్భశయన రాములవారి
ఆలయము వెలసింది. ఇంకా ద్వాపర యుగంలో వెలసినన సంతాన గోపాల స్వామి ఆలయము కూడ దర్శించుకొన్నాము.
తరువాత అక్కడకు 3 కి.మీ దూరములోనున్న
“సేతుబంధ జైవీర ఆంజనేయ” ఆలయములో సుందరమైన హనుమంతులవారిని దర్శించుకొన్నాము. ఇక్కడ
సముద్రము అలలు లేకుండా నిర్మలంగా కనిపిస్తుంది.
ఆలయ దర్శనాలన్నీ ముగించుకొని మాబసకు సుమారు 2 గంటలకు చేరుకొన్నాము.
భోజనాదులు ముగించుకొని విశ్రమించేము. 4 గంటలకు బయలు దేరి ఆ రోజు
మాస శివరాత్రి గావున ప్రదోషవేళలో రామలింగేశ్వరుని దర్శించుకొనుటకై ఆలయానికి
వెళ్ళేము. ఉప ఆలయములలో ఉన్న దేవుళ్ళను దర్శించుకొని రామలింగేశ్వరుని ప్రదోష
పూజ,హారతి దర్శించి ఆలయ ప్రాంగణములో దీపాలను వెలిగించుకొని కొంచెం సేపు శివ
స్తోత్రపారాయణలు చేసుకొని తరువాత అమ్మవారి ఆలయములో పారాయణము చేసుకొని అమ్మవారి సాయంకాల హారతి
దర్శనాన్ని పొందేము. తరువాత ఆ రోజు జరిగే అమ్మవారి నగర ఊరేగింపు కార్యక్రమములో పాల్గొనే
అదృష్టాన్ని అమ్మవారు మాకు కల్పించేరు. ఈ అవకాశాన్ని
వినియోగించుకొని ఆ ఊరేగింపు కార్యక్రమములో పాల్గొన్నాము.
మరునాడు 21.12.14 తేదీన అమావాస్య పితృ
తర్పణ కార్యక్రమములు ముగించుకొని, షాపింగ్ చేసుకొని, ఆ రోజు సాయంకాలము 5 గంటలకు బయలుదేరే చెన్నై
ఎక్స్ ప్రెస్ లో చెన్నై మీదుగా బెంగుళూరు
కు తిరుగు ప్రయాణానికి రైల్వేస్టేషనుకు బయలుదేరేము.
ఆది దంపతులైన ఆ పార్వతీపరమేశ్వరులు మాకు
ప్రసాదించిన ఈ దివ్య అవకాశానికి ఆ దేవదేవులకు సహస్ర కృతజ్ఞతా ప్రణామములు
అర్పించుకొని, కాశీ యాత్ర పూర్ణఫలాన్ని మాకు కలుగజేయమని వేడుకొంటూ, 22.12.14
మధ్యాహ్నము 1 గంటకు మా బెంగుళూర్
చేరుకొన్నాము.
No comments:
Post a Comment