దక్షిణామూర్తి స్వరూపాలు
సదాశివుని యొక్క గురు స్వరూపమే దక్షిణామూర్తి. సదాశివుని
విశ్వగురువుగా చూపే రూపమే దక్షిణామూర్తి. మోక్షానికి అవసరమైన జ్ఞానాన్నిబోధించి
భవబంధాలను తొలగించి ముక్తిని ప్రసాదించే మార్గము భోదించే ఆది గురువు.
నిధయే సర్వవిద్యానాం,
బిషజే భవ రొగిణాం
గురవే సర్వలోకానాం, దక్షిణామూర్తయే
నమః ||
ఈయన సదా తాదాత్మైకతలో ఉంటూ తన శిష్యులకు
పరావాక్కు ( అనగా మాంస శ్రోత్రములకు వినబడని వాక్కు) తో బోధిస్తూ ఉంటారు. ఈయన
తత్త్వమును అర్థం చేసుకోవడానికి శ్రీ శంకర భగవత్పాదుల వారు రచించిన దక్షిణామూర్తి
స్తోత్రము చదివి దాని సారమును గ్రహించవలెను.
సాధారణంగా మనకు తెలిసిన/చూసిన దక్షిణామూర్తి
స్వరూపము, విశాలమైన వట (మర్రి) వృక్షము క్రింద ఎత్తైన శిలపై వ్యాఘ్ర(పులి)
/కురగ(లేడి) చర్మము ధరించి చతుర్భుజుడై ఉంటారు. ఈయన పైన ఉన్న కుడి చేతిలో ఢమరుకము,
స్ఫటిక అక్షమాలతోను, పైన ఉన్న ఎడమ చేతిలో అగ్ని దివిటీ, క్రింద ఉన్న ఎడమ చేతిలో తాళపత్రములు/కుశాగ్రములు,
క్రింద ఉన్న కుడి చేతితో చిన్ముద్ర తోనూ ఉంటారు. మెడలో సువర్ణాభరణములు,
రుద్రాక్షమాలలు మరియు ఎడమ భుజము పైనుండి యజ్ఞోపవీతము ధరించి ఉంటారు. మరియు తలపై నాగభందముతో
చుట్టబడిన కేశములు, ఆమధ్యలో గంగ, ముందుభాగంలో కిరీటము, కిరీటమునకు ఇరువైపులా సూర్య
చంద్రులు ఉంటాయి. ఆయన కుడిచెవికి కుండలము మరియు ఎడమచెవికి తాటంకము ధరించి ఉంటారు. నుదుటిపై
మూడవనేత్రము, నడుము పై కటిసూత్రము, కటి బంధము ధరించి ఉంటారు. తనకుడి మోకాలు
క్రిందకు నేలపై అపస్మారుడు అనే రాక్షసుణ్ణి తొక్కుతూ ఎడమ మోకాలు కుడి తొడపై ఆనించి
కూర్చొని ఉంటారు. ఆయన ముందర ఆయన నుండి బ్రహ్మజ్ఞానం తెలుసుకొనుటకై సనకుడు,
సనందుడు, సనాతనుడు, కూర్చొని ఉంటారు.
ఈ విధమైన దక్షిణామూర్తి స్వరూపము యొక్క భావమును
మనం పరిశీలించినట్లయితే ఈ క్రింది విషయములు మనకి బోధపడతాయి.
·
విశాలమైన వట (మర్రి) వృక్షము –
విశాలంగా విస్తరించే ఆ పరమాత్ముని సృష్టిని సూచిస్తుంది. వటవృక్షమూలంలో కూర్చొని
ఉన్న దక్షిణామూర్తి, ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడని సూచిస్తున్నాది.
·
ఇక ఆయన స్వరూపము అష్టమూర్తి తత్త్వముతో కూడినది. అనగా పంచ
భూతములు, సూర్య, చంద్రులు, పురుషుడు/ఆత్మ/యజమాని. దక్షిణామూర్తిని రూపాన్ని పరిశీలిస్తే
ఈ అష్టమూర్తి తత్త్వములు మనకు గోచరమవుతాయి. అవి
ఆకాశాద్వాయుః | వాయోరగ్నిః | అగ్నేరాపః | అద్భ్యః పృథివీ |
·
కుడిచేతిలో ఉన్న ఢమరుకము - ఆకాశ తత్త్వము- శబ్దబ్రహ్మ
స్వరూపుడైన ఈశ్వరుడు
·
జటాజూటములు - వాయుతత్త్వము
·
ఎడమ చేతిలో ఉన్న అగ్ని/జ్యోతి – అగ్ని తత్త్వము
·
తలపైన ఉన్న గంగ – జల తత్త్వము
·
మూర్తీభవించిన దక్షిణామూర్తి రూపము – పృథివి తత్త్వము.
·
శిరస్సుకిరువైపులాఉన్న సూర్య చంద్రులు – సూర్య చంద్రులు
·
ధ్యానం/మౌనంలో ఆయన స్వరూపము – యజమాని/పురుషుడు/ఆత్మ
ఈ రూపంలో ఉన్న దక్షిణామూర్తి
సృష్టి, స్థితి, లయ కారుడైన పరమేశ్వరుడుగా గోచరిస్తాడు.
Ø కుడిచేతిలో ఉన్న ఢమరుకము
సృష్టికారకత్వాన్ని తెలియజేస్తుంది.
Ø మద్యలో ఉన్న సూర్య
చంద్రులు స్థితికారకత్వాన్ని తెలియజేస్తుంది.
Ø ఎడమ చేతిలో ఉన్న
అగ్ని/జ్యోతి – లయకారకత్వాన్ని తెలియజేస్తుంది
ఇక మిగిలిన రూపవిశేషాలు పరిశీలించినట్లయితే-
·
పైన ఉన్న కుడి చేతిలో ఢమరుకము, స్ఫటిక అక్షమాల – ఈ
సర్వసృష్టికి మూలాధారమైన శబ్ధస్వరూపము, అ నుండి క్ష వరకు సూచించే అక్షమాల.
·
పైన ఉన్న ఎడమ చేతిలో అగ్ని దివిటీ – అజ్ఞాన తిమిరాన్ని
పోగొట్టే జ్ఞానము. పరమేశ్వరుని సంహార క్రియను సూచించును.
·
క్రింద ఉన్న ఎడమ చేతిలో తాళపత్రములు/కుశాగ్రములు – జ్ఞాన
సంపద, వేదములు సూచిస్తాయి
·
క్రింద ఉన్న కుడి చేతితో చిన్ముద్ర – అభయముద్ర,
జ్ఞానముద్ర,అనుగ్రహము సూచిస్తుంది.
·
మెడలో సువర్ణాభరణములు, రుద్రాక్షమాలలు – ఇవి వీర్యము,
క్షమత, దానము, శీలము, జ్ఞానము మొదలగు గుణములు సూచిస్తాయి.
·
కుడిచెవికి కుండలము మరియు ఎడమచెవికి తాటంకము – కుడిచెవి
కుండలము పురుష తత్త్వము తెలుపగా ఎడమచెవి తాటంకము ప్రకృతి తత్త్వము తెలుపుతున్నది.
ఇదియే అర్థనారీశ్వర తత్త్వము.
·
నుదుటిపై మూడవనేత్రము - జ్ఞానము సూచిస్తుంది
·
కుడికాలు క్రిందకు వంచి, ఎడమకాలిని కుడి తొడపై ఉంచి
కూర్చొనడం – వీరాసనం అంటారు. వీరత్వం, సామర్థ్యత (దక్షత) తెలుపుతున్నది.
·
తనకుడి మోకాలు క్రిందకు వంచి (లంబక పాదమ్) అపస్మారుడు అనే
రాక్షసుణ్ణి తొక్కుతూ ఎడమ మోకాలు కుడి తొడపై ఆనించి (కుంచిత పాదము) కూర్చొని
ఉంటారు – అపస్మారుడు అనగా ఆసురీశక్తులు, అజ్ఞానము సూచిస్తుంది.
·
ఆయన ముందర బ్రహ్మజ్ఞానం తెలుసుకొనుటకై కూర్చొని ఉన్న ఋషులు –
Ø సనక, సనందన, సనాతన,
సనత్కుమారులు
అయితే కొన్ని గ్రంధాలలో ఈ
ఋషులను ఈ క్రింది విధంగా కూడా చెప్తారు.
Ø అగస్త్యుడు,
పులస్త్యుడు,విశ్వామిత్రుడు, అంగీరసుడు
Ø కౌశిక, కశ్యప, భరద్వాజ,
అత్రి
Ø నారద, వశిష్ఠ, జమదగ్ని,
భృగు
దక్షిణామూర్తి
మం(తం)త్రశాస్త్రములో దక్షిణామూర్తి యొక్క 16 స్వరూపాలు చెప్పేరు.
అలాగే వివిధ శాస్త్రాలలో 32 దక్షిణామూర్తి రూపాలు చెప్పేరు.
మైలాపూర్ లో కపాలేశ్వరస్వామి దేవాలయంలో
గోపురంపైన 7 రూపాలలో ఉన్న దక్షిణామూర్తిని చూడవచ్చు.
మనకు వేరు వేరు
ప్రాంతాలలో కనుపించే దక్షిణామూర్తి స్వరూపాలు ఈ విధంగా ఉన్నాయి:
1.
వీణాధార దక్షిణామూర్తి
2.
యోగా దక్షిణామూర్తి
3.
మేధా దక్షిణామూర్తి
4.
వ్యాఖ్యాన దక్షిణామూర్తి
5.
శ్రీవిద్యా దక్షిణామూర్తి
6.
అర్థనారీ దక్షిణామూర్తి
7.
వృషభారూఢ దక్షిణామూర్తి
8.
లకుట దక్షిణామూర్తి
9.
సాంబ దక్షిణామూర్తి
10.
సంహార దక్షిణామూర్తి
11.
లక్ష్మీ దక్షిణామూర్తి
12.
వీర దక్షిణామూర్తి
13.
శక్తి దక్షిణామూర్తి
14.
కాల దక్షిణామూర్తి
15.
అపస్మార నిర్వాటక దక్షిణామూర్తి
16.
మూల దక్షిణామూర్తి
17.
శుద్ధ దక్షిణామూర్తి
18.
వాగీష దక్షిణామూర్తి
19.
హంస దక్షిణామూర్తి
20.
నకులీశ దక్షిణామూర్తి
21.
చిదంబర దక్షిణామూర్తి
22.
వీర విజయ దక్షిణామూర్తి
23.
కీర్తి దక్షిణామూర్తి
24.
బ్రహ్మ దక్షిణామూర్తి
25.
సిద్ద దక్షిణామూర్తి
పైన చెప్పిన
వివిధ స్వరూపాలలో సర్వసాధారణంగా మనకు దేవాలయాల్లో కనిపించే కొన్ని రూపాలయొక్క
వర్ణన, అవి ఉన్న ప్రదేశాలు ఈ క్రింద తెలియజేయడమైనది.
వీణాధార దక్షిణామూర్తి – ఈ మూర్తినే గాన దక్షిణామూర్తిగా వర్ణిస్తారు. ఈ రూపము చోళ, పల్లవ, పాండ్య
రాజుల కాలములో వివిధ భంగిమలలో ఈ మూర్తిని రాతి, లోహ విగ్రహాలలో చెక్కించేరు. ఒకటి కూర్చుని ఉన్న మూర్తి, రెండవది నిలుచుని
ఉన్న మూర్తి.
కూర్చొని ఉన్న
మూర్తిలో క్రింది రెండు హస్తములలో వీణని ధరించి, ఎడమ కాలుని కొంచెము పైకి ఎత్తి
ఆసనముపైన ఉంచిన భంగిమ చూడవచ్చు. ఈ మూర్తిని మద్రాసులో ఉన్న మామళ్ళపురం
(మహాబలిపురం) లో శివాలయంలోను, కాంచీపురములో కైలాసనాథర్ ఆలయములోను, కుంభకోణము వద్ద
ఉన్న తిరువైకవూర్ లో ఉన్న శివాలయములోను చూడవచ్చు.
నిలుచుని ఉన్న మూర్తిలో క్రింద రెండు హస్తములలో
వీణని ధరించి ఉన్నది ఒక భంగిమ అయితే క్రింద రెండు హస్తములలో మృదంగము ధరించి ఉన్నది
మరొక భంగిమలోను ఉన్న మూర్తులను చూడవచ్చు. ఈ మూర్తిని తమిళనాడులో ఉన్న
తిరుప్పురంబియన్ ఆలయములో మరియు కుమారస్వామి ఆలయములలోను చూడవచ్చు.
యోగా దక్షిణామూర్తి
ఈ భంగిమలో దక్షిణామూర్తి తన రెండు మోకాళ్ళను
పైకి మడిచి ఎడమ మోకాలిపై కుడి మోకాలు వేసి పాదముల గుత్తుల వద్ద కలిసినట్టుగా
కూర్చొని ఒక యోగపట్టము రెండుమోకాళ్ళు, నడుము చుట్టూ వచ్చేటట్టుగా ముణుకుల
క్రిందుగా బందించి, క్రింద ఉన్న రెండు చేతులు ముణుకులపైన స్వేచ్చగా వ్రేలాడుతు,
పైన ఉన్న రెండు చేతులలో కుడి చేతిలో అక్షమాలా, ఎడమ చేతిలో కమండలము ధరించి
యోగమూర్తి రూపములో ఉంటారు. తలపైని కేశములన్ని ఒక మండళాకృతిలో జటాబంధనముచేసి ఒక సర్పము వేసి బిగించి ఉంటుంది.
దానిపైన చంద్రవంక కలిగి, నల్లని కంఠముతో ఉంటారు. నాగాభరణములు ధరించి ఉంటారు.
ఈ మూర్తిని
తమిళనాడులో కదంబత్తూర్ వద్ద ఉన్న ఎలిమియన్కొట్టూర్ అనే గ్రామంలో ఉన్న
దక్షిణామూర్తి ఆలయములోను, మైసూరు వద్ద ఉన్న నంజనగూడు అనే గ్రామంలో ఉన్న
శివాలయములోను చూడవచ్చు.
ఈ రూపములోనే కుడికాలు క్రిందకు వ్రేలాడేటట్టు
ఉంచి, ఎడమకాలుని పైకి మడచి యోగపట్టమును ఎడమకాలు ముణుకు క్రిందుగా నడుము చుట్టూ
తిరిగేటట్టుగా కత్తుకొని కూర్చొని ఉన్న భంగిమను కూడా తమిళనాడులో కొన్ని ఆలయాల్లో
చూడవచ్చు. మరికొన్ని చోట్ల క్రింది రెండు చేతులలో కుడిచేయు అభయముద్రతోనూ,
కుడిచేతితో లేడిపిల్లను, అక్షమాలను, కమండలమును ధరించి చూడవచ్చు.
మేధా దక్షిణామూర్తి : ప్రజ్ఞ, మేథస్సుకు ప్రతిరూపమైన ఈ మూర్తి
అర్థనిమీలిన నేత్రములతో ధ్యానముద్రలో తన శిష్యులకు పరావాక్కు ద్వారా విజ్ఞానాన్ని
బోధచేస్తూ ఉన్న భంగిమలో ఉంటారు.మిగిలిన రూపవిశేషాలన్ని మనం నిత్యం చూసే
దక్షిణామూర్తి రూపము వలె ఉంటాయి.వీటిని మొదటగా వర్ణించడమైనది. ఈ మూర్తిని తమిళనాడు
తిరువణ్ణామలైలో ఉన్నఅరుణాచలేశ్వర ఆలయంలోను, అంద్రప్రదేశ్ కాళహస్తిలో ఉన్న
కాళహస్తీశ్వర ఆలయములోను, కర్ణాటక మైసూరు వద్ద నున్న నంజన్ గూడులో ఉన్న
శ్రీకంఠేశ్వర ఆలయములోను చూడవచ్చు.
వ్యాఖ్యాన దక్షిణామూర్తి: ఈ రూపంలో దక్షిణామూర్తి జాగృదావస్థలో ఉండి తన శిష్యులకు వ్యాఖ్యానము
చేస్తూకనిపిస్తారు. మరియు ఈయన పై కుడి చేతిలో అక్షమాల, పై ఎడమ చేతిలో అగ్ని,
క్రింద ఎడమ చేయి వరదముద్ర తోనూ క్రింద కుడి చేయి వ్యాఖ్యాన ముద్రతోను ఉంటాయి.
కుడికాలు క్రింద అపస్మారుడు ఉండడు. మరియు సమీపములో ధర్మాన్ని సూచిస్తూ ఒక వృషభము
కూడా చూడవచ్చును.
శ్రీవిద్యా దక్షిణామూర్తి:ఈ రూపంలో దక్షిణామూర్తి అమ్మవారి సమేతంగా దర్శనమిస్తారు. అమ్మవారు దక్షిణామూర్తిస్వరూపిణి. దక్షిణమూర్తి కాదివిద్యను భోదించే గురువుగా సేవిస్తారు. ఈరూపంలో దక్షిణామూర్తి ఎడమ చెవికి పత్రకుండలము ధరించి కుడి చెవికి ఏ ఆభరణము లేకుండా ఉంటారు. ఆయన జటాజూటములు చెవులమీదుగా భుజములపైకి పరుచుకొని ఉంటాయి. తంత్రవిద్యకు సంభందమైన సర్పములు ఆయన జటాజూటములు, మోకాళ్ళు, డమరుకము చుట్టుకొని ఉండడం చూడవచ్చు.
అర్థనారీ దక్షిణామూర్తి: శివకామేశ్వరుల
సంయమ స్వరూపము. కాది విద్యలో మూల స్వరూపములైన కామేశ్వర-కామేశ్వరి ల స్వరూపము. ఈ
మూర్తిని తంజావూరు తిరుపంతురై గ్రామములో గల శివానందేశ్వరర్ ఆలయములోను, చెన్నై వద్ద
కల తిరుపుళివానమ్ ఆలయములోను దర్శించవచ్చు.
వృషభారూఢ దక్షిణామూర్తి: ఈ రూపంలో
దక్షిణామూర్తి వృషభవాహనుడుగ కూర్చొన్న భంగిమలో గాని. వృషభము యొక్క మెడపై తన
కుడిచేతిని వేసి వృషభమునకు చేరబడి నిలుచొని ఉన్న భంగిమలో గాని దర్శనమిస్తారు. ఈ
రూపంలో పరమశాంతమూర్తిగా కనిపిస్తారు. కేశములన్ని ఒక కిరీటమువలె బంధించబడి
ఉంటాయి. వదనేశ్వర (వల్లార్) ఆలయములో
వృషభముపై కూర్చొని ఉన్న దక్షిణామూర్తి రూపము, తిరునల్లవనూర్ ఆలయములో వృషభమును
ఆనుకొని నిల్చొని ఉన్న దక్షిణామూర్తిని చూడవచ్చు.
లకుట దక్షిణామూర్తి: ఈ రూపంలో దక్షిణామూర్తి
చేతిలో లకుటము( దండము)ను, ఎనిమిది సర్పములు ఆభరణములుగను, పులి చర్మము వస్త్రముగను
ధరించి, న్యగ్రోధ (వట) వృక్షముక్రింద చుట్టూ ఋషులు కూర్చొని ఉన్న భంగిమలో
దర్శనమిస్తారు.
సాంబ దక్షిణామూర్తి: ఇది చాల అరుదైన మూర్తి. ఈ రూపంలో
దక్షిణామూర్తి తన ప్రక్కన నీలోత్పలం (నల్లకలువ) చేత ధరించి శ్యామల(నల్లని)
వర్ణముతో ఉన్న పార్వతీదేవిని క్రింద పుస్తకము ధరించిన ఎడమచేతితో పార్వతీదేవిని
ఆలింగనముచేసుకొంటున్న భంగిమలో దర్శనమిస్తారు. క్రింద ఉన్న కుడి చేతితో జ్ఞానముద్ర,
పైన ఉన్న కుడిచేతిలో అక్షమాల, పైన ఉన్న ఎడమ చేతిలో మధువుతో నిండిన ఘఠము ఉంటాయి.
ఇవి కాక దక్షిణామూర్తిని లింగరూపములోను,
సాలగ్రామరూపములోను, యంత్ర రూపములోను కూడా ఆరాధించేవారు ఉన్నారు.
లింగ రూపములో దక్షిణామూర్తి
దక్షిణముఖంగా ఉన్న లింగాకృతిలో ఉంటారు. ఈ మూర్తులను ఉజ్జయినిలో మహంకాళేశ్వరుని
ఆలయములోను, ఖాట్మండులో పశుపతినాథ అలయములోను, బెంగుళూరులో గవిగంగాధరేశ్వరుని
ఆలయములోను, కేరళలో వైకోం మహాదేవ ఆలయములోను, కుంభకోణములో అలంగుడి (గురు గ్రహం)
ఆలయములోను దర్శించవచ్చు.
సాలగ్రామ రూపములో దక్షిణామూర్తి నల్లని
రంగుతో శంఖాకారంలో ఉంటారు.
యంత్ర రూపములో దక్షిణామూర్తి అష్టదళ
పద్మాకృతిలో ఉండి ఆ దళములు వరుసగా బ్రహ్మ,సరస్వతి, సనక, సనందన, సనత్కుమార, శుక,
వ్యాస, గణపతి దేవతలగా గుర్తిస్తారు. ఈ రూపములో దక్షిణామూర్తి ఉపాసనా రూపములో అనగా
అవ్యక్త స్వరూపములో ఉంటారు.
గమనిక: వివిధ గ్రంధాల,
ప్రవచనముల ఆధారంగా సేకరించిన విషయాలు పైన చెప్పడం జరిగింది. ఎవరైనా విజ్ఞులు
వారికి తెలిసిన కొత్త విషయాలను అందించగలరు. వారికి సదా నేను కృతజ్ఞుణ్ణి.
సర్వం శ్రీ
దక్షిణామూర్తి పాదార్పణమస్తు.
No comments:
Post a Comment