Wednesday, 15 June 2016

IMPORTANCE OF WATER AND VEDIC FACTS


 
 

జలముల యొక్క ప్రాముఖ్యత-వేద ప్రమాణములు

 
 
ఈ సృష్టి ప్రారంబము కాకముందు అంతా జలమయంగా ఉండేది. శ్రీమన్నారాయణుడు మాత్రము ఆ జలములలో వటపత్రశాయిగా ఉండి సృష్టి చేయ సంకల్పించెను. నారములనగా నీరు అని అర్థము. నారములలో ఉండువాడు కాబట్టి విష్ణుమూర్తిని “నారాయణుడు” అని కీర్తిస్తారు.

అలాగే ఈ సృష్టిలో జలములు లేనిదే స్థావర, జంగములైన ఏ జీవికి మనుగడ లేదు.

ఇదే విధంగా సృష్టి లయమయ్యేటప్పుడు కూడా అంతా జలమయం కావడంతో సృష్టి అంతమవుతుంది.

దీని బట్టి మనకు జలములు ఈ సృష్టి, స్థితి, లయ కార్యములందు అంతర్భాగమై ఉందన్న విషయం మనకు భోదపడుతుంది.

ఇదే విషమును వేదశాస్త్రములో ఈ క్రింది మంత్రము ద్వారా తెలియబరచినది.

ఆపోవా ఇదగ్౦ సర్వం, విశ్వాభూతాన్యాపః, ప్రాణావాపః, పశవః ఆపః, అన్నమాపో అమృతమాపో సమ్రాడాపో, విరాడాపో, స్వరాడాపో చంధాగ్౦ష్యాపో, జ్యోతిగ్౦ష్యాపో, యజూగ్ ష్యాపో, సత్యమాపో, సర్వదేవతామాపో,భూర్భువస్సువరాపఓమ్"

ఈ వేదమంత్రము ద్వారా ఈ సర్వ జగత్తు, సకల జీవరాశి, ప్రాణములు, గోవులు మొదలగు పశుజాతి, జీవులకు ఆహారమైన అన్నము, దేవతలకు ఆహారమైన అమృతము, ప్రకాశించుచున్న అదిత్యుడు, విశేషముగా ప్రకాశించు బ్రహ్మాండ దేహుడైన పురుషుడు, గాయత్ర్యాది సప్త ఛందస్సులు, జ్యోతిరూపమైన ఆదిత్యులు, అన్ని మంత్రరూపములు, సత్యము, సర్వదేవతా రూపములు, భూః, భువః, సువః లోకములు అన్నియు జలస్వరూపములే అని తెలియజేస్తున్నది.

 భగవత్గీత లో

............ స్రోతసామస్మి జాహ్నవీ    అని గీతాచార్యులు వచించిరి

గంగానది సాక్షాత్ భవత్స్వరూపమె.

జలములు పరమేశ్వర స్వరూపము. శివునియొక్క అష్టమూర్తులలో ఒకటైన “భవమూర్తి” స్వరూపము . శ్రీ రుద్రంలో

నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ

నమః ఊర్మ్యాయ చావసాన్యాయ చ

నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ

అనే అనువాకములో రుద్రుని

వేగంగా ప్రవహించే జలప్రవాహాలలోను ఎగసిపడే జలప్రవాహాలలోను, పెద్ద పెద్ద అలలతో కూడిన జలములలోను, నిలచి ఉన్న జలములలోను, వరద ప్రవాహాలలోను ప్రవాహల వలన ఏర్పడే ద్వీపాలలో ఉన్న స్వరూపుడుగ నమస్కరిస్తాము. అలాగే

నమః కాట్యాయ చ నీప్యాయ చ

నమః స్సూద్యాయ చ సరస్యాయ చ

నమో నాద్యాయ చ వైశన్తాయ చ
నమః కూప్యాయ  చ అవట్యాయ చ
నమో వర్షాయ చ అవర్ష్యాయ చ
అనే అనువాకములో
సన్నగా ప్రవహించే వాగులలోను పైనుండి పడే జలపాతాలలోను
బురద నేలలోను సరస్సులలోను ఉన్న జలములలోను
నదులలోను చెరువులలోను ఉండే జలములలోను
బావులలోను గుంటల యందుండే జలములలోను 
వర్షములోను, వర్షములేని చోటను ఉండే రుద్రుని నమస్కరిస్తాము
ఈ విధంగా అన్ని జలవ్యవస్థలు పరమేశ్వర స్వరూపాలే అని వేదాలు చెప్తున్నాయి.
మనం పూజలలో పఠించే మంత్రపుష్పము ఈ జలముయొక్క స్వరూపము తెలియజేస్తుంది.
“యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజవాన్ భవతి
.......
.......
యోప్సునావం ప్రతిష్టితాం వేద ప్రత్యేవతిష్టతి”
 ఈ భూబాగం చాలవరకు సముద్రములు, నదులతో జలమయమై ఉన్నది. 70%
భూభాగము నీటితో ఉన్నది.
పంచభూతాత్మకమైన మన ఈ శరీరము కూడా 60% 
నీటితో ఉన్నది. అందుకే మనము అహారములేక పోయినను ఉండగలము కాని నీరు లేకుండా ఒక్క రోజుకూడా ఉండలేము. మన శరీరములో జరిగే అన్ని ప్రక్రియలకు జలములే ఆధారం. అందుకే మన వైద్యులు ఎక్కువ నీటిని తాగమంటూఉంటారు.
 సూర్యుడు ప్రతిరోజు అస్తమించే సమయములో తన శక్తులన్ని జలములలోను, అగ్నిలోను నిక్షిఫ్తము చేసి, మరునాడు సూర్యోదయముతో ఆశక్తులను తిరిగి గ్రహిస్తాడు. అందుకే మన పెద్దలు సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానము చేసినట్లయితే ఆ సౌరశక్తి మనలో ప్రవేశించి తేజోవంతులు, ఆరోగ్యవంతులుగా ఉంటాము అని భోదిస్తారు. ఈ సౌరశక్తి నదులలోను, తటాకములలోను ఎక్కువగా ఉంటుండి. తరువాత బావులలోను ఎక్కువగానే ఉంటుంది. కాని ప్రస్తుత జీవన విధానంలో నదులలోను, చెరువులలోను, బావులలోను స్నానం చెయ్యడం అరుదుకాబట్టి ఇంట్లో కుళాయి నీటితో గాని, నిలువచేసి పెట్టుకున్న నీటితో గాని స్నానం చేస్తుంటాము. అయితే ఆపుణ్య నదులని మనస్సులో ప్రార్థించి స్నానం చేసినట్లయితే, ఆనదులలో ఉండే సౌరశక్తి మనం ఉపయోగించే జలములలోకి ప్రవేశించి ఆఫలితం మనం పొందగలము. ( యద్భావం తద్భవతి )
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
గంగా గంగేతి యో భ్రూయాత్ యోజనానాం శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గఛ్ఛతి”
స్నానానంతరం మనలను అనుగ్రహించిన ఆ పుణ్యనదులకు కృతజ్ఞతో అర్ఘ్యం అర్పించవలెను.
“బ్రహ్మ కమండల సంభూతే పూర్ణ చంద్ర నివాసినే
త్రైలోక్య పాననే గంగా గృహాణర్ఘ్యం నమోస్తుతే
గంగా భాగీరథీ, యమున సరస్వతీ, నర్మదే శారదే, తుంగభద్రా, కృష్ణా కావేరీ మణి కర్ణికా గోదావరి యమునాయై నమః
ఇదమర్ఘ్యం సమర్పయామి ( 3 సార్లు)”
 మనము చేసే అన్ని దైవకార్యములలో మొట్టమొదట ఆచరించే పవిత్రీకరణ క్రియ
ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా
యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః
మొదలుకొని నుండి చివరిలో “సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు” అన్న వరకు అన్ని మంత్రములు, క్రియలు జలము ద్వారా ఆచరిస్తాము.
 
మనం నిత్యం ఆచరించే సంధ్యావందన అనుష్టానములో బహిః శుద్దికి
“ఓం ఆపో హిష్ఠా యోభువః’ | తా ఊర్జే ధాతన | మహేరణా చక్షసే | యో వఃశివతమో రసః’ | తస్యభాజయతే నః | ఉషతీరి మాతరః’ | తస్మా అరంగ మామ వః | యస్య క్షయా జిన్వథ | ఆపోజనయథా నః |
అనే మంత్రంతోను, అంతః శుద్దికి
 ఆపఃపునంతు పృథివీం పృథివీ పూతా పునాతు మామ్ | పునంతు బ్రహ్మణస్పతి ర్బ్రహ్మాపూతా పునాతు మామ్ | యదుచ్ఛిష్ట మభోజ్యం యద్వాదుశ్చరితం మమ’ | సర్వంపునంతు మా మాపోసతాం ప్రతిగ్రహగ్గ్ స్వాహా
అనే మంత్రంతోను జలముతో శుద్ధిపరుచుకొని మిగిలిన అనుష్టానం పూర్తి చేస్తాము.
 
మనం నిత్యం చేసే సంధ్యావందన అనుష్టానములో జలదేవతలను ప్రార్థిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్తాము.
హిరణ్యవర్ణా శ్శుచయః పావకాః యా సుజాతః కశ్యపో యా స్వింద్రః’ | అగ్నిం యా గర్భన్-దధిరే విరూపా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా వంతు |
యా సాగ్ం రాజా వరుణో యాతి మధ్యేసత్యానృతే వపశ్యం జనానామ్ | మధుశ్చుత శ్శుచయో యాః పావకా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా వంతు |
యాసాందేవా దివి కృణ్వంతిభక్షం యా అంతరిక్షే బహుథా భవంతి | యాః పృథివీం పయసోందంతిశ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా వంతు |
యాః శివేనమా చక్షుషా పశ్యతాపశ్శివయాతను వోపస్పృశత త్వచమ్మే | సర్వాగ్మ్ అగ్నీగ్మ్ ప్సుషదోహువే వో మయి వర్చో బల మోజో నిధత్త ||
 ఇవే కాక ఈ సంధ్యావందన ప్రక్రియలో అనేక మంత్రాలు జలముల తో ఆచరించవలసినవి. ఆచమనం, మార్జనం, మంత్రజల సేవన, పాప పురుష విమోచన, అర్ఘ్యం, సజల ప్రదక్షణ, తర్పణం, గాయత్రీ మంత్ర జపము సూర్యోపస్థానం మున్నగు ప్రక్రియలు జలముతోనే ఆచరిస్తాము.
మనం చేసే నిత్యకర్మానుష్టానములో ప్రాణాయామం చేయునపుడు “ఓం భూః భువః సువః అనే వ్యాహృతులతో గాలిని లోపలికి పీల్చి(పూరకం), గాయత్రి మంత్రంతో గాలిని లోపల బంధించి (కుంభకం), మరల శిరోమంత్రంతో గాలిని బయటకు విడిచి పెడ్తాము(రేచకం). ఈ ప్రక్రియ చేసేముందు ముమ్మారు ఆచమనం చేయడం ఒక విధిగా ఉంది. ఈ విధికి అంతరార్థం ఒకటి, మనం నోటి ద్వారా ఉచ్చరించే పవిత్రమైన వేదమంత్రాల పవిత్రతను కాపాడడానికి జలముతో నోటిని శుభ్రపర్చడం, రెండవది మనం ప్రాణాయామ ప్రక్రియలో గాలిని లోపల బంధించినపుడు అది అన్ని ప్రేగులలోకి ప్రవేశిస్తుంది. ఈవిధింగా ప్రవేశ్ంచిన గాలి ప్రేగులలో స్వేచ్చగా సంచరించడానికి అనువుగా జలముతో మార్గము సుగమము అవుతుంది (lubricate).
ఇదే విధంగా మనం భోజనం చేసేముందు పరిషేచన క్రియలో భాగంగా జలము లోపలికి పుచ్చుకొంటాము. దీని ఉద్దేశ్యము కూడ ఒకటి మనలో ఉన్న వైశ్వానరాగ్నికి వ్యాహృతులు సమర్పించే ముందు అవి అన్నవాహిక ద్వారా పవిత్రంగా చేరుటకు, రెండవది అన్నవాహిక మార్గాన్ని సుగమము అగుటకు (lubricate).
సౌర మంత్రాలలో చాలా మంత్రములలో జలముయొక్క పవిత్రత, విశిష్టత యజ్ఞప్రక్రియలు చెప్పడమైనది.
ఇన్ని పవిత్రమైన గుణములున్న జలములను మనము అపవిత్రము చేయరాదు. వేదములో ఈ విషయమై ఈ క్రింది సౌర మంత్రము ద్వారా మనకు హెచ్చరిక ఇవ్వడం జరిగినది.
“అమృతం వా ఆపః, అమృతస్య అనన్తరిత్యై, న అప్సు మూత్రపురీషం కుర్యాత్, న నిష్టీవేత్, న వివసనః స్నాయాత్”
జలములు పవిత్రమైనవి. వాటిలో మలమూత్రాదులు చేయడంగాని, ఉమ్మడంగాని, నగ్నంగా స్నానమాచరించడం గాని ( నగ్నంగా స్నానమాచరిస్తే వీర్యసంభందమైన ద్రవములు జలములలో కలిసే ప్రమాదము ఉన్నది) చేయరాదు.
అలాగే ఎండ, వాన ఇవి దేవతా స్వరూపాలు. వాటిని నిందించరాదు అని వేద సూక్తులు చెప్తాయి
“ఆతపన్ నింధ్యాత్, వర్షం న నింధ్యాత్”
 
పైన చెప్పినవి కొన్ని మంత్ర విషయాలు మాత్రమే. వేదాలలో అనేక మంత్రాలు జల సంభందమైనవి.
ఈ విధంగా జలములు మన వైదిక కార్యములన్నింటిలోను ప్రాముఖ్యత సంతరించుకొన్నది.
చెరువులు, బావులు త్రవ్వించి జలావాసాలు కల్పించడం, వేసవిలో చలివేంద్రములు మున్నగునవి ఏర్పాటుచేసి జనులకు నీటి వ్యవస్థ కల్పించడం, పక్షులకు, జంతువులకు ఇంటి ముంగిట్లో గాని, తోటలోగాని నీటి వ్యవస్థ కల్పించడం, ఒక పాత్రలో జలమును సద్భ్రాహ్మణునికి దానమివ్వడం, వంటి పుణ్యకార్యముల వలన జీవుడు సద్గతులు పొందుతారని పురాణాలు వచిస్తాయి. 
 
                     సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు







No comments:

Post a Comment