Friday, 1 July 2016

ADITYA HRUDAYAM - ANTARARTHAM




ఆదిత్య హృదయము- అంతరార్థము

ఈ సృష్టిలో రాత్రి సమయమున సుషుప్త (నిద్ర) స్థితిలో జడముగా పడియున్న సమస్త జీవరాశికి చైతన్యము కల్పించుటకై అనునిత్యము ఆకాశములో ఉదయించే ఆ సూర్య భగవానుడు సమస్త జీవరాశి యొక్క సృష్టి, స్థితి, లయలను నిర్వహించే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు.  సూర్యోదయముతో పాటు అనేక జీవరాశులు ఉత్పన్నమవుతాయి. ఈ విధంగా ఆదిత్యుడు సృష్టికార్యము నిర్వహిస్తుంటాడు.. మరియు ఉత్పన్నమయిన ఈ జీవరాశులను మరియు ఇంతకుముందే సృష్టిలో ఉన్న జీవరాశుల జీవనానికి కావలసిన గాలి, నీరు, ఆహార ధాన్యములు, ఓషదులు మరియు తైలము, విద్యుత్తు మొదలైన ఇతర జీవనావసరాలను కల్పించి పోషిస్తున్నాడు. అదే విధంగా కర్మ ఫల ప్రదాతగా కొన్ని జీవుల జీవాన్ని కూడా హరించివేస్తుంటాడు. ఈ విధంగా ఈయన సృష్టి, స్థితి, లయ కార్యములు నిర్వహిస్తూ ప్రత్యక్ష పరమేశ్వరుడుగా దర్శనమిస్తూ ఉంటారు.
ఈ ప్రక్రియను వేదపరిభాషలో యజ్ఞముగా వ్యవహరిస్తారు. ఈశ్వరుడు జరిపే ఈ యజ్ఞప్రక్రియ నిత్యము ఎటువంటి విఘాతం లేకుండా సాగవలెను. ఈ యజ్ఞము ఆగిపోయిననాడు, ఈ సృష్టి అంతరించుకుని పోతుంది.
ఇదే విషయం మనుస్మృతిలో ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది
“ అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్య గాదిత్య ముపతిష్టతే
  ఆదిత్యా జ్ఞాయతే వృష్టి, ర్వృష్టే రన్నం, తతః ప్రజాః”

ప్రకృతిలో జరిగే ఈ యజ్ఞ ప్రక్రియలాగే “తత్ సృష్ఠ్వా తదేవ అనుప్రావిశత్” అను వేదసూక్తి చెప్పినట్లు  ఆ పరబ్రహ్మ మన హృదయంలో కూడా చైతన్య స్వరూపుడైన ఆత్మగా ఉండి మన ఇంద్రియాలకు చైతన్యాన్ని కలిగించి తద్వారా ఈ శరీరమును ఈ సృష్టి యజ్ఞములో భాగస్వామిగా ఉండుటకై తయారుచేస్తున్నాడు.  కాని మానవుడు ఈ విషయాన్ని విస్మరించి ఈ శరీరాన్ని భోగములు అనుభవించుటకై వినియోగిస్తూ నిత్యమూ విషయ వాంఛలపై మక్కువ పెంచుకుంటూ, అజ్ఞానములో పడి ఆ పరమాత్మ పట్ల కృతఘ్నుడై వ్యవహరిస్తున్నాడు. అజ్ఞానములో ఉన్న ఈ మానవుడు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించు కొనుటకు నిత్యమూ బాహ్య ఆకాశములో దర్శనమిచ్చే ఆ సూర్యభవానుని ఉపాసించడం ద్వారా ఆ సూర్యభగవానునిలో ఉన్న ఈశ్వరచైతన్యాన్ని గ్రహించి తద్వారా హృదయాకాశములో  ఉన్న ఈశ్వర చైతన్యమును గుర్తించవలెను. ఇందుకై ఋషులు మనకు “సంధ్యోపాసన” “ఆదిత్య ఉపాసన” మొదలగు ఉపాసనా మార్గములు అందించేరు.
ఆదిత్య ఉపాసనలో భాగంగా అగస్త్య మహర్షి రామరావణ యుద్ధంలో రామునికి చేసిన ఉపదేశమును వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యముద్వారా మనకు అందించిన సులభమైన సాధన “ఆదిత్యహృదయము”. ఆదిత్యహృదయము అనగానే హృదయములో ఆదిత్యుని (ఈశ్వర చైతన్య స్వరూపాన్ని) ఉపాసించడమని మనకు స్ఫురించాలి.

ఈ ఆదిత్య హృదయం పఠిస్తున్నప్పుడు మనకు ఈ భావము కలుగుటకు, ఇందులో ఉన్న శ్లోకముల యొక్క అంతరార్థము తెలుసుకొని, రాముడు, రావణుడు, రామరావణ యుద్ధము ప్రస్తావించడం ద్వారా ఋషులు మన సమస్త మానవజాతికి అందించాలని ప్రయత్నం చేసే సూక్ష్మ విషయాన్ని గ్రహించాలి. ఈ ఆదిత్యహృదయము ఆదిత్యుని ఉపాసించే మార్గంలో ఆయన్ని స్తుతించే 126 దివ్యనామాల సంపుటి.

ఉపోధ్ఘాతము:
తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం ౧
 
బాహ్యార్థం - రాముని చేతులో ఘోరముగా గాయపడిన రావణుని, అతని రథసారథి రథమును యుద్ధభూమికి దూరంగా తీసుకొనిపోయి నిలిపెను. కొంతసేపటికి రావణునికి తెలివివచ్చి అచ్చటికి తీసుకొని రాబడ్డ కారణము, పరిస్థితిని సారథి ద్వారా తెలుసుకొని కోపముతో తిరిగి రామునిపై యుద్ధముచేయుటకై రథముని తిరిగి యుద్ధభూమికి తీసుకొనివెళ్ళమని రథసారథిని ఆజ్ఞాపించెను. అట్లు తిరిగి యుద్ధసన్నద్ధుడై వస్తున్న రావణుని చూసి, అతనిపై జాలితో యుద్ధముచేయుటకు ఆలోచిస్తూ అలసిన ముఖముతో రామచంద్రమూర్తి ఉన్నారు.
అంతరార్థం
ఇక్కడ రామచంద్రమూర్తి అనగా ఈ జీవుని యొక్క మనస్సు. రావణుడు అనగా పదితలలతో ఉన్న ఒక రాక్షసుని ప్రాతిపదికగా, దశేంద్రియములతో సదా విషయ వాంఛలపై ఆకర్షింపబడుతూ యజ్ఞప్రక్రియయందు పాల్గొనక , మనసు వశం కాకుండా ఈ జీవుని పతనం కావిస్తున్న మనలో ఉన్న ఆసురీశక్తిని గురించి చెప్పడం. ఈ ఆసురీ శక్తిని నిర్మూలించి, దశేంద్రియములను వశపర్చుకోవడం కోసం ప్రయత్నిస్తూ అలసి ఉన్న మనస్సు యొక్క పరిస్థిని ఈ శ్లోకం చెప్తున్నది.
 
 దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః ౨
 
బాహ్యార్థం - యుద్ధమును తిలకించుటకై అక్కడకు దేవతలతో కూడా వచ్చిన అగస్త్య మహర్షి రాముని దగ్గరగా నడచివచ్చెను.
 
అంతరార్థం - ఇటువంటి పరిస్థుతులలో మనస్సును సమాధానపరచి దశేంద్రియములను వశపర్చుకొనే తారకమంత్రమును ఉపదేశించుటకై “బుద్ధి” ప్రచోదయం కలగాలి. అందుకే మనం నిత్యం ఆదిత్యుని “ధియో యోనః ప్రచోదయాత్” “బుద్ధిం యాన ప్రచోదయాత్” అని ప్రార్థించుకొంటూఉంటాము.
అటువంటి ఈ బుద్ధి ప్రచోదనం జరిగి మనస్సుని సంభోదిస్తూ
 
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి ౩
 
బాహ్యార్థం - ఓ దశరథ కుమారా! గొప్ప బాహువుల కల రామా! సనాతనమైన ఈ రహస్యమును వినుము. దీని వలన నీవు నీ సర్వ శత్రువులను జయించి యుద్ధములో విజయము సాధించగలవు.
 
అంతరార్థం - అత్యంత శక్తిగల ఓ మనసా! పరబ్రహ్మ జ్ఞానము తెలుసుకొనుట సనాతనమైన మార్గము. దీనివలన సర్వేంద్రియములను వశపర్చుకొనగలవు.
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివం ౪
 
బాహ్యార్థం - ఆదిత్యుని హృదయమునందు ధ్యానిస్తూ ఉపాసించుట వలన నీవు పవితృడవు అగుదువు. శత్రువులనందరిని జయించి ఎల్లప్పుడూ యుద్ధమునందు  విజయము సమకూరును, మరియు ఈవిధముగా ఎల్లప్పుడూ  ఉపాసన చేయుట వలన అంతులేని మోక్ష సుఖము కలుగును.
అంతరార్థం – అభ్యాసపూర్వకంగా నిరంతరం ఆదిత్యుని ఉపాసించడం ద్వారా పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడం వలన నీకు ఆత్మస్వరూపము తెలియవచ్చి తద్వారా సర్వేంద్రయములను వశపర్చుకొని చివరకు అతీంద్రుడవై ఆత్మస్థితికి చేరగలవు.
 
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం ౫
బాహ్యార్థం - ఈ ఆదిత్య హృదయ ఉపాసన అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది. సమస్త పాపములను నాశనము చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది.
 
అంతరార్థం – పరబ్రహ్మ తత్వం తెలుసుకొని, దమము, శమము ( ఇంద్రియనిగ్రహము) అలవర్చుకొనడం ద్వారా సకల చింత, శోకము, పాపములకు నెలవైన ఈ అజ్ఞానమయమైన  మానవ జీవితము నుండి ముక్తి పొంది శాశ్వతమైన మోక్షపదము పొందగలవు. ఈ సాధనకై వలసిన శారీరక, మానసిక శక్తిని ప్రసాదించునదే ఆదిత్య ఉపాసన.

పైన ఉన్న మూడు శ్లోకములు ఆదిత్యహృదయము యొక్క గుణవిశేషాలు తెలియజేస్తాయి. ఇవి పదహారు అంటే షోడశ కళలతో కూడిన పరిపూర్ణ జ్ఞాన చంద్రోదయము అవుతుంది. అవి ఏవంటే

1.    గుహ్యమ్

2.   సనాతనమ్

3.   పుణ్యమ్

4.   సర్వశత్రు వినాశనమ్

5.   జయావహమ్

6.   జపమ్

7.   నిత్యం

8.   అక్షయమ్

9.   పరమ

10.శివమ్ (శుభమ్)

    11.సర్వమంగళ మాంగల్యం

    12.సర్వపాప ప్రణాశనమ్

    13.చింతా శోక ప్రశమనమ్

    14.ఆయుర్వర్ధన

    15.ఉత్తమమ్

ఈ పదిహేను 15 చంద్రకళలు అయితే నాల్గవ శ్లోకములో ఉన్న ఆదిత్యహృదయమ్ పదహారవ కళ. మొత్తం 16 అంటే షోడశ కళలతో కూడిన పరిపూర్ణ జ్ఞాన చంద్రోదయము
 
తరువాత వచ్చే శ్లోకములు సూర్యుని స్తుతిస్తూ కూర్చినవి. ఈ శ్లోకాలలో నిక్షిప్తమైన 126 ఆదిత్యుని దివ్యనామాలు:
 
సూర్యస్తుతి:
1.    రశ్మిమంతం – (రశ్ములు) కిరణములు కలవాడు, ప్రాణశక్తి స్వరూపుడు
2.   సముద్యంతంసంపూర్ణముగా ఉదయించువాడు, అవ్యక్తమైన పరమాత్మ కిరణముల ద్వారా వ్యక్తమై సూర్యునిగా ఆవిర్భవించడం
3.   దేవాసుర నమస్కృతం దేవతలు మరియు అసుర గణములచే నమస్కరించబడువాడు
4.   పూజయస్వ - పూజింపబడువాడు
5.   వివస్వంతం  - తన కిరణములతో జగత్తునంతా ఆవరించువాడు 
6.   భాస్కరం  - చైతన్యము/కాంతిని కలిగించువాడు
7.   భువనేశ్వరం సమస్త భువనములను పాలించువాడు.
8.   సర్వదేవాత్మకః – సర్వదేవ స్వరూపుడు
9.   తేజస్వీమంచి వెలుగులు కలవాడు/ కిరణములద్వారా బీజ శక్తిని ప్రసరించువాడు
10.రశ్మిభావనఃరశ్ముల(కిరణముల) ద్వారా ప్రాణ శక్తులను ప్రసరించు వాడు
11.         దేవాసురగణాన్ లోకాన్ పాతి - దేవ, అసుర గణములను, లోకములను పాలిస్తున్నవాడుసంరక్షిస్తున్నవాడు. (దేవాసురగణములు చివరలో వివరించడం జరిగింది)
12.        గభస్తిభిఃప్రకాశించే/ప్రసరించే కిరణములు కలవాడు
దేవతలు
13.        బ్రహ్మాసృష్టి కర్త, అందరికంటె పెద్ద/గొప్ప వాడు
14.        విష్ణుః  - స్థితి కర్త, సర్వ వ్యాపకుడు
15.        శివః  - లయ కర్త, మంగళ స్వరూపుడు
16.        స్కందః  -  దేవ సేనాని, గమనం చేయు/చేయించే వాడు
17.        ప్రజాపతిఃసృష్టిని పాలిస్తున్నవాడు, ఒక దేవతా వ్యవస్థ
18.        మహేంద్రఃదేవతలకు అధిపతి- తూర్పు దిక్కుకి అధిపతి
19.        ధనదః  - ధనములను ఇచ్చువాడు, కుబేరుడు, ఉత్తర దిక్కుకి అథిపతి
20.       కాలః  - కాల స్వరూపుడు, ఏది ఎక్కడ ఉండాలో నియంత్రించేవాడు
21.        యమః యముడు, నియంత్రిచేవాడుదక్షిణ దిక్కుకి అధిపతి
22.       సోమఃఆర్ద్రత కలిగించువాడు,  రసాధిపతి, చంద్రుడు
23.       అపాం పతిఃవరుణుడు జలాధిపతి- పశ్చిమదిక్కుకి అధిపతి
24.       పితరఃపితృదేవతా రూపుడు , పితృ గణములు 31  (క్రింద వివరించడమైనది)
25.       వసవః సంపదలను తయారుచేసే వ్యవస్థ 8 వసువులు (క్రింద వివరించడమైనది)
26.       సాధ్యాఃజీవులు చేసే సాధనలు గమనించి ఫలితాలనెచ్చేవారు 12 సాధ్యులు (క్రింద వివరించడమైనది)
27.       అశ్వినౌ వైద్య సరూపుడు, నాసత్యుడు, దశ్రుడు అనబడే దేవ వైద్యులు
28.       మరుతఃవాయుమండలములో నున్న ప్రాణశక్తులు, 7x7 – 49 మరుత్తులు
29.       మనుః జ్ఞాన/మనో శక్తి, విశ్వనిర్వహణలో పాల్గొనే ఒక దేవతా వ్యవస్థా శక్తులు. మన్వంతరం అనే కాలపరిధికి అధిపతి అయిన దేవతా వ్యవస్థ
30.       వాయుః సర్వ వాయు స్వరూపుడు, మన దేహంలో ఉన్న ప్రధాన దశవాయువులు.
31.        వహ్నిః అగ్ని స్వరూపుడు
32.       ప్రజా 84 లక్షల జీవకోటి, వాటిలో ఉన్న జీవరూప చైతన్యము
33.       ప్రాణ ప్రాణశక్తి రూపుడు
34.       ఋతుకర్తా ఋతువులను ఏర్పరిచిన వాడు.
35.       ప్రభాకరః గొప్ప కాంతి/వర్చస్సు కలిగించువాడు
( ఏష బ్రహ్మాచ మొదలుకొని ఋతుకర్తాప్రభాకరః అను నామములు భగవద్గీతలో దశమాధ్యాయములో ఉన్న 42 శ్లోకాలలో మనకి కనబడతాయి. అందుకే రామాయణంలో ఆదిత్యహృదయము మహాభారతములో భగవద్గీతకి బీజము అని చెప్పుకోవచ్చు. ఇదే విషయముయొక్క సారాంశరూపమే మనకు పురుషసూక్తములో “ పాదో2స్య విశ్వా భూతాని తిపాదస్యామృతం దివి” అనే ఒక్క పాదములో చెప్పడం మనం గమనించవచ్చు) 
పగటి సూర్యుడు
36.       ఆదిత్యః – అన్నము నిచ్చువాడు, అదితి అయిన ఆకాశము నుండి ఉద్భవించిన వాడు, అఖండమైన తేజస్సు కలవాడు, ఆత్మస్వరూపుడు,సృష్టికి ఆదియందున్నవాడు
37.       సవితా సృష్టిని చేయువాడు, ప్రేరేపించువాడు.
38.       సూర్యః గమనము చేయువాడు, ప్రేరణ కలిగించువాడు, అరోగ స్వరూపుడైన మనకు కనిపించే సూర్యుడు
39.       ఖగః , గః అంటే ఆకాశములో గమనము చేయువాడు.
మధ్యాహ్నసూర్యుడు
40.       పూషా పోషించువాడు
సాయంకాల సూర్యుడు
41.        గభస్తిమాన్ – కిరణములు గలవాడు
42.       సువర్ణ సదృశః మంచి వర్ణము కలవాడు. సమస్త వర్ణములు కలుగజేయువాడు
43.       భానుః – ప్రకాశమును అందించువాడు
44.       హిరణ్యరేతా – సృష్టిని చేయుటకు ఉపయోగించే తేజోమయ బీజములను నిక్షిప్తం చేసుకొన్నవాడు.
45.       దివాకరః పగటిని కలిగించువాడు
కిరణములు:
46.       హరిదశ్వః హరిత వర్ణ గుర్రములు కలవాడు, ప్రాణశక్తిని వ్యాపించు కిరణములు కలవాడు, అన్ని దిక్కులలో  వ్యాపించు కిరణములు కలవాడు. హరించే లక్షణమున్న కిరణములు కలవాడు
47.       సహస్రార్చిః వేల కిరణములు (కాంతులు) కలవాడు (400  వృష్టి సజ్జన కిరణములు, 300        ఖర్మ సజ్జన కిరణములు, 300  హిమ సజ్జన కిరణములు)
48.       సప్తసప్తిః ఏడు గుర్రములు కలవాడు, ఏడు రంగులు కలవాడు ఏడు చందస్సుల స్వరూపుడు, సప్త గ్రహముల స్వరూపుడు, సప్తేంద్రియాల స్వరూపుడు, సప్త ధాతువుల స్వరూపుడు(వివరములు క్రింద ఇవ్వడమైనది), సప్త జ్వాలలు గల అగ్ని స్వరూపుడు.
49.       మరీచిమాన్నశింపజేసే లక్షణములున్న కిరణములు కలవాడు,
50.       తిమిరోన్మథనః చీకటిని/అజ్ఞానతిమిరాన్ని తొలగించేవాడు
51.        శంభుః శివ స్వరూపుడు, సుఖము, శుభము, శాంతికి అధారమైన కిరణాలు కలవాడు
52.       త్వష్టా సృష్టిలో ప్రతి వస్తువునకు ఒక నిర్ధిష్టమైన రూపములు కల్పించువాడు
53.       మార్తాండ మృతమైన అండమునుండి వచ్చినవాడు, చైతన్యములేని వాటికి చైతన్యము కలిగించువాడు
54.       అంశుమాన్ అనేక కిరణములు కలవాడు
55.       హిరణ్యగర్భః తనలోపల తేజస్సు కలవాడు, హితము,రమ్యము అయినది ఇచ్చువాడు.
56.       శిశిరః చల్లదనము కలిగించువాడు
57.       తపనః వేడిమి కలిగించువాడు, జ్ఞానం/తపస్సు ఇచ్చేవాడు, శాంతికి అవసరమైన తాపత్రయము పోగొట్టి మోక్షాన్ని కలిగించువాడు.
58.       భా(అహః)స్కరః     పగటిని కలిగించువాడు, జ్ఞానాన్ని కలిగించువాడు, మాతృకా వర్ణ రూపుడు, అక్షర విద్యా స్వరూపుడు
59.       రవిఃఅందరి పొగడ్తలు పొందగలిగే గుణాలు కలిగియున్నవాడు, మంత్రాలకు మూలమైన శబ్ద,శక్తి స్వరూపుడు ( , , అగ్ని,అమృతం,శక్తి)
60.       అగ్నిగర్భః తేజస్సును తనలో నింపుకొన్నవాడు.
61.        అదితేః పుత్రః అదితి పుత్రుడు
62.       శంఖః మంగళకరమైన ఆకాశము కలవాడు
63.       శిశిరనాశనః జడత్వం పోగొట్టేవాడు
64.       వ్యోమనాథ చిదాకాశానికి నాథుడు
65.       తమోభేదీ తమస్సును పోగొట్టేవాడు
66.       ఋగ్ యజుః సామః పారగః వేద స్వరూపుడు
67.       ఘనవృష్టిః గొప్ప మేఘముల ద్వారా వర్షమును కలిగించువాడు
68.       అపాం మిత్రో జలము రావడానికి అవకాశమిచ్చువాడు, మిత్రుడు
69.       వింధ్యవీథీ ప్లవంగమఃఆకాశములోఎగిరి( శీఘ్రముగా)వెళ్ళువాడు
70.       ఆతపీ పూర్ణమైన ఎండరూపంలో ఉన్నవాడు, పూర్ణజ్ఞానమయుడు
71.        మండలీ మండలాకృతిలో (సమూహము) ఉన్నవాడు
72.       మృత్యుః మృత్యు స్వరూపుడు, నశింప/లయము చేయువాడు
73.       పింగళః పింగళ నాడి రూపంలో ఉన్నవాడు, పింగళ వర్ణముతో ఉండువాడు.
74.       సర్వతాపనః అంతటా వేడిమి కల్పించువాడు. అందరికీ జ్ఞానము ప్రసాదించువాడు.
75.       కవిః మేథావి, అతీంద్రియజ్ఞానము కలవాడు
76.       విశ్వః సమస్త విశ్వంలో/మెలకువలో ఉన్నవాడు, సర్వసృష్టి లో అంతత్యామిగా ఉన్నవాడు.
77.       మహాతేజాః గొప్పతేజస్సు(సమర్థం)కలవాడు
78.       రక్తః ఎరుపు రంగు, ప్రేమానురాగాలు కలవాడు
79.       సర్వభవోధ్భవః సర్వమునకు పుట్టుకకి, పెరుగుదలకి కారణమైనవాడు.  
80.       నక్షత్రగ్రహతారాణామధిపః కనిపించే నక్షత్రములు, గ్రహముల కంటే పైన ఉన్నవాడు, వాటిలో భాసించే తేజస్సు అయినవాడు.
81.        విశ్వభావనః సమస్తం కలిగించువాడు
నమకం ( 19  శ్లోకములు)
82.       తేజసామపి తేజస్వీ సర్వ తేజస్సులకూ తేజస్సు అయినవాడు.
83.       ద్వాదశాత్మ నమోస్తుతే ద్వాదశాదిత్య రూపాలలో ఉన్నవాడు, మనలో ఉన్న దశేంద్రియలు, మనస్సు, జీవుడు లో ఉన్న చైతన్య స్వరూపుడుగా ఉన్నవాడు. సంవత్సర స్వరూపుడైన ఆదిత్యుడు.
84.       పూర్వాయ గిరయే  - పూర్వ (తూర్పు దిక్కున ఉదయించువాడు), పూర్వదిక్కుకి అధిపతి,
85.       పశ్చిమ గిరయే/పశ్చిమాద్రయే పశ్చిమ దిక్కు అస్తమించువాడు, పశ్చిమ దిక్కుకి అధిపతి.
86.       జ్యోతిర్గణానాం పతయే యజ్ఞరూప/జ్ఞానరూపము కలవాడు, జ్ఞానమునకే వెలుగునిచ్చువాడు, సర్వ శాస్త్రములకు ప్రభువు
87.       దినాధిపతయే జ్ఞానానికి ప్రభువు, దినమునకు అధిపతి
88.       జయాయ జయము స్వరూపుడు
89.       జయభద్రాయ మంగళ స్వరూపుడు
90.       హర్యశ్వాయ హరిత వర్ణ అశ్వములు గలవాడు
91.        సహస్రాంశో వేల కిరణములు కలవాడు
92.       ఆదిత్యాయ అదితి పుత్రుడు
93.       ఉగ్రాయ రుద్రస్వరూపుడు, అందరికన్న అతీతుడు, ఉద్దరించువాడు
94.       వీరాయ మహావీరుడు, అందరినీ నియంత్రించువాడు
95.       సారంగాయ వేగ గమనము కలవాడు, సారము పొందు/పొందించు వాడు, భావగ్రాహి
96.       పద్మప్రబోధాయ పద్మములను వికసింపజేయువాడు, వికసన శక్తిని కలిగించువాడు. అంతరంగంలో మనలో ఉన్న షట్ చక్రములలో ఉన్న పద్మములను యోగసిద్ధి ద్వారా ప్రభోధించువాడు.
97.       మార్తాం(ప్రచం)డాయ అమితమైన తేజోవంతమైన కిరణములతో వెలుగువాడు
98.       బ్రహ్మేశానాచ్యుతేశాయ - సృష్టికర్త, స్థితికర్త, లయకర్త ముగ్గురికీ ఈశ్వరుడైనటువంటివాడు. ముగ్గురి రూపములలో ఉన్నవాడు.
99.       సూర్యాయ – ప్రేరకుడు, గమనము చేయువాడు.
100.     ఆదిత్యాయ వర్చసే – అభేద్యమైన వర్చస్సు కలవాడు  
101.      భాస్వతే ప్రకాశించువాడు, ప్రకాశింపజేయువాడు
102.     సర్వభక్షా - సర్వము/సర్వ అజ్ఞానమును హరించకలిగే శక్తి కలవాడు. లయకారకుడు.
103.     రౌద్రాయ వపుషే – రుద్ర స్వరూపుడు  దుఃఖ నాసకుడు
104.     తమోఘ్నాయ అజ్ఞానాన్ని పోగొట్టువాడు
105.     హిమఘ్నాయ జడత్వాన్ని పోగొట్టువాడు
106.     శత్రుఘ్నాయ శత్రువులను (జ్ఞానోపార్జనికి బయట/లోపల ఉన్న ప్రతికూలమైన శక్తులు) నాశనము చేయువాడు
107.     అమితాత్మనే మితిలేని స్వరూపముకలవాడు.
108.     కృతఘ్నఘ్నాయ కృతఘ్నులను , యజ్ఞములకు అవరోధములు కల్పించువారిని నిరోధించువాడు.
109.     దేవాయ – స్వయం ప్రకాశకుడు
110.      జ్యోతిషాం పతయే – జ్యోతులన్నిటికీ జ్యోతిస్వరూపుడు
111.       తప్తచామీకరాభాయ – కరిగిస్తున్న బంగారపు రంగు కలవాడు.
112.      వహ్నయే - అగ్నిస్వరూపుడు
113.      విశ్వకర్మణే – విశ్వకర్మ స్వరూపుడు
114.      తమోఽభినిఘ్నాయ – చీకటి (అజ్ఞానాన్ని) పోగొట్టువాడు
115.      రుచయే కాంతి స్వరూపుడు
116.      లోకసాక్షిణే సాక్షి స్వరూపుడు
117.      నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః – లయంచేసిన సృష్టిని తిరిగి సృష్టించువాడు
118.      పాయత్యేష - రక్షించువాడు
119.      తపత్యేష తపింపజేయువాడు, జ్ఞానాన్ని కలిగించువాడు
120.     వర్షత్యేషవర్షాన్ని కలుగజేయువాడు, అభీష్టవృష్టి కురుపించువాడు
121.      గభస్తిభిః కిరణములద్వార ప్రయాణము చేయువాడు
122.     సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః మెలకువలోను, నిద్రలోను అన్ని జీవులలోను జ్యోతిస్వరూపుడై ఉన్నవాడు.
123.     అగ్నిహోత్రం చ కర్మ, పూజింపబడే,యజ్ఞము చేయబడే అగ్ని స్వరూపుడు
124.     ఫలం చ కర్మ ఫలితము
125.     ఏవ అగ్నిహోత్రిణాం కర్మను గ్రహించేవాడు
126.     వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ వేదాది కర్మలయొక్క ఫలితములను ఇచ్చువాడు
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ఈ కార్యములు సర్వము సమకూర్చువాడు ఈ సూర్యనారాయణ మూర్తియే.
ఈ విధంగా ఆదిత్యహృదయములో నిక్షిప్తమైన నామములయొక్క అంతరార్థమును భావిస్తూ అనునిత్యము పారయణ చేసినట్లయితే పై నామాలలో తెలిపిన ఫలములన్నియు నిస్సందేహముగ పొందగలమన్నది సత్యము. నమ్మకంతో ప్రమేయంలేకుండా కేవలం పారాయణచేతమాత్రమే ఫలములనొసగే కారుణ్యమూర్తి సూర్యభగవానుడు. ఈ ఆదిత్యహృదయ పారాయణ వలన సకలదేవతలను నిత్యము కొలిచిన పుణ్యఫలములను పొందవచ్చును.
ఇదే విషయము మనకు అనేక సందర్భాలలో మనకు ఋషులు అనేక మంత్రాలలో ఉపదేశించేరు.
అగస్త్యమహర్షి ఆదిత్యహృదయం ద్వారా సూర్యనారాయణమూర్తి, సర్వదేవాత్మక స్వరూపమని
“ సర్వదేవాత్మకో హి ఏషః తేజశ్వీ రశ్మిభావన” అని ఆదిత్యహృదయం లో చెప్పేరు.
భగవత్గీత లో
“యదాదిత్య గతం తేజః జగత్ భాసయతేఖిలం
యత్ చంద్రమసి యత్ చ అగ్నౌ తత్తేజో విద్ధిమామకం”
అని గీతాచార్యులైన శ్రీకృష్ణుడు చెప్పెను.
రుద్రనమకం లో
“సంకర్షణ స్స్వరూపో యోzసావాదిత్యః
పరమపురుష స ఏష రుద్రో దేవతా”  
అని మన రుద్రుని ధ్యానించుకొంటాము.
మరియు నమక అనువాకములో
“అసౌ యః తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః |
 యే ఏమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాః సహస్రశః అవైషాం హేడ ఈమహే ||
అసౌ యః అవసర్పతి నీలగ్రీవో విలోహితః
ఉత ఏనం గోపా అదృశన్ అదృశన్ ఉదహార్యః |
ఉత ఏనం విశ్వా భూతాని దృష్టో మృడయాతి నః ||
అని సూర్యభగవానుని స్తుతిస్తాము
శివ పురాణం లో
ఆదిత్యం చ శివం విద్యాత్ | శివమాదిత్య రూపిణమ్|
ఉభయోరంతరం నాస్తి| ఆదిత్యస్య శివస్యచ||
అని చెప్పేరు.
దక్షిణామూర్తి ఉపాసనలో

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్

వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః

అనగా అఖండమండలాకారంతో ఉండి ఆకాశంలాగ చర,అచరములన్నింటినీ వ్యాపించి ఉన్న సదాశివుడే ఈ ఆదిత్యుడు అని తెలుస్తుంది.
 
విష్ణుసహస్రనామ స్తోత్రంలో
“..........ఆదిత్యో జ్యోతిరాదిత్య........” ||60||
విహాయ సగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః” ||94||
అను అనేకచోట్ల విష్ణువుని సూర్యుస్వరూపంగా స్తుతించడం జరిగింది.
నారాయణ సూక్తంలో
అంతర్ బహిశ్చ తత్ సర్వం ....... అని చెప్పేరు.
శ్రీసూక్తంలో
హిరణ్యవర్ణాం ..... అని, హిరణ్మయీం..... అని, ......సూర్యాభాం శ్రియమీశ్వరీమ్ చంద్ర సూర్యాగ్ని వర్ణాభాం అని పలు చోట్ల శ్రీదేవిని వర్ణించడం జరిగింది.
లలితా సహస్రనామ స్తోత్రంలో
భానుమండల మధ్యస్థా..., అని లలితాదేవిని స్తుతించడం జరిగింది.
 
|| సర్వం శ్రీ సవితృ సూర్యనారాయణార్పణమస్తు||
గమనిక – సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనములు ద్వారా స్పందించి ఆదిత్యహృదయ పారాయణ గురించి నాకు అవగాహన అయిన విషయములను రాయడం జరిగింది. ఈ స్ఫూర్తిని నాకు కలిగించిన గురువుగారికి ఇవే నా కృతజ్ఞతాపూర్వక వందనములు.

 
సూర్య మండలములో సూర్యుని చుట్టూ మొత్తము 7 గణములు సూర్యమండాలాతర్గతుడైన ఆదిత్యుని సేవిస్తూ ఉంటారు. ఈ ఏడు గణములలో ఒక్కొక్క గణములో 12 మంది ఉన్నారు. ఆవిధముగా మొత్తము 84 గణములు నిత్యమూ ఆదిత్యుని సేవిస్తూ ఉంటారు. వీరు:-
1.            ఆదిత్యులు:
వీరే ద్వాదశాదిత్యులుగా పిలువబడతారు. వీరి పేర్లు దాత, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పర్జన్యాన్, పూషా, అంశుమాన్, గభస్తిమాన్, త్వష్ట, విష్ణు.
2.           అప్సరసలు: సూర్యునియొక్క రస (జల) తత్వ కిరణములకు అధిదేవతలను అప్ సరసలు అని పేరు. వీరి పేర్లు కృతస్థల, పుంజిస్థల, మేనక, సహజన్య, ప్లమ్లోచంతి, సుచిశ్మిత, ఘృతాచి, విశ్వాచి, ఊర్వశి, పూర్వచిత్త, తిలోత్తమ, రంభ.
3.           మునులు: పులస్త్యుడు, పులహుడు, అత్రి, వశిష్టుడు, అంగిరసుడు, భృగు, భరద్వాజ, గౌతముడు, కశ్యపుడు, క్రతువు, జమదగ్ని, కౌశికుడు.
4.           నాగులు: వాసుకి, కంకరీకుడు, తక్షకుడు, నాగుడు, ఏలాపుత్రుడు, శంఖపాలుడు, ఐరావతుడు, ధనంజయుడు, అగ్రమహాపద్ముడు, కర్కోటకుడు, కంబలుడు, అశ్వవలుడు.
5.           గ్రామణులు (యక్షులు): రథకృత్, రథౌజత్, రథచిత్ర, రథస్వన, శ్రోత, సుషేణ, అరణ, సేనజిత్, తార్క్ష్య, అరిష్టనేమి, రథజిత్, సత్యజిత్.
6.           రాక్షసులు: రక్షించే సూర్య శక్తులైన వీరు రక్షోహేతి, ప్రహేతి, పౌరుషేయ, వధ, సర్ప, వ్యాఘ్ర, చాప, వాత, విద్యత్, దివాకర, బ్రహ్మోపేత, యజ్ఞోపేత.
7.           గంధర్వులు: తుంబురు, నారద, హాహా, హూహూ, విశ్వావశు, ఉగ్రసేన, వరరుచి, సర్వావసు, చిత్రసేన, పూర్ణాయువు, దృతరాష్ట్ర, సూర్యవర్చసు.
సప్త అశ్వాలు (7) - ఇవి సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవ్యచస్, సంపద్వసు, అర్వాగ్వశు, స్వరాడ్వశు
సప్త గ్రహములు (7) – చంద్రుడు – సుషుమ్న, కుజ – సంపద్వసు, బుధ – విశ్వకర్మ, బృహస్పతి – అర్వాగ్వశు, శుక్ర – విశ్వవ్యచస్, శని- స్వరాట్, సూర్య - హరికేశ
సప్త చందస్సులు (7) - వీటి పేర్లు గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి.
 
పితృగణములు :

పితృ గణములు ముఖ్యముగా నాలుగు తెగలు వారు.

అగ్నిష్వాత్తులు, బర్హిషదులు,  ఆజ్యపులు మరియు  సోమపులు

వీరు జగత్తులో దేవలోకంలోను, అంతరిక్షములోను, మహీతలం (భూతలం) లోను వ్యాపించి ఉండి, జీవకోటిని నాలుగుదిశల నుండి పాలిస్తూఉంటారు

అగ్నిష్వాత్తులు – తూర్పు దిశనుండి

బర్హిషదులు – దక్షిణ దిశనుండి

ఆజ్యపులు – పశ్చిమ దిశనుండి

సోమపులు – ఉత్తర దిశనుండి

మరియు ఈ గణములు 31 వీరు

విశ్వులు, విశ్వభుక్ లు, ఆరాధ్యులు, ధర్ములు, ధన్యులు, శుభాననలు, భూతిదులు, భూతికృతులు, భూతిలు అనబడు తొమ్మిది(9) గణములు ఒక తెగవారు.

కల్యాణులు, కల్యదులు, కర్తా కల్యలు, కల్యతరాశ్రయులు, కల్యతా హేతులు, అనఘులు అనబడు ఆరు(6) గణములు ఒక తెగవారు.

వరలు, వరేణ్యులు, వరదులు, తుష్టిదులు,  పుష్టిదులు, విశ్వపాతులు, ధాతలు, అనబడు ఆరు(7) గణములు ఒక తెగవారు.

మహానులు, మహాత్ములు, మహితులు, మహిమావానులు, మహాబలులు అనబడు ఆరు(5) గణములు ఒక తెగవారు.

సుఖదులు, ధనదులు, ధర్మదులు, భూతిదులు అనబడు ఆరు(4) గణములు ఒక తెగవారు.

వెరశి ఏకత్రింశత్ (31) పితృగణములు జగత్తంతా వ్యాపించి ఉన్నారు.
 
 

 
 

No comments:

Post a Comment